ఇక్కడ సంపాదించే ఇన్వెస్టర్లు... ఇక్కడే పన్నులు చెల్లించాలి..
* మారిషస్‌తో తాజా డీల్‌తో ఎఫ్‌డీఐలు తగ్గవు...
* ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులపై సంపాదించే ఇన్వెస్టర్లు ఎవరైనాసరే ఇక్కడ పన్నులు చెల్లించాల్సిందేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పన్ను ఎగవేతల నిరోధానికిగాను మారిషస్‌తో తాజాగా సవరించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీని ప్రకారం మారిషస్ ద్వారా భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై ఇన్వెస్టర్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మూలధన లాభాల పన్ను(క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, ఈ ఒప్పందం కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) తగ్గుతాయన్న ఆందోళనలను జైట్లీ కొట్టిపారేశారు. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తగినంత పటిష్టంగా ఉంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం పన్ను ప్రోత్సాహకాలు ఇతరత్రా రాయితీలు వంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. మారిషస్‌తో తాజా డీల్ కారణంగా ఇన్వెస్టర్లు తమ బేస్(పెట్టుబడులకు మూల కేంద్రం)ను ఇతర పన్ను స్వర్గధామ దేశాలకు తరలిస్తాయని భావించడం లేదు’ అని జైట్లీ తెలిపారు.
దేశీయ వినిమయానికి బూస్ట్...
కాగా, మారిషస్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందం(డీటీఏఏ)లో సవరణల కారణంగా రౌండ్‌ట్రిప్పింగ్(నిధులను ఇతర దేశాల ద్వారా తీసుకురావడం)కు అడ్డుకట్టపడుతుందని జైట్లీ చెప్పారు. తద్వారా దేశీయంగా వినిమయానికి(కన ఊతమిచ్చేందుకు దోహదపడుతుందని జైట్లీ వివరించారు. ‘పన్ను స్వర్గధామ దేశాలను పన్ను ఎగవేతలకు ఆవాసంగా మార్చుకుంటున్న ఇన్వెస్టర్లకు ఆయా దేశాలతో ఉన్న ఒప్పందాలను సవరించడం ద్వారా చెక్ చెప్పనున్నాం.
ఈ చర్య కారణంగా స్టాక్ మార్కెట్లలో కొంత కుదుపులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. రానున్న కాలంలో మార్కెట్ల గమనం భారత్ ఆర్థిక వ్యవస్థకు స్వతహాగా ఉన్న బలం ఆధారంగా కొనసాగేందుకు దోహదం చేస్తుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. పన్నుల విధింపు అనేది దశలవారీగా ఉంటుందని.. అందువల్ల విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయన్న ఆందోళలు అనవసరమని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. కాగా, మారిషస్‌లోని తమ సంస్థల ద్వారా భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న కంపెనీల విషయంలో ఈ తాజా సవరించిన ఒప్పందం వల్ల మరింత పారదర్శకతకు ఆస్కారం ఉంటుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు.
మూడో వంతు ఎఫ్‌డీఐలు మారిషస్ నుంచే...
ప్రస్తుతం భారత్‌కు వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా మారిషస్ రూట్ ద్వారానే వస్తున్నాయి. 1991లో భారత్ ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు దశాబ్దం ముందే మారిషస్‌తో డీటీఏఏ కుదిరింది. విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించడమే ఈ డీల్ ముఖ్యోద్దేశం. గడిచిన 15 ఏళ్లలో భారత్‌కు వచ్చిన 278 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.19 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐల్లో మూడోవంతు మారిషస్ రూట్‌లోనే రావడం గమనార్హం. మారిషస్ డీటీఏఏ సవరణ నేపథ్యంలో సింగపూర్‌తో ఉన్న ఇదేవిధమైన ఒప్పందాన్ని కూడా సవరించే అవకాశం ఉంది. 2015 ఏడాది ఏప్రిల్-డిసెంబర్ కాలంలో భారత్‌కు వచ్చిన 29.4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలలో ఈ రెండు దేశాల ద్వారా మొత్తం 17 బిలియన్ డాలర్లు లభించడం విశేషం.