
ఐటీసీ ఆకర్షణీయ ఫలితాలు
⇔ మార్చి క్వార్టర్లో లాభం రూ.2,669 కోట్లు
⇔ 12 శాతం వృద్ధి... అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు
⇔ రూ.4.75 డివిడెండ్
న్యూఢిల్లీ: ఐటీసీ మార్చి క్వార్టర్‌తోపాటు, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెరుగైన ఫలితాలను వెల్లడించింది. అగ్రి కమోడిటీలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు అధికమయ్యాయి. దీంతో మార్చి త్రైమాసికంలో కంపెనీ లాభం 12 శాతం అధికంగా రూ.2,669.47 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.2,380.68 కోట్లు మాత్రమే. ఆదాయం సైతం 6 శాతం పెరిగి రూ.15,009 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న ఆదాయం రూ.14,139 కోట్లు. ఎఫ్‌ఎంసీజీ విభాగం, సిగరెట్ల ద్వారా ఆదాయం 5 శాతం పెరిగి రూ.11,256 కోట్ల నుంచి రూ.11,840 కోట్లకు చేరుకుంది.
ముఖ్యంగా సిగరెట్ల ద్వారా ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.8,955 కోట్లుగా నమోదైంది. ఇతర ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ద్వారా ఆదాయం 6.45 శాతం పెరుగుదలతో రూ.2,886 కోట్లకు చేరింది. పండ్ల రసాలు, డైరీ, చాక్లెట్లు, కాఫీ తదితర విభాగాల్లో ముడి సరుకుల ధరలు పెరగడం, అప్పెరల్ విభాగంలో డిస్కౌంట్ల కారణంగా ఇతర ఎఫ్‌ఎంసీజీ విభాగం ఫలితాలపై ప్రభావం చూపినట్టు ఐటీసీ తెలిపింది. ఐటీసీ హోటల్ వ్యాపార ఆదాయం సైతం 6.48 శాతం వృద్ధితో రూ.386 కోట్లు, అగ్రి ఉత్పత్తుల ద్వారా ఆదాయం 6 శాతం పెరుగుదలతో రూ.1,918 కోట్లు... పేపర్‌బోర్డుల ద్వారా ఆదాయం రూ.4.38 శాతం వృద్ధితో రూ.1,372 కోట్లుగా నమోదైంది.
మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఐటీసీ రూ.10,447 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. 2015–16 ఆర్థిక సంవ్సరంలో వచ్చి రూ.9,500 కోట్లతో పోలిస్తే 10.27 శాతం వృద్ధి నమోదైంది. అమ్మకాలు 6.66 శాతం పెరుగుదలతో రూ.55,061 కోట్ల నుంచి రూ.58,731 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.4.75 డివిడెండ్‌ను కంపెనీ సిఫారసు చేసింది.