పద్దు కాదు.. ప్రోగ్రెస్ రిపోర్ట్ | ITs not Account, Progress Report of Nation, says Chidambaram | Sakshi
Sakshi News home page

పద్దు కాదు.. ప్రోగ్రెస్ రిపోర్ట్

Published Tue, Feb 18 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM

పద్దు కాదు.. ప్రోగ్రెస్ రిపోర్ట్

పద్దు కాదు.. ప్రోగ్రెస్ రిపోర్ట్

పద్దు కాదు.. ప్రోగ్రెస్ రిపోర్ట్
 చిదంబరం ‘ఓటాన్ అకౌంట్’లో ‘గత ఘనత’ల ఏకరువు
 2014-15 ఏడాదికి రూ. 17,63,214 కోట్లతో మధ్యంతర బడ్జెట్
  విశేషాలు లేకుండా సాదాసీదాగా రూపకల్పన
  ఎకై్సజ్ సుంకాల తగ్గింపు.. తగ్గనున్న కార్లు, బైక్‌ల ధరలు.. టీవీలు, ఫ్రిజ్‌లు, 
  ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాల రేట్లు కూడా..
  చవక మొబైల్ ఫోన్లు కాస్త ప్రియం.. 
  ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహం
  పన్ను చట్టాల్లో ఎలాంటి మార్పులు లేవు 
  యథాతథంగా ప్రత్యక్ష పన్నురేటు
  సైన్యంలో ‘ఒకే హోదాకు ఒకే పింఛను’కు ఓకే
  వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ 
  పథకం కొనసాగింపు
  2009 ఏప్రిల్ ముందు నాటి విద్యా రుణాలపై వడ్డీ మీద మారటోరియం 
  9 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం
 
 ఎన్నికల వేళ సొంత డబ్బా కొట్టుకోవటంతో పాటు.. ఇటు మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు.. అటు తయారీ రంగానికీ కొంత ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం తన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రయత్నించారు. ఇందులో భాగంగా వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలను కొంతమేర తగ్గించే చర్యలతో పాటు.. కొన్ని సబ్సిడీలను, సంక్షేమ పథకాలకు కేటాయింపులను స్వల్పంగా పెంచారు. కార్పొ రేట్లు, సంపన్నులపై అధిక సర్‌చార్జ్ కొనసాగించటం మినహా.. ఇతరత్రా పన్నుల జోలికి పెద్దగా పోకుండా జాగ్రత్తపడ్డారు. పనిలో పనిగా తమ యూపీఏ ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన ఘనతలను ఏకరువు పెట్టడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఎప్పట్లాగానే చిదంబరం బడ్జెట్ చాలా సమతూకంగా, వాస్తవికతకు అద్దం పట్టేలా ఉందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కితాబు ఇవ్వగా.. ఆర్థిక వృద్ధి మెరుగుపడితే తప్ప ఇందులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించటం సాధ్యంకాదని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించారు. పాత విషయాలన్నీ ఏకరువు పెట్టడం తప్ప ఇందులో కొత్త విశేషాలేమీ లేవంటూ విపక్షాలు పెదవి విరిచాయి. చిదంబరం సోమవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. స్టాక్ మార్కెట్ స్వల్పంగా అర శాతం మేర పెరిగింది. 
 
 న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు అత్యంత సమీపంలోకి వచ్చిన తరుణంలో.. పెద్దగా విన్యాసాల జోలికి పోకుండా కొన్ని జనాకర్షక చర్యలతో పాటు పరిశ్రమకు తోడ్పడేలా 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం. వార్షిక వ్యయం రూ.17,63,214 కోట్ల అంచనాతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో.. అంతా ఊహించినట్లే విధానపరంగా కీలకమైన నిర్ణయాలేమీ లేవు. అయితే.. పదేళ్ల యూపీఏ పాలనలో చివరి బడ్జెట్ కావటంతో.. యూపీఏ పాలన ప్రోగ్రెస్ రిపోర్టును తలపింపజేసేలా సాధించిన విజయాల చిట్టా చదివారు. సంక్షేమ పథకాలకు మరిన్ని నిధుల కేటాయింపులతో ఎస్సీలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, సైనిక సిబ్బందిని ఆకట్టుకునేందుకూ ప్రయత్నం చేశారు. ఇక కార్లు, ద్విచక్ర వాహనాలు, యంత్ర పరికరాలు, ఫ్రిజ్‌లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు వంటి వినియోగ వస్తువుల ఎకై్సజ్ సుంకాలను తగ్గించారు. తద్వారా ఆయా వస్తువుల ధరలు కొంతమేర తగ్గనుండటంతో.. మధ్యతరగతి వర్గం మెప్పుపొందటంతో పాటు.. పరిశ్రమలకూ ప్రోత్సాహాన్నందించేదుకు యత్నించారు. దీనికి అనుగుణంగా కార్ల తయారీ దిగ్గజం ఆడి సంస్థ.. తమ కార్ల రేట్లు తగ్గిస్తున్నట్లు తక్షణమే ప్రకటించగా.. టాటా మోటార్స్, జనరల్ మోటార్స్ సైతం అదే బాటలో ఉన్నట్లు తెలిపాయి. మరోవైపు.. మధ్యంతర బడ్జెట్ (ఓటాన్ అకౌంట్) కావటం వల్ల పన్నుల విధానాల్లో భారీ మార్పులు చేసేందుకు ఆస్కారం లేకపోవటంతో చిదంబరం వాటి జోలికి వెళ్లలేదు. ప్రత్యక్ష పన్నుల రేట్లను యధాతథంగా ఉంచారు. ‘‘సంప్రదాయానికి అనుగుణంగా నేను పన్ను చట్టాల్లో ఎలాంటి మార్పులు చేయటం లేదు’’ అని ఆయన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పరోక్ష పన్నులపరమైన మినహాయింపుల (ఎకై్సజ్ సుంకాల తగ్గిం పు) కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 40 రోజుల్లో సుమారు రూ. 300-400 కోట్ల ఆదాయానికి గండి పడగలదని బడ్జెట్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఈ మినహాయింపులు జూన్ 30 దాకా వర్తిస్తాయని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వీటిని సమీక్షించే అవకాశం ఉందని చెప్పారు. 
 
 మాజీ సైనికోద్యోగులకు ఊరట: చిరకాలంగా మాజీ సైనికోద్యోగులు కోరుతున్నట్లుగా.. ఒక హోదాలో ఉన్నవారందరికీ ఒకే మొత్తం పింఛను వర్తింపచేసే అంశాన్ని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చిదంబరం తెలిపారు. ఇందుకోసం రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మరిన్ని జనాకర్షక చర్యల్లో భాగంగా వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అలాగే, 2009 మార్చి 31కి ముందు తీసుకున్న విద్యా రుణాల మీద వడ్డీపై మారటోరియం విధించారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 9 లక్షల మంది విద్యార్థులకు సుమారు రూ.2,600 కోట్ల మేర లబ్ధి చేకూర్చనుంది. 
 
 కార్లపై సుంకాలు తగ్గింపు: మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకోవటంతో పాటు.. అమ్మకాలు పడిపోయి కుదేలవుతున్న ఆటోమొబైల్ రంగానికి తోడ్పాటు ఇచ్చేలా చిదంబరం మరికొన్ని చర్యలు ప్రకటించారు. చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు, స్కూటర్లు, వాణిజ్య వాహనాలపై ఎకై్సజ్ సుంకాలను 12 శాతం నుంచి 8 శాతానికి త గ్గించారు. అలాగే, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ) పైనా ఎకై్సజ్ సుంకాన్ని ఆరు శాతం మేర తగ్గించారు. దీంతో ఇది 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. భారీ, మధ్య స్థాయి కార్లపై ఇప్పటిదాకా ఎకై్సజ్ సుంకం 24/20 శాతంగా ఉండగా దీన్ని 27/24 శాతానికి తగ్గించారు. చాసిస్ తదితరాలపైనా సముచిత స్థాయిలో సుంకాలు తగ్గుతాయని చిదంబరం పేర్కొన్నారు. యంత్రా లు, యంత్ర పరికరాల ఉత్పత్తికీ ఊతమిచ్చేలా.. ఎకై్సజ్ సుంకాన్ని 12 నుంచి 10 శాతానికి తగ్గించారు. దేశీయంగా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీని ప్రోత్సహించే దిశగా అన్ని రకాల మొబైల్స్‌పై ఎకై్సజ్ సుంకాన్ని ఆరు శాతంగా క్రమబద్ధీకరించారు. ఫలితంగా రూ. 2,000 కన్నా ఎక్కువ ధర పలికే హ్యాండ్‌సెట్ల రేట్లు యథాతథంగా ఉన్నా.. అంతకన్నా తక్కువగా ఉండే వాటి రేట్లు మాత్రం పెరిగే అవకాశముంది. సబ్బులు, రసాయనాల్లో ఉపయోగించే నూనెలపై కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతానికి పరిమితం చేశారు. 
 
 అందర్నీ మెప్పించాలని కాదు: ‘ఎన్నికల్లో ఓటర్లకు గాలమేసేందుకే జనాకర్షక చర్యలను ప్రకటించారా?’ అన్న ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ .. ‘‘అందర్నీ మెప్పించడం నా అభిమతం కాదు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకుల గుండా సాగుతోందని ప్రజలకు నేరుగా తెలియజేయాలన్నదే నా ఉద్దేశం’’ అని బదులిచ్చారు. సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేలోగా ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉండటంతోనే పరిశ్రమలకు ఎకై్సజ్ సుంకాలపరంగా వెసులుబాటు కల్పించాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. ముఖ్యంగా తయారీ రంగానికి తక్షణమే తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని చిదంబరం చె ప్పారు. ‘‘ఇప్పుడు ఎవరూ డౌన్‌గ్రేడ్ల గురించి  మాట్లాడటం లేదు. విధాన జడత్వం అంటూ ఏమీ లేదు.. రెండేళ్ల కిందటి కంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి పరంగా మన దేశం ప్రపంచంలోనే 11వ అతిపెద్ద దేశం. ఇది ఎంత మందికి తెలుసు. ఇలాంటి మరెన్నో గొప్ప పరిణామాలు రానున్న రోజుల్లో జరగనున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్యానికన్నా తక్కువగానే ఉండగలదని చిదంబరం చెప్పారు. 4.8 శాతాన్ని దాటనివ్వకూడదని నిర్దేశించుకోగా.. అంతకన్నా తక్కువగా 4.6 శాతంగా ఉండ గలదన్నారు. ఈసారి వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉన్నా.. ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతం పైగా  వృద్ధి సాధించగలమని ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement