ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం అండ్ కార్పోరేషన్(ఐఆర్‌సీటీసీ) ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. కంపెనీ శుక్రవారం 2019-20 ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 79.3శాతం వృద్ధి చెందింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.84కోట్లుగా నమోదైన నికరలాభం ఈసారి రూ.150.6కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే క్వార్టర్-టు-క్వార్టర్ ప్రాతిపదికన నికరలాభం 26.9శాతం క్షీణించింది. కరోనా కట్టడి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ నికరలాభాల్ని హరించివేసినట్లు కంపెనీ చెప్పుకొచ్చింది. ఇది మార్చి త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 17.9శాతం పెరిగి రూ.586.89 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు నిర్వహణ ఆదాయం రూ.497 కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిషేరుకు రూ.2.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ కంపెనీ షేర్లు ఎక్చ్సేంజ్‌లో గతేడాది(2019) అక్టోబర్ 14న లిస్ట్ అయ్యాయి. అప్పటి నుంచి కంపెనీ 3సార్లు ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో శుక్రవారం మార్కెట్ ముగిసే సరికి బీఎస్‌ఈలో షేరు 1.14శాతం లాభంతో రూ.1401.15 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment