
పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకులకు తక్కువ వడ్డీరేటుకు లభించే కాసా డిపాజిట్లు భారీగా పెరగడమే కాకుండా, ఇదే సమయంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వేగం అందుకున్నాయంటోంది ప్రభుత్వరంగ విజయా బ్యాంక్. దేశీయ బ్యాంకింగ్ రంగం భారీగా పెరిగిన నిరర్థక ఆస్తులు, వాటికి అధికంగా నిధుల కేటాయింపులు వంటి సమస్యలతో సతమతవుతున్నప్పటికీ... ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.ఏ శంకర్ నారాయణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పర్యటనకు వచ్చిన నారాయణ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు...
వచ్చే నెలతో పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తవుతోంది. నోట్ల రద్దు వల్ల బ్యాంకులు ఎదుర్కొన్న కష్టాలు ముగిసినట్లేనా. ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు?
పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రారంభంలో ప్రజలు ఇబ్బందులు పడినప్పటికీ మొత్తం మీద బ్యాంకులకు మేలే జరిగిందని చెప్పొచ్చు. తక్కువ వడ్డీరేటు ఉండే కాసా (కరెంట్, సేవింగ్స్) డిపాజిట్లు భారీగా పెరిగాయి. సగటున ప్రతీ బ్యాంక్ కాసా డిపాజిట్లు 10 శాతం చొప్పున పెరిగాయి.
పెద్ద నోట్ల రద్దుకు ముందు విజయా బ్యాంకు మొత్తం డిపాజట్లలో కాసా డిపాజిట్లు 19 శాతంగా ఉంటే నోట్లరద్దు తర్వాత అది 29 శాతానికి చేరింది. అలాగే డిజిటల్ లావాదేవీలు కూడా భారీగా పెరిగాయి. గతంలో చాలా తక్కువగా ఉండే డిజిటల్ లావాదేవీలు ఇప్పుడు 32 శాతానికి చేరుకున్నాయి. దక్షిణాది ప్రభుత్వరంగ బ్యాంకుల డిజిటల్ లావాదేవీల్లో మేము అగ్రస్థానంలో ఉన్నాం.
డిమోనిటైజేషన్, జీఎస్‌టీవల్ల ఆర్థిక వ్యవస్థ మందగించిన తరుణంలో రుణాలకు డిమాండ్ ఏ విధంగా ఉంది?
ఇప్పుడిప్పుడే కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరుగుతోంది. కానీ ఇదే సమయంలో రిటైల్ రుణాల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. మా బ్యాంక్ విషయానికి వస్తే మొత్తం రుణాల్లో ఈ ఏడాది 15 శాతం వృద్ధికి అవకాశం ఉండగా, రిటైల్ రుణాల్లో మాత్రం 28–30 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం.
ముఖ్యంగా హౌసింగ్, రెంటల్, ఎడ్యుకేషన్, ఎంఎస్‌ఎంఈ రుణ పథకాలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇదే సమయంలో డిపాజిట్లలో కూడా 15 శాతం వృద్ధి నమోదు అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం రూ.2.28 లక్షల కోట్లుగా ఉన్న వ్యాపారం వచ్చే మార్చి నాటికి 2.55 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం.
పెరిగిన నిరర్థక ఆస్తులు, వాటికి నిధుల కేటాయింపులు వల్ల ప్రభుత్వరంగ బ్యాంకులు మూలధనం కోసం ఇబ్బందులు పడుతున్నాయి. ఈ తరుణంలో విజయా బ్యాంక్‌కు ఎంత మూలధనం అవసరం ఉంది?
ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నుంచి నిరర్ధక ఆస్తులు పెరగడం కొద్దిగా నెమ్మదించడం ఆశావహం. గడిచిన త్రైమాసికంతో పాటు వచ్చే త్రైమాసికాల్లో కూడా మా బ్యాంకు నిరర్ధక ఆస్తులు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం.
అక్టోబర్ 26న ఫలితాలు ఉండటంతో వివరాలు పూర్తిగా చెప్పలేను. కానీ, ప్రస్తుతం మా బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 7 శాతం, నికర నిరర్థక ఆస్తులు 5 శాతం లోపు ఉన్నాయి. ఇతర ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉన్నాం. క్యాపిటల్ అడెక్వసీ రేషియో 13.5 శాతంగా ఉండటంతో అదనంగా ఎటువంటి మూలధనం అవసరం లేదు.
ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది? ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయా?
వివిధ రకాల ప్రచారం జరుగుతున్నా... అధికారికంగా ఆ దిశగా ప్రభుత్వంలో కానీ, బ్యాంకుల మధ్య కానీ ఎటువంటి చర్చలు జరగడం లేదు. ఆర్థిక మూలాల పరంగా చూస్తే చిన్న బ్యాంకుల్లో మేము మొదటి స్థానంలో ఉండగా, పెద్ద బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత మూడోస్థానం మాదే. కాబట్టి విలీనాలకు సంబంధించి చర్చలు జరిపే స్థాయిలో ఉన్నాం.
ఇప్పటికే వడ్డీరేట్లు కనిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో ఇవి ఇంకా దిగి వచ్చే అవకాశం ఉందా?
ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉండటంతో వడ్డీరేట్లు మరికాస్త తగ్గే అవకాశాలున్నాయి. వచ్చే పరపతి సమీక్షలో వడ్డీరేట్లు తగ్గుతాయో లేవో చెప్పలేం కానీ.. వచ్చే 12 నెలల కాలంలో మరో అరశాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నాం.
కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ఎటువంటి ఆర్థిక సాయం చేద్దామనుకుంటున్నారు?
రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాం. ఈ అంశం మీదే మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపాం. రాజధానిలో ఏర్పాటు చేయనున్న వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం రూ.5,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం
– సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment