‘రైల్ యాత్రి’లో నీలేకని పెట్టుబడులు
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణ సమాచార అప్లికేషన్(యాప్), వెబ్‌సైట్ రైల్‌యాత్రి.ఇన్‌లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పెట్టుబడులు పెట్టారు. అయితే, ఈ మొత్తం ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. నీలేకనితోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లయిన హీలియన్ వెంచర్స్, ఒమిడ్యార్ నెట్‌వర్క్స్, బ్లూమ్ వెంచర్స్ కూడా తాజాగా పెట్టుబడులు పెట్టిన వాటిలో ఉన్నాయని రైల్‌యాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. 2014లో ఆరంభమైన రైల్‌యాత్రి ఇప్పటివరకూ 3 మిలియన్ డాలర్లను(దాదాపు రూ.20 కోట్లు) సమీకరించినట్లు అంచనా.
రైళ్లలో ప్రయాణిస్తున్నవారి(క్రౌడ్ సోర్సింగ్) మొబైల్ జీపీఎస్ డేటా ఆధారంగా రైళ్లకు సంబంధించిన ప్రయాణ జాప్యాలను ఈ యాప్ అంచనావేసి ఇతర ప్రయాణికులకు అందిస్తుంది. సంబంధిత రైలు ఏ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుంది. కోచ్ పొజిషన్, ఆన్-టైమ్ హిస్టరీ, వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ గనుక తీసుకుంటే అది కన్ఫర్మ్ అవుతుందా లేదా వంటి సమాచారాలను కూడా ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. ఆధార్ పాజెక్టును విజయవంతం చేసిన యూఐడీఏఐ మాజీ చైర్మన్ నీలేకని వంటి టెక్నోక్రాట్ నుంచి పెట్టుబడులు అందుకోవడం తమకు గర్వకారణమని రైల్‌యాత్రి సహ వ్యవస్థాపకుడు కపిల్ రైజాదా వ్యాఖ్యానించారు.