
స్టాక్ మార్కెట్‌కు బీమా జోష్
- ఐఎంఎఫ్ వృద్ధి అంచనాల పెంపు ప్రభావం
- మూడు రోజుల నష్టాలకు కళ్లెం
- మార్కెట్ అప్‌డేట్
ముంబై: ఈ వారంలో మొదటిసారిగా స్టాక్ మార్కెట్ లాభాలను కళ్లజూసింది. ఐటీసీ, బీమా రంగ సంబంధిత కంపెనీల షేర్లు పెరగడంతో మూడు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది.
బీమా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందన్న ఆశాభావం, భారత వృద్ధి అవకాశాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి అప్‌గ్రేడ్ చేయడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారు. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 271 పాయింట్లు, నిఫ్టీ 76 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీ 8,700 మార్క్‌ను దాటింది. బీమా బిల్లు ఆమోదం పొందితే సంస్కరణల జోరు పెరుగుతుందన్న ఆశాభావం మార్కెట్లో కనిపించిందని నిపుణులంటున్నారు.
చివరి వరకూ లాభాల్లోనే: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ చివరి వరకూ అదే జోరును కొనసాగింది. బుధవారం నాటి ముగింపు(28,659 పాయింట్లు)తో పోల్చితే 140 పాయింట్ల లాభంతో 28,799 పాయింట్ల వద్ద బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్రారంభమైంది. 312 పాయింట్ల లాభాన్ని(28,971 పాయింట్లు-ఇంట్రాడే గరిష్టం) చేరి చివరకు 271 పాయింట్ల లాభంతో (0.95%) 28,930 వద్ద ముగిసింది.
ఇక నిఫ్టీ 76 పాయింట్లు(0.87%) లాభపడి 8,776 వద్ద ముగిసింది. విద్యుత్తు, రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, రంగాల షేర్లు లాభాల బాట పట్టాయి. సిగరెట్ల ధరలను 15% వరకూ పెంచడంతో ఐటీసీ ధర 2.5% వృద్ధి చెంది రూ.347కు చేరింది. ఒక్కో షేరుకు రూ.12.5 చొప్పున ఇచ్చే బోనస్ డిబెంచర్లకు రికార్డ్ డేట్‌ను (ఈ నెల 23) ప్రకటించడంతో ఎన్‌టీపీసీ షేర్ 3.5% పెరిగి రూ.159.7 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 24 షేర్లు లాభపడ్డాయి. సెసా స్టెరిలైట్ 3. 6% లాభపడింది. అత్యధికంగా లాభపడ్డ సెన్సెక్స్ షేర్ ఇదే. 1,643 షేర్లు లాభాల్లో, 1,229 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,727 కోట్లు. ఎన్‌ఎస్‌ఈలో రూ.18,526 కోట్లు. ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,61,857 కోట్లు.
బీమా షేర్ల జోరు
గురువారం రాజ్యసభ ఆమోదానికి బీమా బిల్లు రావడంతో సంబంధిత షేర్లు1-11% రేంజ్‌లో పెరిగాయి. రాజ్యసభ ఆమోదం కూడా పొందుతుందనే అంచనాలతో బీమా అనుబంధ సంస్థలున్న ఆర్థిక సేవల కంపెనీల షేర్లు పెరిగాయి. రిలయన్స్ క్యాపిటల్ (11%), మ్యాక్స్ ఇండియా(5.3%), ఎక్సైడ్ ఇండస్ట్రీస్(4.8%), ఆదిత్య బిర్లా నువో(3.8%), రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ (2.69%), ఐసీఐసీఐ బ్యాంక్(1.6%), బజాజ్ ఫిన్‌సర్వ్(1.4%), హెచ్‌డీఎఫ్‌సీ (0.7%), ఎస్‌బీఐ (0.6%) పెరిగాయి.