ఇప్పుడు బీమా కూడా బెటరే!! | Insurance is better now | Sakshi
Sakshi News home page

ఇప్పుడు బీమా కూడా బెటరే!!

Published Mon, Apr 23 2018 2:00 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

Insurance is better now - Sakshi

సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నపుడే అంతా హడావుడిగా పన్ను మినహాయింపులందించే సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. అలా కాకుండా ముందస్తుగానే కొంత ప్లానింగ్‌ ఉంటే ఇటు పన్ను ప్రయోజనాలతో పాటు అటు ఆర్థిక లక్ష్యాలనూ సులభంగా చేరుకోవచ్చు. ఇందుకు బీమా చక్కని సాధనమని చెప్పాలి. పన్నులపరమైన మినహాయింపులు పొందేందుకు ఇప్పటిదాకా చాలా మంది పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు, పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మొదలైన వాటివైపే ఎక్కువగా మొగ్గు చూపేవారు.

అయితే, ఈ ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలతో రాబడులు, పన్నుల మినహాయింపులకు సంబంధించి పెట్టుబడుల తీరుతెన్నులు గణనీయంగా మారాయి. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్స్‌లో పెట్టుబడులపైనా దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ (ఎల్‌టీసీజీ) పన్ను విధించారు. దీంతో ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు పునరాలోచించుకునే పరిస్థితి ఏర్పడింది.

పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడితే వాటి రాబడులపై పన్నులు లేకపోయినప్పటికీ.. ఈ సాధనం ద్వారా వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. ఇక బ్యాంకుల్లో చేసే మూడేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు.. సెక్షన్‌ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపులున్నప్పటికీ.. వాటిపై వచ్చే వడ్డీలో కొంత భాగానికే ఈ ప్రయోజనం వర్తిస్తోంది. మరోవంక బీమా పథకాలు మాత్రం ఇటు పన్ను ఆదాకు... అటు చక్కని రాబడులిచ్చే ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ సాధనాలుగాను కూడా పనికొస్తున్నాయి.

అవసరాన్ని బట్టి పాలసీలు...
మీ అవసరాలు, పన్నులపరంగా పొందదల్చుకునే మినహాయింపులు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుని తీసుకోదగిన వివిధ రకాల పాలసీలున్నాయి. అవి..
టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌: దీన్ని ప్రధానంగా పెట్టుబడి సాధనంగా వర్గీకరించడానికి లేనప్పటికీ, భవిష్యత్‌లో పాలసీదారుకు ఏదైనా అనుకోనిది జరిగినా.. కుటుంబానికి ఇది ఆర్థిక భరోసా కల్పిస్తుంది. దీంతో మిగతా విషయాల గురించి తీవ్రంగా మథన పడాల్సిన పని లేకుండా పెట్టుబడులపై ఫోకస్‌ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ పాలసీ వ్యవధిలో పాలసీదారు గానీ మరణించిన పక్షంలో నామినీకి సమ్‌ అష్యూర్డ్‌ మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. తద్వారా సదరు పాలసీదారు కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. దీనికి పన్ను పరమైన మినహాయింపులు ఉన్నాయి. టర్మ్‌ ప్లాన్‌కి కట్టే ప్రీమియానికి కూడా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.
యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ (యులిప్స్‌): ఇన్వెస్ట్‌మెంట్‌పైనా, రాబడులపైనా, విత్‌డ్రాయల్‌పైనా మొత్తం మూడు స్థాయిల్లోనూ పన్ను ప్రయోజనాలు అందించే ప్లాన్‌ ఇది. యులిప్స్‌లో పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ కింద ట్యాక్స్‌ డిడక్షన్‌ వర్తిస్తుంది. అలాగే, దీనిపై వచ్చే రాబడులు కూడా సెక్షన్‌ 10 (10డీ) కింద మినహాయింపు లభిస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌పై దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ విధించడం వల్ల కూడా... యులిప్‌ తరహా పెట్టుబడి సాధనం ఆకర్షణీయంగా మారింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి రాబడులు ఒక స్థాయిని దాటితే వాటిపైనా టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌) విధిస్తున్న నేపథ్యంలో యులిప్‌లు ప్రయోజనకరమైనవేనని చెప్పొచ్చు.


హెల్త్‌ ఇన్సూరెన్స్‌
చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీలు అందించే ఆరోగ్య బీమా పాలసీపైనే ఆధారపడుతుంటారు. అలా కంపెనీ ఇచ్చేది మాత్రమే కాకుండా సొంత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఉండటం కూడా చాలా ముఖ్యం. ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 80డి కింద హెల్త్‌ పాలసీకి కట్టే ప్రీమియంకు సంబంధించి రూ. 25,000 దాకా డిడక్షన్‌ పొందవచ్చు. వయస్సు 60 ఏళ్లు పైబడిన తల్లిదండ్రుల కోసం హెల్త్‌ పాలసీ తీసుకుంటే.. దానికి కట్టే ప్రీమియంపై ట్యాక్స్‌ రిబేట్‌ను కేంద్రం ఇటీవలి బడ్జెట్‌లో రూ. 30,000 నుంచి రూ. 50,000 దాకా పెంచింది.

స్థూలంగా చెప్పేదేంటంటే ..
పన్నులు కట్టాల్సిన బాధ్యత ఆదాయం అందుకునే వారందరిపైనా ఉంటుంది. అయితే, ఆదాయ పన్ను చట్టాల నిబంధనలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తే.. చట్టబద్ధంగా పన్నులు ఆదా చేసుకోవడంతో పాటు మెరుగైన రాబడులొచ్చేలా స్మార్ట్‌గా పెట్టుబడులు పెట్టే వీలుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement