పరిశ్రమల వృద్ధి పడిపోయింది!!
♦ మేలో 2.8 శాతానికి పడిపోయిన
♦ 8 పరిశ్రమల వృద్ధి రేటు
♦ గతేడాది మేలో ఇది 4.4 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు మే నెలలో నిరాశపరిచింది. 2015 మే నెలనాటి 4.4 శాతంతో పోలిస్తే 2016 మేలో వృద్ధిరేటు 2.8 శాతంగా నమోదయింది. ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. గతేడాది డిసెంబర్లో గ్రూప్ వృద్ధి రేటు 0.9 శాతం. ఆ తర్వాత ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదు ఇదే తొలిసారి. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో 8.5 శాతం వృద్ధి నమోదవడంతో ఈ రంగం రికవరీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మరుసటి నెలలోనే ఈ అంచనాలు నీరుగారిపోయాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమల వాటా దాదాపు 38 శాతం.
వివిధ పరిశ్రమల పనితీరు వేర్వేరుగా...
⇒ ఎరువుల రంగంలో వృద్ధి భారీగా 14.8 %గా నమోదయింది. 2015 మేలో ఈ రేటు 1.3%.
⇒ స్టీల్ రంగంలో ఈ వృద్ధి రేటు 2 శాతం నుంచి 3.2 శాతానికి పెరిగింది.
⇒ రిఫైనరీ ప్రొడక్టుల విభాగంలో 1.2% వృద్ధి (2015 మేలో 7.8% వృద్ధి) నమోదయ్యింది.
⇒ సిమెంట్ రంగంలో వృద్ధి 2.4 శాతం. 2015 మేలో ఈ రేటు 2.7 శాతం.
⇒ విద్యుత్‌లో వృద్ధి రేటు 2015 మేలో 6% ఉండగా, 2016 మేలో 4.6%కి తగ్గింది.
⇒ బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి రేటు 7.6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గింది.
⇒ క్రూడ్ ఆయిల్ విభాగంలో అసలు వృద్ధి లేకపోగా -3.3 శాతం క్షీణించింది.