
న్యూఢిల్లీ: ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల ద్వారా నిధుల సమీకరణ జోరుగా జరుగుతోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం 18 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.23,670 కోట్లు సమీకరించాయి. అంతకు ముందటి ఏడాది ఇదే కాలంలో సమీకరించిన నిధులతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు.
ఇక మిగిలిన ఆరు నెలల కాలంలో మరో 50 కంపెనీలు ఐపీఓకు వస్తాయని, మరిన్ని నిధులు సమీకరిస్తాయని అంచనా. ఈ నెల చివరి వారంలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ రానుండగా, తర్వాతి నెలల్లో లోధా డెవలపర్స్, రైల్ వికాస్ నిగమ్ తదితర కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. ఐపీఓలకు సెబీ అనుమతి కోసం 28 కంపెనీలు నిరీక్షిస్తుండగా, ఇప్పటికే మరో 18 కంపెనీలు ఐపీఓలకు అనుమతులు పొందాయి.
పటిష్టంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్...
మంచి నాణ్యత గల కంపెనీలు ఐపీఓకు వచ్చాయని, వాటి ధరలు ఆకర్షణీయంగా ఉండటంతో ఐపీఓ మార్కెట్ జోరుగా ఉందని ప్రభుదాస్ లీలాధర్ వైస్ ప్రెసిడెండ్(ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్) జె. కళ్యాణివాలా వ్యాఖ్యానించారు.
ఐపీఓ సంబంధిత నిబంధనలను మార్కెట్ నియంత్రణ సంస్థ సరళీకరించడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉండటంతో ఐపీఓల జోరు పెరుగుతోందని నిపుణులంటున్నారు. ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ నిర్ణయం కాలవ్యవధిని మరింతగా తగ్గిస్తూ ఇటీవల సెబీ తీసుకున్న నిర్ణయం కూ డా ఐపీఓ మార్కెట్‌కు ప్రయోజనకరమేనని వారం టున్నారు. ప్రైస్‌బ్యాండ్ నిర్ణయానికి ఐదు రోజులుగా ఉన్న గడువును సెబీ 2 రోజులకు తగ్గించింది.
విస్తరణ వ్యూహం...
2016 జనవరి–జూన్ కాలానికి 11 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.6,962 కోట్లు రాబట్టగా. గత ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం 13 కంపెనీలు రూ.12,000 కోట్లు సమీకరించాయి. ఇక ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 18 కంపెనీలు రూ.23,670 కోట్లు సమీకరించాయి.
ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీలన్నీ విస్తరణ వ్యూహంతోనే నిధులు సమీకరించాయి. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను సాధారణ వ్యాపార కార్యకలాపాలకు, రుణ భారం తగ్గించుకోవడానికి కూడా పలు కంపెనీలు వినియోగించాయి.
మరింతగా పెరిగిన ‘బ్రాండ్’....
కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలు తమ వాటాను ఐపీఓ ద్వారా విక్రయించడం ద్వారా ఆయా కంపెనీల నుంచి వైదొలిగాయి. ఐపీఓకు రావడం ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టయి ప్రయోజనాలు పొందడమే కాకుండా పలు కంపెనీలు తమ బ్రాండ్ పేరును మరింతగా పెంచుకున్నాయి.
మూడు ప్రభుత్వ రంగ సంస్థల ఐపీఓలు..
ఈ ఆరు నెలల కాలంలో మూడు ప్రభుత్వ రంగ సంస్థల ఐపీఓలు కూడా వచ్చాయి. భారత్ డైనమిక్స్, రైట్స్, మిధానిలు ఐపీఓ ద్వారా షేర్లను విక్రయించి స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి.
అతి పెద్ద ఐపీఓ.. బంధన్ బ్యాంక్...
ఈ ఏడాది తొలి 6 నెలల కాలంలో వచ్చిన ఐపీఓల్లో అతి పెద్ద ఐపీఓగా బంధన్ బ్యాంక్ నిలిచింది. ఈ బ్యాంక్ రూ.4,473 కోట్ల నిధులు రాబట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో హిందుస్తాన్ ఏరోనాటిక్స్(రూ.4,229 కోట్లు), ఐసీఐసీఐ సెక్యూరిటీస్(రూ.3,515 కోట్లు), వారోక్ ఇంజనీరింగ్ (రూ.1,995 కోట్లు), ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్(రూ.1,844 కోట్లు), లెమన్ ట్రీ హోటల్స్(రూ.1,040 కోట్లు) నిలిచాయి.
లోధా డెవలపర్స్ ఐపీఓకు సెబీ ఆమోదం
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం లోధా డెవలపర్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.3,750 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు 1.8 కోట్ల ప్రమోటర్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయిస్తారు.
అంతేకాకుండా ముందస్తు ఐపీఓ ప్లేస్‌మెంట్‌లో భాగంగా 95 లక్షల తాజా షేర్ల జారీ ద్వారా రూ.750 కోట్లు సమీకరించాలని కూడా ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మీద ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.5,500 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. 2007లో వచ్చిన రూ.9,200 కోట్ల డీఎల్‌ఎఫ్ ఐపీఓ తర్వాత రియల్టీ రంగంలో వస్తున్న రెండో అతి పెద్ద ఐపీఓ ఇదే. లోధా డెవలపర్స్ కంపెనీ హైదరాబాద్‌లో కూడా ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment