
శ్రీనిధి (32) ఎంఎన్‌సీ కంపెనీలో మానవ వనరుల విభాగంలో పనిచేస్తోంది. గతేడాది నుంచి ఆమె ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా పెట్టుబడి పెడుతోంది. ఇటీవలి మార్కెట్ల పతనం నేపథ్యంలో ఆమె తన పోర్ట్‌ఫోలియోపై రాబడులను పరిశీలించింది. అవేమో కాస్త నష్టాల్లో ఉన్నాయి. శ్రీనిధి తెల్లబోయింది. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో సంపద సమకూరుతుందని, లక్ష్యాలు సులభంగా చేరుకోవచ్చని నిపుణులు చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. అవి నిజమేనా? అని డైలమాలో పడింది. నిజానికిది శ్రీనిధి ఒక్కరి సమస్యే కాదు.
ఈ మధ్య మార్కెట్లోకి ప్రవేశించి సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టిన వారిలో చాలా మందికి నష్టాలే ఎదురవుతున్నాయి. వారు అవి చూసి ఆందోళన చెందుతున్నారు. దీన్ని కొనసాగించాలా... వద్దా? అనే డైలమాలో పడ్డారు కూడా. కాకపోతే, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారు ఈ తాత్కాలిక నష్టాలను చూసి ఆందోళన చెందక్కర్లేదన్నది నిపుణుల మాట. ఇలా పడ్డప్పుడే సిప్‌ను కొనసాగించాలని, అపుడు పెరిగితే మంచి లాభాలు చూడవచ్చనేది వారి సూచన. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
మార్కెట్లు పడితే మంచిదే...
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను (సిప్) ఆపేద్దామని నిర్ణయించుకుంటే లేదా ఇప్పటి వరకు వచ్చిన లాభాలు చాల్లేనని వాటిని వెనక్కి తీసుకుందామనుకున్నా దాని కంటే ముందు మీరు పరిశీలించాల్సినవి ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించి కనీసం మూడు నుంచి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమే అయితే కచ్చితంగా మంచి లాభాలతో ఉండి ఉంటారు. కాబట్టి తాజా పతనంలో ఆ లాభాల శాతం తగ్గిందని అమ్మేయడం సరికాదు.
ఒకవేళ మీరు గడిచిన ఏడాది లేదా రెండేళ్లుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, తాజా మార్కెట్ల పతనం నిజంగా మీకంటూ లభించిన ఓ అవకాశం. మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు ఫండ్ యూనిట్లు గానీ, షేర్లు గానీ అధిక ధర పెట్టి కొనాలి. అవే యూనిట్లు ఈ సమయంలో చాలా డిస్కౌంట్ రేటుకే కొనుగోలు చేయొచ్చు. కాబట్టి దీన్నో చక్కని అవకాశంగా చూడాలి. ఉదాహరణకు రూ.10,000ను సిప్ రూపంలో ఓ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. దాని ఎన్‌ఏవీ రూ.200. రూ.10,000 పెట్టుబడికి 50 యూనిట్లు వస్తాయి.
కరెక్షన్ సమయంలో ఈ ఎన్‌ఏవీ రూ.175కు తగ్గిపోయిందనుకోండి. రూ.10వేల పెట్టుబడికి 57.14 యూనిట్లు వస్తాయి. ఓ రెండు నెలల తర్వాత మార్కెట్ల రికవరీతో మీ ఫండ్ ఎన్‌ఏవీ తిరిగి రూ.250కు వెళితే అదనంగా వచ్చిన 7.14 యూనిట్లపై రూ.535 లాభం వచ్చినట్టు. అయితే మార్కెట్లు నెలా, రెండు నెలల్లో రికవరీ అవ్వాలనేమీ లేదు. ఇంకా ఎక్కువ సమయమే తీసుకోవచ్చు. అయినా కానీ, మార్కెట్లు దిద్దుబాటుకు గురైన సమయంలో తక్కువ ఎన్‌ఏవీల వద్ద ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడం వల్ల కాస్తంత ఆలస్యమైనా మంచి రాబడులు కనిపిస్తాయి.
ఇన్వెస్టింగ్‌లో రిస్క్ ఉంటుంది...
