'టెలిగ్రాఫ్ లో ప్రేమ సందేశాలు పంపేవాడిని'
ముంబై: టెలిగ్రాఫ్ ద్వారా తన భార్య శోభకు ప్రేమ సందేశాలు పంపేవాడినని బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్ర వెల్లడించారు. తన అనుభూతులను టెలిగ్రాఫ్ ద్వారా వ్యక్తపరిచేవాడినని చెప్పారు. గురువారం ఆయన వియాన్ మొబైల్ ఫోన్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ...'మొబైల్ ఫోన్లను యువత ఎలా హేండిల్ చేస్తుందో తెలియదు. నేను హీరో వెలుగొందుతున్న సమయంలో మొబైల్ ఫోన్లు లేకపోవడంతో సరదాగా గడిపేందుకు ఎక్కువ సమయం ఉండేది. ఇప్పట్లా ఫోన్లు లేకపోవడంతో టెలిగ్రాఫ్ లో నా భార్య శోభకు ప్రేమ సందేశాలు పంపుతుండేవాడిని. ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నాను. అయితే శోభ చదవగలిగే వాటిని మాత్రమే అందులో ఉంచుతున్నా' అని జితేంద్ర చెప్పారు. 73 ఏళ్ల జితేంద్ర 1970-80 దశకంలో పలు విజయవంతమైన ప్రేమకథా చిత్రాల్లో హీరోగా నటించారు.
పాకెట్ ఫ్రెండ్లీ రేంజ్ మొబైల్ ఫోన్లను తయారు చేయడమే తమ లక్ష్యమని వియాన్ యజమాని శిల్పాశెట్టి తెలిపారు. 80 శాతం మంది రూ. 10 వేలలోపు ధర ఉన్న ఫోన్లను వాడుతున్నారని, తాము కూడా ఈ రేంజ్ లోనే ఫోన్లు అందిస్తామన్నారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా తమ కుమారుడు 'వియాన్' పేరుతో దీన్ని ప్రారంభించారు.