కొత్త ఏడాదైనా కాస్త మారదాం..! | Investments in new year | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదైనా కాస్త మారదాం..!

Published Mon, Jan 8 2018 1:06 AM | Last Updated on Mon, Jan 8 2018 1:06 AM

Investments in new year - Sakshi

మరో సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం.  మరి ఆర్థికాంశాలకు సంబంధించి ఎప్పుడూ ఏవేవో సాకులు చెప్పుకుంటూ వాయిదాలు వేస్తూ వస్తున్న వారు ఇప్పటికైనా సరైన ప్రణాళిక వేసుకున్నారా? లేదనుకోండి... ఇకనైనా ఆలస్యం చెయ్యకండి. ఎందుకంటే గమ్యంపై స్పష్టత ఉంటేనే ప్రయాణం వేగంగా, సాఫీగా సాగుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనుసరించదగ్గ ఆర్థిక తీర్మానాల గురించి నిపుణులు, ఆర్థిక సలహాదారులు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం...


ఆలస్యం విషమే!
కొత్తవారైతే ముందు 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెక్షన్‌ 80సీ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే పెట్టుబడులకింకా మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది. మార్చిలోపు పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. చివరి నిమిషం వరకు వాయిదా వేస్తే ఆఖర్లో ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్‌ చేయాల్సి వస్తుంది.

అదే ముందుగా ఆరంభిస్తే వయసు, అవసరాలు, రిస్క్‌ తీసుకోగల స్థాయి, రాబడులు, అవసరంలో నగదు చేసుకోగల వెసులుబాటు వంటివన్నీ పరిశీలించి తగిన సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఏప్రిల్‌ నుంచి ఆర్థిక సంవత్సరం ఆరంభం అవుతుంది కనక కనీసం జూన్‌ నుంచయినా పన్ను ఆదా పెట్టుబడులను ఆరంభించి ఏడాది పాటు కొనసాగించాలి. ముందుగా ఆరంభించడం వల్ల కాంపౌండింగ్‌ ప్రయోజనంతో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది.

సకాలంలో రిటర్నులు వేయండి...
మనలో కొందరు పన్ను రిటర్నులను సకాలంలో దాఖలు చేయరు. ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ఆలస్యమైతే వడ్డీతో పాటు పెనాల్టీ కూడా భరించాలి. గడువులోపు రిటర్నులు వేయకపోతే ఆలస్య రుసుం గతంలో రూ.1,000గా ఉండగా అదిప్పుడు రూ.10,000గా మారింది. అందుకే గడువులోపు రిటర్నులు ఫైల్‌ చేయాలి. గడువులోపు బీమా పాలసీల ప్రీమియం చెల్లించడం కూడా అవసరమే. లేదంటే బీమా రక్షణ కోల్పోవాల్సి వస్తుంది. ఇంకా రుణాలకు సకాలంలో చెల్లింపులు చేయడం కూడా తప్పనిసరి. ఎందుకంటే ఆలస్యమైతే అనవసర వడ్డీ భారంతో పాటు క్రెడిట్‌స్కోరు కూడా తగ్గిపోతుంది.

క్రెడిట్‌ కార్డు బిల్లు మొత్తం కట్టేస్తే బెటర్‌!
చాలా మందికి క్రెడిట్‌ కార్డుపై భారీ మొత్తం వాడటం, నెలయ్యేసరికి ఎంతో కొంత కనీస బిల్లు చెల్లించటం అలవాటు. కానీ అలా చేయటం వల్ల వారి మొత్తం రుణం ఎప్పటికీ తీరదనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బ్యాలెన్స్‌ మొత్తంపై దాదాపు నెలకు 2.5 నుంచి 3 శాతం వడ్డీ అంటే ఏడాదికి 30–36 శాతం చెల్లించాల్సి వస్తుంది.

దీనికి ఆలస్యపు చెల్లింపుల ఫీజు కూడా తోడైతే ఇక చెప్పనక్కర్లేదు. అందుకే కార్డుపై వీలైనంత తక్కువ వాడటం... ఏ నెలకు ఆ నెల మొత్తం బిల్లు చెల్లించేయటం చేస్తుండాలి. రుణ సమస్యల్లో ఉన్న వారు ముందుగా తీర్చేయాల్సింది క్రెడిట్‌ కార్డు బకాయిలే. రివాల్వింగ్‌ క్రెడిట్‌కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.

జీవితానికీ కవరేజీ తప్పనిసరి..
లైఫ్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చాలా అవసరం. ఎందుకంటే జీవితం, ఆరోగ్యం అన్నవి ఇలానే ఉంటాయని ఊహించలేం. అనారోగ్యం పాలైతే అయ్యే వ్యయాలు బడ్జెట్‌ను గుల్ల చేసేస్తాయి. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి దూరమైతే ఆ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి.

అందుకే తమ వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర బీమా పాలసీ తీసుకోవడం మరవద్దు. ఏవైనా రుణాలు తీసుకుని ఉంటే వాటికి సరిపడా బీమా కవరేజీ పెంచుకోవాలి. జీవిత బీమాకు టర్మ్‌ పాలసీలు ఉత్తమం. తక్కువ ప్రీమియానికే గణనీయమైన కవరేజీనిస్తాయి. అలాగే రూ.4–5 లక్షల కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌పాలసీ కూడా తీసుకోవాలి.

ఖర్చుల్లో స్మార్ట్‌గా...
ఆరు నెలల అవసరాలను తీర్చే స్థాయిలో ఓ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం  అవసరం. అనుకోని, అనూహ్య, అత్యవసరాలు ఏర్పడితే ఆదుకుం టుంది. ఈ నిధుల్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో లేదా తక్కువ రిస్క్‌ ఉండే లిక్విడ్‌ డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. అవసరంలో వేగంగా వీటిని వెనక్కి తీసుకునే సౌలభ్యం ఉంటుంది.

అయితే, సంక్షోభం ఏర్పడితే తప్ప ఈ నిధుల్ని కదలించకూడదు. మీ బడ్జెట్‌ పరిమితుల్లో స్మార్ట్‌గా ఖర్చు చేయడాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ ఖర్చులు చేయి దాటిపోకుండా వాటిని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఈ విషయంలో సా యం చేయడానికి ఆన్‌లైన్‌ మనీ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ చాలానే ఉన్నాయి. అవసరం లేని వాటిని రుణం తీసుకుని కొనే చర్యలకు దూరంగా ఉండాలి.  


ఈక్విటీల్లో సిప్‌ చేయండి..
ఏడాదికి 4– 6 శాతం వడ్డీనిచ్చే సేవింగ్స్‌ ఖాతాలో నిధులను నిల్వ చేసుకోవడం సరికాదు. పైగా సేవింగ్స్‌ రాబడులు ఏడాదిలో రూ.10,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అధిక రాబడులను ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాలపై దృష్టి సారించడం మంచిది. స్థిరమైన ఆదాయం కోసం డెట్‌ సాధనాలు అవసరమే కానీ, వీటిలో చాలా వరకు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇవ్వలేవు. ఈక్విటీలకు మాత్రం ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులనిచ్చే సత్తా ఉంది. అందుకే, ఏ సాధనానికి ఎంత కేటాయించాలన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి.

మీ వయసు, అవసరాలు, రిస్క్‌కు అనుగుణంగా ఈక్విటీ, డెట్‌ తదితర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి అందరికీ నప్పే ఓ ఆచరణీయ సూత్రం ఉంది. 100 నుంచి మీ ప్రస్తుత వయసు తీసివేయగా, ఎంత వస్తే అంత మేర ఈక్విటీలకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు మీ వయసు 35 అనుకోండి. అప్పుడు 65 వస్తుంది. అంటే ఈక్విటీలకు మీ పెట్టుబడుల్లో 65 శాతం కేటాయించుకోవచ్చని అర్థం. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే అందుకు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడం కొంత వరకు రక్షణాత్మకం.

స్వల్పకాలంలో అస్థిరతలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం మంచి ఫండ్స్‌ రెండంకెల స్థాయిలో లాభాలను ఇస్తున్నాయి. పైపెచ్చు ఈక్విటీ ఫండ్స్‌లో ఏకమొత్తంలో కంటే నెలవారీ సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయటమే మంచిది. ముఖ్యంగా మార్కెట్లు బాగా పెరిగి ఉన్న ప్రస్తుత స్థితిలో స్టాక్స్‌ విలువలు చాలా గణనీయమైన స్థాయిలో ఉన్నాయి. ఒకవేళ మార్కెట్లు కరెక్షన్‌కు లోనవుతున్నా గానీ సిప్‌ రూపంలో పెట్టుబడులు ఆపకూడదు. మార్కెట్లు తగ్గుతున్నప్పుడు ఫండ్స్‌ యూనిట్ల విలువ కూడా తగ్గుతుంది. కనుక సిప్‌ రూపంలో ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. స్వల్పకాలంలో ఆటుపోట్లు కనిపించినా దీర్ఘకాలంలో సిప్‌ చాలా చక్కని రాబడులకు బాట వేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement