హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) రూ.3,800 కోట్ల పెట్టుబడులతో చేపడుతున్న పారదీప్ – హైదరాబాద్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) పైప్‌లైన్ ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. ఈ పైప్‌లైన్‌కు అనుసంధానిస్తూ కొత్తగా నల్లగొండ జిల్లా మల్కాపూర్‌లో భారీ డీఈఎఫ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.611 కోట్ల పెట్టుబడులతో సుమారు 70 ఎకరాల్లో దీని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తుందని ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హెడ్ శ్రవణ్ ఎస్ రావు తెలిపారు. ‘‘ఈ టెర్మినల్‌లో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటి అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులు నిల్వ ఉంటాయి. దీని సామర్థ్యం 1.80 లక్షల కిలో లీటర్లు. ఒరిస్సాలోని పారాదీప్ రిఫైనరీ నుంచి విశాఖపట్నం, అచ్యుతాపురం, రాజమండ్రి, విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు 1,200 కి.మీ. మేర డీఈఎఫ్ పైప్‌లైన్ ఉంటుందని’’ ఆయన వివరించారు. తెలంగాణలో విస్తరణ ప్రణాళికల మీద బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
36 కోట్లతో ఎల్‌పీజీ ప్లాంట్ విస్తరణ..
ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ మార్కెట్లో 39 శాతం మార్కెట్ వాటాతో ఐఓసీఎల్ మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రస్తుతం ఐఓసీఎల్‌కు చర్లపల్లిలో పెట్రోలియం టెర్మినల్, రామగుండంలో బల్క్ డిపోలు, చర్లపల్లి, తిమ్మాపూర్‌లో ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్లున్నాయి. ఈ ప్లాంట్ల ఎల్‌పీజీ వార్షిక సామర్థ్యం 4100 మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ఎల్‌పీజీ డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో చర్లపల్లిలోని ఎల్‌పీజీ ప్లాంట్‌ను రూ.36 కోట్లతో విస్తరించనున్నామని తెలిపారు. దీంతో అదనంగా 2400 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ కెపాసిటీ చేరుతుందని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా సీఎన్‌జీ స్టేషన్లు..
ప్రస్తుతం తెలంగాణలో ఐఓసీఎల్‌కు 1,100 రిటైల్ ఔట్‌లెట్లున్నాయి. 345 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. తెలంగాణలో 1.08 కోట్ల మంది ఎల్‌పీజీ కస్టమర్లుంటే వీటిలో 44 లక్షల మంది ఇండియన్ గ్యాస్ కస్టమర్లే. ఇటీవలే కొత్తగా 1,478 రిటైల్ ఔట్‌లెట్లకు దరఖాస్తులను ఆహ్వానించాం. ఇందులో 52 ఔట్‌లెట్లను ఏర్పాటు చేశాం. త్వరలోనే మిగిలినవి పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 13 సీఎన్‌జీ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో రానున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 ఇంధనమే..
ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలోని అన్ని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్‌ల్లో కేవలం భారత్ స్టేజ్ (బీఎస్)–6 పెట్రోల్, డీజిల్ మాత్రమే అందుబాటులో ఉంటుందని, దీన్ని బీఎస్–4 వాహనాలకు సైతం వినియోగించవచ్చని శ్రవణ్ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఎన్‌సీఆర్, ఆగ్రా నగరాల్లో కేవలం బీఎస్–6 ఇంధనాలను మాత్రమే సరఫరా చేస్తుంది. బీఎస్–6 ఇంధనం అల్ట్రా క్లీన్, నాణ్యత ప్రమాణాలను కలిగి ఉంటుందని.. దీంతో కార్బన్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి విష వాయువుల విడుదల ఉండవని ఆయన తెలిపారు. బీఎస్–4లో సల్ఫర్ 50 పీపీఎంగా ఉంటే.. బీఎస్–6లో 10 పీపీఎంగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment