
సరళ పన్ను వ్యవస్థను దుర్వినియోగం చేయొద్దు..
కార్పొరేట్లకు ఆర్థిక మంత్రి జైట్లీ హెచ్చరిక...
న్యూఢిల్లీ: సరళీకృత పన్నుల వ్యవస్థను దుర్వినియోగం చేయొద్దంటూ కార్పొరేట్ కంపెనీలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ప్రపంచమంతా మరింత పారదర్శక పన్నుల వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో చట్టవిరుద్ధమైన లావాదేవీలన్నీ బయటపడకతప్పదని ఆయన పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సరళమైన, తక్కువ పన్ను రేట్ల జమానాలో ప్రతి వ్యక్తీ, అదేవిధంగా కంపెనీలైనా చట్టప్రకారం నడుచుకోవాల్సిందే.
అదే వారికి సురక్షితం కూడా. అలాకాకుండా తమ మోసాలను ఎవరూ కనిపెట్టలేరన్న భ్రమల్లో ఉంటే ఇబ్బందుల్లో పడటం ఖాయం. అలాంటి మోసపూరిత చర్యలకు కాలం చెల్లింది’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. పన్నులకు సంబంధించి ఆటోమేటిక్ సమాచార మార్పిడి కోసం జీ20 దేశాలు ఆమోదించిన పారదర్శక వ్యవస్థ 2017 కల్లా ఆచరణలోకి రానుందని కూడా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ చర్యలతో 9-10 శాతానికి వృద్ధి...
పెట్టుబడుల పెంపు.. అదేవిధంగా పన్ను సంస్కరణల కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వచ్చే కొన్నేళ్లలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 9-10 శాతాన్ని అందుకునే అవకాశం ఉందని జైట్లీ చెప్పారు. దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయ రంగాల్లో కీలకమైన చర్యలు తీసుకున్నాం. రైతులకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ప్రధానంగా సాగునీటిపై దృష్టిసారించాం’ అని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో అవినీతికి చోటు లేదన్నారు. స్పెక్ట్రం, బొగ్గు గనులు ఇలా విలువైన సహజ వనరులేవైనాసరే వేలం ద్వారా పారదర్శకమైన విధానంలో కేటాయిస్తున్నామని చెప్పారు.
బొగ్గు ఇతరత్రా గనుల వేలంతో వచ్చే ఆదాయాన్ని సంబంధిత రాష్ట్రాలకు చెందేలా కూడా తమ సర్కారు చర్యలు చేపడుతోందని వెల్లడించారు. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8-8.5 శాతానికి చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుకు శాయశక్తులా కృషిచేస్తున్నామన్నారు. మనవద్ద తగినన్ని విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్న నేపథ్యంలో గత కొద్ది నెలలుగా డాలరుతో రూపాయి మారకం విలువ స్థిరంగా(ప్రస్తుతం 63 స్థాయిలో ఉంది) కొనసాగుతోందని జైట్లీ చెప్పారు.