
ఐటీ రిటర్న్‌కు ఆన్‌లైనే మేలు!
- 1-3 నెలల్లోనే రీఫండ్ చేతికి
- అదే ఆఫ్‌లైన్‌లో అయితే 5-10 నెలల సమయం
రిఫండ్ అంటే... వెనక్కివ్వటం. ఆదాయపు పన్ను విషయంలో అయితే... చెల్లిం చాల్సిన పన్నుకన్నా ఎక్కువ చెల్లించినపుడు దాన్ని వెనక్కి తీసుకునేందుకు రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. ఆన్‌లైన్లో, మాన్యువల్‌గా రెండు రకాలుగానూ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే అవకాశం ఉన్నా... ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేసిన రిటర్న్‌ను పన్ను అధికారులు భౌతికంగా తనిఖీ చేయరు కనక 1-3 నెలల్లోపు రిఫండ్ మొత్తం చేతికొస్తుంది. మాన్యువల్‌గా దాఖలు చేసిన రిటర్న్‌ల విషయంలో దీనికి 5-10 నెలలు పడుతుంది.
రిఫండ్‌ను వేగంగా తెచ్చుకోవటమెలా?
రిటర్న్ వేసేవారు తొలుత ఐటీ విభాగ డాటాబేస్‌లో తాము చెల్లించిన పన్ను వివరాలు సరిచూసుకోవాలి. వ్యక్తిగతంగా లాగిన్ అయి... ఫారమ్ 26 ఎఎస్‌ను చూస్తే మనం చెల్లించిన పన్ను వివరాలు తెలుస్తాయి. సరైన చిరునామాతో పాటు ఫోన్ నంబరు, ఈ-మెయిల్, బ్యాంకు ఖాతా వివరాలు కరెక్టుగా ఇవ్వాలి. ఇక ఐటీఆర్-5 ఫారాన్ని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కు పంపటం తప్పనిసరి. అక్కడి నుంచి క్లియర్ అయ్యాకే రిఫండ్ వస్తుంది కనక. ఒకవేళ రిఫండ్ నేరుగా బ్యాంకు ఖాతాకే జమ కావాలనుకుంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ పద్ధతి (ఈసీఎస్) ఎంచుకోవాలి. వేగవంతమైన రిఫండ్‌కు అదే కరెక్టు. ఒకవేళ చెక్కు ద్వారా పొందాలనుకుంటే మారే చిరునామా కాకుండా శాశ్వత చిరునామా ఇవ్వటం మంచిది. అయితే రిఫండ్ మొత్తం రూ. 50 వేలు దాటితే ఈసీఎస్ పద్ధతి పనికిరాదు. చెక్కు ద్వారానే అందుతుంది.
అసలు సమస్య ఇక్కడే..
అసలు ఆదాయానికి, ఆదాయపు పన్ను చెల్లించడానికి లెక్కించిన ఆదాయానికి మధ్య తేడాలుండటం వల్లే చాలా రిఫండ్‌లు ఆలస్యమవుతుంటాయి. దీంతో ఈ విషయం ఐటీ విభాగం సెక్షన్ 143(1) కింద తెలియజేస్తుంది. ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి సరైన సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకోవటం ద్వారా ఈ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. అవసరమైన వారు నిపుణుల సాయం కూడా తీసుకోవచ్చు. కొన్ని ఆన్‌లైన్ సంస్థలూ ఈ సౌకర్యం కల్పిస్తున్నాయి. అవి వేగంగా రిఫండ్ రావటానిక్కూడా సహకరిస్తాయి.