రైట్స్ ఇష్యూలకు కంపెనీల క్యూ
న్యూఢిల్లీ: ఇటీవల మార్కెట్ల పురోగతి నేపథ్యంలో నాలుగు కంపెనీలు రైట్స్ ఇష్యూలను చేపట్టేందుకు సిద్ధపడుతున్నాయి. లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇంజినీరింగ్ తదితర నాలుగు కంపెనీలు రూ. 800 కోట్లకుపైగా సమీకరించనున్నాయి. ఒనిడా బ్రాండ్ టీవీలను విక్రయించే మిర్క్ ఎలక్ట్రానిక్స్, న్యూలాండ్ లేబొరేటరీస్ సైతం రైట్స్ ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తున్నాయి. ఇందుకు వీలుగా ఈ నాలుగు కంపెనీలు ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేశాయి.
రైట్స్ ఇష్యూ అంటే... బోర్డు నిర్ణయించిన నిష్పత్తిలో మార్కెట్ ధర కంటే తక్కువలో ప్రస్తుత వాటాదారులకు కొత్తగా షేర్లను జారీ చేస్తాయి. తద్వారా కంపెనీలు నిధులను సమీకరిస్తాయి. లక్ష్మీ విలాస్ బ్యాంక్ రూ. 505 కోట్లను సమీకరించనుండగా, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇంజినీరింగ్ రూ. 300 కోట్లు, మిర్క్ ఎలక్ట్రానిక్స్ రూ. 33 కోట్లు, న్యూలాండ్ ల్యాబ్ రూ. 25 కోట్లు చొప్పున సమీకరించనున్నాయి.