న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఏకంగా రెండు రెట్లు పెరిగింది. స్టాండ్ అలోన్ ప్రాతిపదికన గత క్యూ3లో రూ.3,995 కోట్లుగా ఉన్న నికర లాభం... ఈ క్యూ3లో రూ.7,883 కోట్లకు పెరిగినట్లు ఐవోసీ తెలియజేసింది.
ఇన్వెంటరీ లాభాలతో పాటు రిఫైనరీ మార్జిన్ కూడా పెరగడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందినట్లు కంపెనీ చైర్మన్ సంజీవ్ సింగ్ చెప్పారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు అంతే ముఖ విలువ గల ఒక షేర్‌ను బోనస్‌గా (1:1) ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని, ఈ బోనస్ షేర్ల జారీకి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేర్‌కు రూ.19 చొప్పున (190 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తామని, ఈ డివిడెండ్ చెల్లింపునకు అర్హులైన వాటాదారుల్ని నిర్ణయించడానికి వచ్చేనెల 9వ తేదీని రికార్డు తేదీగా నిర్ణయించామని తెలియజేశారు. వచ్చే నెల 28 లోపు వాటాదారుల ఖాతాల్లోకి డివిడెండ్ చేరుతుందన్నారు.
12 డాలర్లకు పెరిగిన జీఆర్‌ఎమ్..
ఒక్కో బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం వల్ల వచ్చే స్థూల రిఫైనరీ మార్జిన్ (జీఆర్‌ఎమ్) 7.67 డాలర్ల నుంచి 12.32 డాలర్లకు పెరిగినట్లు సింగ్ వివరించారు. గత క్యూ3లో రూ.3,051 కోట్లుగా ఉన్న ఇన్వెంటరీ లాభాలు ఈ క్యూ3లో రూ.6,301 కోట్లకు పెరిగాయన్నారు. ఈ క్యూ2లో రూ.90,567 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆదాయం ఈ క్యూ3లో 22 శాతం వృద్ధితో రూ.1.1 లక్షల కోట్లకు పెరిగిందని, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన నిర్వహణ లాభం 80 శాతం వృద్ధి చెంది రూ.12,269 కోట్లకు ఎగిసినట్లు వివరించారు.
జీఎస్‌టీ ఎఫెక్ట్..రూ.700 కోట్ల ప్రభావం
జీఎస్‌టీ పరిధిలో పెట్రోల్ లేనందున తమ మొత్తం ఆదాయంపై రూ.700 కోట్ల మేర ప్రభావం పడిందని ఐవోసీ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎ.కె. శర్మ చెప్పారు. ముడి పదార్ధాలపై జీఎస్‌టీని చెల్లిస్తున్నామని, కానీ ఈ పన్నులను తుది ఉత్పత్తిపై భర్తీ చేసుకోలేకపోతున్నామని చెప్పారాయన. ఈ భారం వార్షికంగా రూ.2,000 కోట్ల మేర ఉండొచ్చన్నారు. కాగా ఫలితాలు అంచనాలను మించడం, డివిడెండ్ చెల్లింపు, బోనస్ షేర్ల జారీ వంటి సానుకూలాంశాల కారణంగా బీఎస్‌ఈలో ఐఓసీ షేర్ 4% లాభంతో రూ.416 వద్ద ముగిసింది.
ప్రపంచ మార్కెట్ల స్థాయికి పెట్రో ధరలు
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరల స్థాయికి సమానంగా ఉన్నాయని ఐవోసీ చైర్మన్ సంజీవ్ సింగ్ చెప్పారు. 15 రోజుల అంతర్జాతీయ ధరల సగటు ఆధారంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నామని తెలిపారు.
డిసెంబర్‌లో తొలి పదిహేను రోజుల్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను రోజుకు 1–3 పైసల రేంజ్‌లో ఐవోసీ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు తగ్గించాయి. గుజరాత్ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన డిసెంబర్ 14 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment