
ఆన్‌లైన్ షాపింగ్ ఎంత సులభమో... ఇన్వెస్ట్ చేయడాన్ని కూడా అంతసులభతరం చేస్తున్నాయి కొన్ని మొబైల్ అప్లికేషన్లు (యాప్స్). ఎన్నో స్టార్టప్ సంస్థలు ఇలా వివిధ లక్ష్యాలకు సంబంధించిన యాప్స్‌తో యూజర్ల ముందుకు వచ్చేస్తున్నాయి. ఏ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవాలి..? ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? డెట్ ఫండ్స్‌కు ఎంత కేటాయించాలి..? అన్నది తెలియకపోతే ఆందోళన చెందక్కర్లేదు. ఇటువంటి యాప్స్‌తో సులభంగానే ఆ పని చేసేసుకోవచ్చు. కేవలం మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, ఓపెన్ చేయడం, తర్వాత కొన్ని క్లిక్‌లతో ఒకటి రెండు నిమిషాల్లోపే పనిపూర్తవుతుంది.
ఉదాహరణకు ఓ ఇంటి కొనుగోలుకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యాప్‌ను ఓపెన్ చేసి ఎంత కాల వ్యవధి, ఎంత మొత్తం అవసరం అన్న వివరాలను అక్కడ నమోదు చేస్తే చాలు. అలాగే, ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలను యాప్ సంధిస్తుంది. వాటికి సమాధానం ఇచ్చేస్తే... ప్రతీ నెలా ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి, అలాగే మీ లక్ష్యాలకు సరిపోలే ఈక్విటీ, డెట్ ఫండ్స్ వివరాలను యాప్ సూచిస్తుంది. ప్రతి పథకంలో ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్న సమాచారం కూడా ఇస్తుంది. ఎంపిక చేసుకుని, నెలలో సౌకర్యమైన తేదీ ఇచ్చేస్తే, ప్రతి నెలా ఆ తేదీన సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రణాళిక సిద్ధమైనట్టే. అయితే వీటిల్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ‘‘ఇవి పరిమిత ఉత్పత్తులనే ఆఫర్ చేస్తాయి. ఒకవేళ మీరు రిటైర్మెంట్‌ను లక్ష్యంగా ఎంచుకుంటే సంబంధిత వ్యక్తులు అప్పటికే ఈపీఎఫ్, పీపీఎఫ్ పథకాల్లో చేసే పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రణాళికను డిజైన్ చేసి చూపిస్తాయి. రిటైర్మెంట్ ప్రణాళికల్లో ఈపీఎఫ్, పీపీఎఫ్ అన్నవి చాలా ముఖ్యమైనవి’’ అని ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్ మ్రిన్ అగర్వాల్ వివరించారు.
అన్నీ గోల్ ఆధారితమైనవి కావు...
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే విషయమై ఇన్వెస్టర్లకు సాయపడే యాప్స్ డజనకు పైనే ఉన్నాయి. వీటిల్లో పేటీఎం మనీ, మొబిక్విక్, జెరోదా కాయిన్, గ్రోవ్ తదితర యాప్స్ ప్రముఖమైనవి. ఈ యాప్స్ డిఫాల్ట్‌గా కొన్ని ఫండ్స్‌ను షార్ట్ లిస్ట్ చేసి బెస్ట్ ఈక్విటీ ఫండ్స్ లేదా డెట్ ఫండ్స్ అంటూ ఆ సమాచారం కనిపించేలా ఉంచుతాయి. వీటిని ఎంచుకునే వారు తమ వంతుగా అధ్యయనం చేసుకోవాలన్నది సలహా. ‘‘లావాదేవీలను సులభతరం చేయడం, నిర్వహించడంపైనే మా దృష్టంతా. యూజర్ సిప్‌ను ఆరంభించేందుకు, తిరిగి దాన్ని సవరించుకునేందుకు ఎటువంటి పేపర్ పని అవసరం ఉండదు. ఇన్వెస్టర్ ఇన్‌స్టంట్‌గా ఈ పని చేసుకోవచ్చు’’ అని అన్నారు గ్రోవ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హర్‡్షజైన్. ఫిస్‌డమ్, కువెరా, ఓరోవెల్త్, గోల్‌వైజ్, స్క్రిప్‌బాక్స్ అనే సంస్థలు లక్ష్యం ఆధారిత ఫండ్స్‌ను సిఫారసు చేయడంతోపాటు, అస్సెట్ అలోకేషన్ సేవలను అందిస్తున్నాయి. ఇన్వెస్టర్ల భిన్న అవసరాలకు అనువైన సాధనాలను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. ఉదాహరణకు ఫిస్‌డమ్ సంస్థ టర్మ్ ఇన్సూరెన్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్, డిజిటల్ గోల్డ్ వంటి సేవలను ఆఫర్ చేస్తోంది. ఓరోవెల్త్ అయితే, ఫైనాన్షియల్ ప్లానర్‌తో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. కాకపోతే ఇందుకు కొంత చార్జ్ చెల్లించుకోవాలి. గోల్‌వైజ్‌లో అయితే ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌తో ఉచితంగానే సంప్రదింపులు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు కుటుంబ సభ్యులు అందరికీ కలిపి ఒకటే ఖాతాను అందిస్తున్నాయి. అంటే కుటుంబ సభ్యులందరి పెట్టుబడులను ఒకే ఖాతాతో నిర్వహించుకోవచ్చు.
ఆరంభానికి మంచిది...
ఆర్థిక ప్రణాళిక అన్నది చాలా విస్తృతమైనది. ఆర్థిక సలహాదారులు అయితే ఓ ప్రణాళికను రూపొందించడంతోపాటు ఏటా దాన్ని సమీక్షించి ఇన్వెస్టర్ల అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా సవరిస్తుంటారు. అయితే, చాలా మంది ఇన్వెస్టర్ల రిస్క్ ప్రొఫైల్ అన్నది వారి పెట్టుబడుల్లో వచ్చిన లాభాలు, నష్టాల ఆధారంగా మారుతుంటుంది. కనుక సలహాదారులు రిస్క్‌ను తట్టుకునే పోర్ట్‌ఫోలియోను సూచిస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్, ఇతర సాధనాలతో కూడిన పోర్ట్‌ఫోలియోను డిజైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇన్వెస్టర్ల పెట్టుబడులకు రక్షణ ఉంటుంది. కానీ, పైన చెప్పుకున్న మొబైల్ యాప్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సమీక్ష, రక్షణ బాధ్యతలకు దూరమేనంటున్నారు నిపుణులు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు తగిన సూచనలు చేసినందుకు గాను ఏటా రూ.15,000 నుంచి రూ.40,000 వరకు చార్జ్ చేస్తుంటారు. మొబైల్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్‌ను ఎక్కువగా వినియోగించే వారిలో అధిక శాతం మిలీనియల్స్ (1981–96 మధ్య జన్మించిన వారు) కావడం గమనించాలి. వీరిలోనూ ఎక్కువ మంది మొదటిసారి ఇన్వెస్టర్లే. ‘‘30 ఏళ్లలోపు వారిలో ఎక్కువ మంది స్వల్పకాల అవసరాల కోసం పొదుపు చేయడానికి కూడా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు పొదుపు విషయంలో సాయపడుతున్నాయి’’ అని వైజ్‌లీ సీఈవో విజయ్‌బొబ్బ పేర్కొన్నారు. ఈ సంస్థ యువతను గుర్తించి వారికి స్వల్పకాల అవసరాల (300 రోజుల్లోపు) కోసం పొదుపు చేయడాన్ని ప్రోత్సహిస్తోంది. మొదటిసారి ఇన్వెస్ట్ చేసే వారికి నిజంగానే ఆన్‌లైన్ ఓ మార్గసూచిగా ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ యాప్స్‌లో సేవలపై చార్జీలు చాలా తక్కువ. పోటీ కారణంగా చాలా సంస్థలు ఇప్పటికైతే ప్రాథమిక సేవలను ఉచితంగానే ఆఫర్ చేస్తున్నాయి. చాలా సంస్థలు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్లనే అందిస్తున్నాయి. ‘‘వయసు, బాధ్యతలు, ఆదాయం, అవసరాలన్నవి వ్యక్తులను బట్టి మారిపోతుంటాయి. 30 ఏళ్ల పైన వయసు ఉన్న వారిలో ఎక్కువ మందికి సాధారణంగా కుటుంబం ఉంటుంది. వీరికి మరింత సమగ్రమైన ప్రణాళిక అవసరం అవుతుంది. వీరికి పోర్ట్‌ఫోలియో నిర్మాణం అన్నది క్లిష్టమైనది కూడా. ఈ తరహా అవసరాలున్న వారికి ఫోన్ ద్వారా సలహా సేవలను అందిస్తున్నాం. వారి అవసరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సూచనలు చేస్తాం’’ అన్నారు. గోల్‌వైజ్ డాట్ కామ్ సహ వ్యవస్థాపకుడు అంకుర్‌చౌదరి.
ఫండ్స్ సిఫారసుల పట్ల జాగ్రత్త!
దాదాపు అన్ని ఇన్వెస్టింగ్ యాప్స్ భిన్న అంశాల ఆధారంగా ఫండ్స్‌ను విశ్లేషించే అల్గోరిథమ్స్ (సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్)ను వినియోగిస్తున్నాయి. మరి ఈ అంశాల్లో కొంత తేడా ఉన్నా ఫలితం పూర్తి భిన్నంగానూ రావచ్చు. ఉదాహరణకు ఓ ప్లాట్‌ఫామ్, మ్యూచువల్ ఫండ్స్ పథకాల పనితీరు విశ్లేషణకు ఐదేళ్ల పనితీరును పరిగణనలోకి తీసుకుంటే, మరో ప్లాట్‌ఫామ్ మూడేళ్ల పనితీరునే పరిగణించొచ్చు. ఇలాంటప్పుడు ఫలితం కూడా మారిపోతుంది. మొబైల్ ఇన్వెస్టింగ్ యాప్స్ విషయంలో ఇదే జరుగుతుంటుంది. ఓ వ్యక్తి రిస్క్ ప్రొఫైల్, లక్ష్యం, కాల వ్యవధికి రెండు ప్లాట్‌ఫామ్‌లు భిన్నమైన పథకాలు, అస్సెట్ అలోకేషన్‌ను సిఫారసు చేయవచ్చు. అందుకని, ఫండ్స్ ఎంపికకు పరిగణనలోకి తీసుకున్న అంశాల వివరాలను వెబ్‌సైట్‌లో ఇన్వెస్టర్లకు తెలియజేసేలా అందుబాటులో ఉంచడం వంటి పారదర్శకత పాటించే యాప్స్‌ను ఆశ్రయించడం మంచిదన్న సూచన నిపుణుల నుంచి వస్తోంది. అలాగే, కొన్ని ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు సిఫారసుల విషయంలో కనీస సూత్రాలను కూడా పాటించకపోవచ్చు. ఉదాహరణకు రెండేళ్ల తర్వాత వెకేషన్ లక్ష్యం కోసం గిల్ట్‌ఫండ్‌లో నూరు శాతం ఇన్వెస్ట్ చేసుకోవాలని సూచించొచ్చు. కానీ, గిల్ట్ ఫండ్స్ చాలా అస్థిరతలతో కొనసాగుతుంటాయి. సాధారణంగా వీటిల్లో పెట్టుబడులకు ఆర్థిక సలహాదారులు సిఫారసు చేయరు. ఇలా ఆయా ఇన్వెస్టింగ్ యాప్స్‌ను బట్టి సిఫారసులు భిన్నంగా ఉండొచ్చు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సంబంధించి ప్రాథమిక విషయ సమాచారాన్ని తెలుసుకోవడం అవసరమంటున్నారు నిపుణులు. లేదంటే వీటిని నమ్ముకోకుండా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment