ఇక విమానాల్లో బ్యాగేజ్ బాదుడు
జీరో బ్యాగేజ్ చార్జీ ఆఫర్లకు డీజీసీఏ అనుమతి
న్యూఢిల్లీ: జీరో బ్యాగేజ్ చార్జీ ఆఫర్లు ప్రకటించేందుకు దేశీ విమానయాన సంస్థలకు ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ అనుమతినిచ్చింది. ఒకవేళ ఇలాంటి ఆఫర్‌లో టికెట్ పొందినవారు ప్రయాణ సమయంలో చెకిన్ బ్యాగేజ్‌తో వచ్చిన పక్షంలో నిర్దేశిత జరిమానా వసూలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెకిన్ బ్యాగేజ్ ఉండని ప్రయాణికులకు.. డిస్కౌంట్లు ఇచ్చేలా జీరో బ్యాగేజ్ ఆఫర్లకు అనుమతించాలంటూ ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్‌ఏషియా ఇండియా సంస్థలు గతంలోనే కోరినప్పటికీ తిరస్కరించిన డీజీసీఏ తాజాగా ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.
పరిశ్రమలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా డీజీసీఏ నిర్ణయం ఉందంటూ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎయిరిండియా 23 కేజీల దాకా, చాలామటుకు దేశీ ప్రైవేట్ విమానయాన సంస్థలు 15 కేజీల దాకా చెకిన్ బ్యాగేజ్‌కు ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. తాజా పరిణామంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు.. ఆఫర్లలో టికెట్లను విక్రయించినప్పుడు ఇటువంటి ఉచిత చెకిన్ బ్యాగేజ్‌కు కూడా చార్జీలు వసూలు చేసుకునే వీలు లభిస్తుంది.
ప్రత్యేకమైన ఎయిర్‌పోర్ట్ లాంజ్‌ల వినియోగం నుంచి ప్రయాణికులు కోరుకునే నిర్దిష్ట సీటు కేటాయింపు దాకా వివిధ సర్వీసులకు ఎయిర్‌లైన్స్ అదనంగా వసూలు చేసుకునేందుకు డీజీసీఏ ఇప్పటికే అనుమతించింది. చెకిన్ బ్యాగేజ్ లేకుండా కేవలం హ్యాండ్‌బ్యాగ్‌తోనే ప్రయాణించే వారికి రూ. 200 డిస్కౌంటు ఇచ్చేటువంటి ఆఫర్‌ను స్పైస్‌జెట్ గతంలోనే ప్రకటించింది. డిస్కౌంటు రేట్లకు టికెట్ తీసుకున్నవారు తర్వాత చెకిన్ బ్యాగేజ్‌తోగనుక వస్తే... 10 కేజీల దాకా బరువున్న వాటిపై రూ. 500, 15 కేజీల బరువున్న వాటిపై రూ. 750 చార్జీలు కట్టాల్సి ఉంటుందంటూ షరతు పెట్టింది.