ముందస్తు పన్నులు ఓకే.. | JD Sports surfs athleisure trend to take record pre-tax profit | Sakshi
Sakshi News home page

ముందస్తు పన్నులు ఓకే..

Published Fri, Sep 16 2016 1:02 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

ముందస్తు పన్నులు ఓకే.. - Sakshi

ముందస్తు పన్నులు ఓకే..

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వెనుకంజ
ఎల్‌ఐసీ, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బెటర్

ముంబై: రెండవ త్రైమాసికానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐలు వెనక్కు తగ్గాయి. ఎల్‌ఐసీ, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, యస్ బ్యాంక్‌తోపాటు స్టీల్, సిమెంట్ తదితర రంగాలు సానుకూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. కాగా ఆర్థిక సంవత్సరం మొత్తంమీద నిర్దేశిత లక్ష్యాలను చేరుకోగలమన్న విశ్వాసాన్ని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

‘‘కొంత ప్రతికూలత ఉన్నా... వాణిజ్య కేంద్రమైన ముంబైలో తాజా విడత ముందస్తు పన్ను వసూళ్లు పెరిగాయి. కొన్ని కీలక రంగాలు మంచి ఫలితాలనే అందించాయి’’ అని ప్రిన్సిపల్ చీఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆఫ్ ముంబై డీఎస్ సక్సేనా గురువారం తెలిపారు. ఇదే వరవడి మరికొంత కాలం కొనసాగుతుందన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేశారు. కొన్ని ముఖ్య బ్యాంకులు, సంస్థల చెల్లింపుల తీరును చూస్తే...

 ఎస్‌బీఐ: గత ఏడాది ఇదే కాలంలో రూ.1,620 కోట్లు చెల్లించిన ఈ బ్యాంక్ ఈ ఏడాది అంతకు 26 శాతం తక్కువతో రూ.1,200 కోట్లనే చెల్లించింది. మొండిబకాయిలకు అధిక కేటాయింపులు దీనికి ప్రధాన కారణం.

 ఐసీఐసీఐ బ్యాంక్: 20 శాతం తక్కువగా చెల్లింపులు రూ.1,500 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పడిపోయాయి.

 ఎల్‌ఐసీ: బీమా దిగ్గజ సంస్థ చెల్లింపులు భారీగా 13 శాతం ఎగిసాయి. చెల్లింపుల మొత్తం రూ.1,970 కోట్ల నుంచి రూ.2,235 కోట్లకు చేరింది.

 రిలయన్స్ ఇండస్ట్రీస్: 27 శాతం వృద్ధితో చెల్లింపులు రూ.2,108 కోట్ల నుంచి రూ.2,667 కోట్లకు పెరిగాయి.

 టీసీఎస్: 11 శాతం వృద్ధితో రూ.1,550 కోట్ల నుంచి రూ.1,750 కోట్లకు చేరాయి.

 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ప్రైవేటురంగంలోని రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ చెల్లింపులు 20 శాతం పెరుగుదలతో రూ.2,000 కోట్ల నుంచి రూ.2,400 కోట్లకు చేరాయి.

 హెచ్‌డీఎఫ్‌సీ: తనఖా రుణ మంజూరు సంస్థ చెల్లింపులు రూ.810 కోట్ల నుంచి రూ.860 కోట్లకు ఎగశాయి.

 యస్ బ్యాంక్: ఈ బ్యాంక్ చెల్లింపులు ఏకంగా 40 శాతం ఎగశాయి. చెల్లింపుల మొత్తం రూ.435 కోట్లు.

 సిటీ బ్యాంక్: 3 శాతం తగ్గి రూ.720 కోట్ల నుంచి రూ.700 కోట్లకు దిగాయి.

 బ్యాంక్ ఆఫ్ బరోడా: 25% వృద్ధితో రూ.625 కోట్లు చెల్లించింది. 2015 ఇదే కాలంలో ఈ మొత్తం రూ.500 కోట్లు.

 టాటా స్టీల్: చెల్లింపులు రెట్టింపై రూ.250 కోట్లకు చేరాయి.

 అల్ట్రా టెక్: రూ.20% వృద్ధితో రూ.180 కోట్లకు చేరాయి.

 ఎంఅండ్‌ఎం: 11 శాతం వృద్ధితో రూ.180 కోట్ల నుంచి రూ.200 కోట్లకు ఎగశాయి.

 ఐఓసీ: 62 శాతం వృద్ధితో రూ.785 కోట్ల నుంచి రూ.1,275 కోట్లకు పెరిగాయి.

 బీపీసీఎల్: 2 శాతం మైనస్‌తో రూ.540 కోట్లకు చేరాయి.

 హెచ్‌యూఎల్: 9 శాతం అధికంగా రూ.500 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించింది.

 బజాజ్ ఆటో: చెల్లింపులు 13 శాతం పెరుగుదలతో రూ.390 కోట్లకు ఎగశాయి.

ముందస్తు పన్ను అంటే..?
ఆర్థిక సంవత్సరం మొత్తంమీద తమకు వచ్చే ఆదాయ, వ్యయాలు, లాభాల అంచనా ప్రాతిపదికన కంపెనీలు నాలుగు విడతల్లో ఆదాయపు పన్నును ముందస్తుగా చెల్లిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ విడత చెల్లింపుల గడువు సెప్టెంబర్ 15వ తేదీతో ముగిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement