
అంతా బాగున్నా.. అప్రమత్తత అవసరమే!
నా వయస్సు 50 సంవత్సరాలు. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. పన్ను ఆదా, లేదా పన్ను రాయితీ తదితర ప్రయోజనాలు నాకు అవసరం లేదు. నేను పదేళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి. నాకు కెనరా బ్యాంక్, ఎస్‌బీఐల్లో ఖాతాలున్నాయి. నా బ్యాంక్ ఖాతాల నుంచే నేను మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయాలా ?
–గంగాధర్, విజయవాడ
మీరు ఏదైనా ఒక బ్యాంక్ ఖాతా నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్ ఉంటే చాలు. నో యువర్ కస్టమర్(కేవైసీ) ప్రక్రియ పూర్తి చేయడానికి ఇవి అవసరం. ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంస్థ, ఒకసారి మీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసినట్లయితే, ఇతర సంస్థల ఫండ్స్‌లోనూ మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. మొదటి సారి ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఒకటి లేదా రెండేళ్లలో మ్యూచువల్ ఫండ్స్‌పై తగినంత అవగాహన వచ్చిన తర్వాత ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ, టాటా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కెనరా రొబెకొ సంస్థల బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో సొమ్ములున్నప్పటికీ, ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా, వాటిని సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి.
ఒక క్లోజ్‌డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్‌లో ఏడాది క్రితం నేను రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు నాకు అత్యవసరంగా కొంత సొమ్ము అవసరమైంది. ఈ క్లోజ్‌డ్ ఎండ్ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉందా ?
–మాధురి, విశాఖపట్టణం
క్లోజ్‌డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్‌లో మెచ్యూరిటీ తేదీలోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే అవకాశం లేదు. అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్ మార్కెట్లో షేర్ల మాదిరే లిస్టయి ట్రేడవుతుంటాయి. ఇలా మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను మీరు స్టాక్ మార్కెట్ ద్వారా విక్రయించుకోవచ్చు. ఈ తరహా ఫండ్స్‌లో ట్రేడింగ్ లావాదేవీలు చాలా స్వల్పంగా ఉంటాయి. ఈ మార్గంలో మీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించుకోవడం కొంచెం కష్టమైన పనే. ఈ యూనిట్లను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే ట్రేడర్లు చాలా తక్కువగా ఉంటారు. ఒకవేళ ఉన్నా, ఈ ఫండ్స్.. ఎన్‌ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) కంటే తక్కువగానే ట్రేడవుతాయి. ఫండ్స్ అసలు విలువ కంటే తక్కువకే మీరు అమ్ముకోవలసి రావచ్చు. మీకు కావలసిన సొమ్ముల కోసం స్నేహితులు, బంధువుల వద్ద ప్రయత్నించండి. లేదా మీరు ఈక్విటీ, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈ యూనిట్లు తనఖాగా కొన్ని బ్యాంక్‌లు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణం పొందవచ్చు. రుణ మొత్తం, కాలపరిమితి ఆధారంగా వడ్డీరేట్లు 10–12 శాతం రేంజ్‌లో ఉంటాయి. మీ యూనిట్ల విలువలో 70 శాతం వరకూ రుణం వచ్చే అవకాశం ఉంటుంది. రుణ చెల్లింపుల్లో విఫలమైతే, ఆ సంస్థ, తనఖా ఉంచుకున్న ఫండ్ యూనిట్లను విక్రయించుకొని, ఏవైనా మిగిలితే రుణ గ్రహీతకు ఇస్తుంది.
నేను గత కొంతకాలంగా నాలుగు బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌కు సంబంధించి చాలా సానుకూలాంశాలు చోటు చేసుకుంటున్నాయి. స్టాక్ సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అమెరికా, ఇతర విదేశీ మార్కెట్లు బాగా ఉన్నాయి. వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. చమురు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విధానాలు మెరుగవుతున్నాయి. ఇన్ని సానుకూలాంశాల నేపథ్యంలో సాధారణ ఇన్వెస్టర్ ఎలా వ్యవహరించాలి ?
–సురేందర్, హైదరాబాద్
స్టాక్ మార్కెట్‌కు సంబంధించి పలు సానుకూలాంశాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇప్పుడు కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. స్టాక్ మార్కెట్లోకి నిధుల ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ ఉంది. కానీ ఆ స్థాయిలో కంపెనీల ఆర్థిక ఫలితాలు మెరుగుపడటం లేదు. కంపెనీల ఆర్థిక ఫలితాలు మెరుగుపడకుండా మార్కెట్ పెరుగుతుండటమంటే.. మార్కెట్ ఖరీదవుతుందని(అధిక వేల్యుయేషన్) అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఫండ్ మేనేజర్లు జాగ్రత్తగానే వ్యవహరిస్తారు. మీరు నాలుగు బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారని పేర్కొన్నారు. సాధారణంగా బ్యాలన్స్‌డ్ ఫండ్స్ తమ మొత్తం నిధుల్లో 30–35 శాతం వరకూ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మార్కెట్ పెరుగుతున్నప్పుడు బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఫండ్ మేనేజర్లు లాభాల స్వీకరణ చేస్తారు. అందుకని నష్టభయం(రిస్క్) తగ్గించుకునే ఫండ్స్‌గా బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను పరిగణిస్తారు. ఇక సాధారణ ఇన్వెస్టర్లు నష్టభయాన్ని తగ్గించుకోవడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది.. భవిష్యత్తులో వచ్చే ఒడిదుడుకులకు సిద్ధపడి, మీ ఇన్వెస్ట్‌మెంట్ కాలాన్ని పెంచుకోవడం, ఇక రెండోది మీ మొత్తం మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లోనే ఉన్నట్లయితే, కొంత ఇన్వెస్ట్‌మెంట్‌ను డెట్ ఫండ్స్‌లోకి మళ్లించండి. ఒకేసారి ఇలా కాకుండా దశలవారీగా ఈ మళ్లింపు ప్రక్రియను చేపట్టిండి. కంపెనీల ఆర్థిక ఫలితాలు మెరుగుపడితే మార్కెట్ ఎంతోకాలం ఖరీదైనదిగా ఉండదు.