ఇక తాజా కరెక్షన్ మార్కెట్లు అధిక విలువల వద్ద ఇన్వెస్ట్ చేస్తే ఉండే రిస్క్‌ను తెలియజేసింది. గతేడాది మార్చిలో నిఫ్టీ 23 పీఈవో వద్ద ఉంటే, మిడ్‌క్యాప్ సూచీ 33–49 పీఈ స్థాయిలో, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 45 పీఈల వద్ద ఉన్నాయి. ఆ విలువల వద్ద పెట్టుబడులు మొదలు పెట్టిన వారికి సమీప కాలంలో లాభాలు ఆర్జించే అవకాశాలు తక్కువేనని ‘పర్సనల్ ఫైనాన్స్ ప్లాన్ డాట్ ఇన్’ వ్యవస్థాపకుడు దీపేశ్ రాఘవ్ చెప్పారు.
అయినప్పటికీ సిప్ కొనసాగిస్తే దీర్ఘకాలంలో చక్కని రాబడులు అందుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ‘‘ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కనీసం 7–10 ఏళ్ల కాల వ్యవధికి సిద్ధపడాలి. ఒకవేళ మార్కెట్లు గరిష్ట విలువల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినాగానీ 7–10 ఏళ్ల కాలంలో మరోసారి గరిష్టాలకు వెళ్లే అవకాశం దాదాపుగా ఉంటుంది. ఆ గరిష్టాలు అంతకు ముందు స్థాయి కంటే ఎక్కువే అయి ఉంటాయి’’ అని దీపేశ్ చెప్పారు.
కరెక్షన్ అవసరమే...
ఇటీవలి బుల్ రన్‌లో లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపించాయి. నిజానికి ఈ తరహా పథకాలు మార్కెట్లు పెరుగుతున్నప్పుడు వేగంగా పెరగడం, పడిపోతున్నప్పుడు అంతే వేగంగా పతనం అవడం జరుగుతుంటుంది. అందుకే రిస్క్ ఎక్కువ తీసుకోలేని వారు మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ముందు ఆ పెట్టుబడుల కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈక్విటీల్లో 70–75 శాతం వరకు పెట్టుబడులను లార్జ్ క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవాలని, మిగిలిన 25–30 శాతం పెట్టుబడులను స్మాల్, మిడ్ క్యాప్స్‌లో ఉండేలా చూసుకోవాలన్నది ఆర్థిక సలహాదారుల సూచన. ఇక తమ మిగులు నిల్వలన్నింటినీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, వాటి విలువలు పెరుగుతున్న కొద్దీ డైవర్సిఫై చేసుకోవాలి.
కొంత మేర నిధుల్ని బంగారం, డెట్ సాధనాల్లోకి మళ్లించుకోవడం ద్వారా రిస్క్ పరిమితం చేసుకోవచ్చు. ‘‘ప్రతీ ఆరు నెలలకోసారి మీ ఫండ్ పనితీరును పరిశీలించుకోవాలి. ఆ ఫండ్ పనితీరు ఆ విభాగంలోని మిగిలిన పథకాల కంటే, బెంచ్ మార్క్ సూచీ కంటే వెనుకబడిందా అన్నది గమనించుకోవాలి’’ అని ఆర్థిక సలహాదారు ఆర్ణవ్ పాండ్యా సూచించారు.
ఇలాంటపుడే సిప్ కొనసాగాలి
మార్కెట్లు పడుతున్న ఇలాంటి సమయంలో యువ ఇన్వెస్టర్లు సిప్‌లను ఆపేసి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని పొరపాటు చేయవద్దని ఎక్కువ మంది విశ్లేషకులు, ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. తమ పెట్టుబడులను, సిప్‌లను కొనసాగించాలనే చెబుతున్నారు.
‘‘సిప్ ప్రధాన ఉద్దేశం మార్కెట్లు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు నిరాటంకంగా పెట్టుబడులను కొనసాగించడమే. కరెక్షన్ వల్ల మార్కెట్ల వ్యాల్యూషన్లు చౌకగా మారిన సమయంలో మీ సిప్‌ను ఆపేయడం తెలివైన పని కాదు. సిప్‌పై నెగెటివ్ రిటర్న్‌లు వచ్చిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి.
2008–09, 2012–13లో ఇలానే జరిగింది. ఆ సమయంలో నష్టాలను చూసి సిప్ ఆపేసిన ఇన్వెస్టర్లు లాభాలను మిస్సయ్యారు. నష్టాలు వచ్చినప్పటికీ సిప్ కొనసాగించిన వారు మాత్రం మార్కెట్లు వృద్ధిలోకి వచ్చిన తర్వాత లాభాలను కళ్లజూశారు’’ అని కోటక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎండీ నీలేశ్ షా వ్యాఖ్యానించారు.