
న్యూఢిల్లీ: ఐపీవో మార్కెట్ మరోసారి వేడెక్కబోతోంది. ఏకంగా మూడు డజన్ల కంపెనీలు ప్రజల నుంచి రూ.35,000 కోట్ల మేర నిధుల సమీకరణకు సిద్ధంగా ఉన్నాయి. వ్యాపార, ప్రాజెక్టుల విస్తరణ, మూలధన అవసరాల కోసం ప్రధానంగా ఎక్కవ కంపెనీలు ఐపీవోకు రానున్నట్టు సెబీ వద్ద దాఖలు చేసిన పత్రాల ఆధారంగా తెలుస్తోంది. వీటిలో ప్రభుత్వరంగం నుంచి ఆరు కంపెనీలు కూడా ఉండడం గమనార్హం.
అవి ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, రైల్ వికాస్ నిగమ్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైట్స్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మజ్‌గాన్ డాక్. స్టాక్ ఎక్సేంజ్‌లలో లిస్ట్ చేయడం ద్వారా బ్రాండ్ విలువను పెంచుకోవడం, వాటాదారులకు లిక్విడిటీని పెంచడం ఐపీవో ఉద్దేశ్యంగా తెలుస్తోంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో నిధుల సమీకరణ ఉంటుందని, మార్కెట్లో రుణాల లభ్యత తక్కువగా ఉండడం, అన్ని రంగాల్లో నిధుల వినియోగం మెరుగుపడడం కారణాలుగా ఈక్విరస్ క్యాపిటల్ డైరెక్టర్ మునిష్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఇక, ఇప్పటికే ఐపీవోకు సెబీ నుంచి అనుమతి సంపాదించిన కంపెనీల్లో బార్బెక్యూ నేషన్ హాస్పిటాలిటీ, టీసీఎన్‌ఎస్ క్లాథింగ్ కంపెనీ, నజారా టెక్నాలజీస్, దేవీ సీఫుడ్స్ సహా డజను కంపెనీలున్నాయి. రూట్ మొబైల్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్, సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా, ఫ్లెమింగో ట్రావెల్ రిటైల్, లోధా డెవలపర్స్ సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. ఇవన్నీ కలసి సుమారు రూ.35,000 కోట్లు సమీకరించాలనుకుంటున్నాయి. గతేడాది 36 కంపెనీలు ఐపీవో ద్వారా సుమారు రూ.67,000 కోట్లకు పైగా నిధుల్ని సమీకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment