అభియోగాలు నమోదు చేయాలంటే తప్పనిసరి అన్న న్యాయ నిపుణులు
ఈ చట్టాన్ని జోడించి కోర్టుకు సమాచారమిచ్చిన అధికారులు
కీలక సాక్షిగా ఎస్‌ఐబీలో పనిచేసిన టీఎస్‌ఎస్‌పీ హెడ్ కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (ఐటీఏ)ను కూడా జత చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నా రు. పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైనప్పుడు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల అరెస్టు సమ యంలో ఈ చట్టంలోని సెక్షన్ల మేరకు ఆరోపణలు లేవు.
తాజాగా ఈ చట్టాన్ని జోడించిన అధికారులు ఈ మేరకు నాంపల్లి కోర్టుకు మెమో ద్వారా సమాచారమిచ్చా రు. మరోపక్క ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించ డానికి అవసరమైన చర్యలను సిట్ అధికారులు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్‌ఐబీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసిన టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ను సాక్షిగా చేర్చారు.
ఐటీఏ ఉండాలన్న న్యాయ నిపుణులు
ట్యాపింగ్‌పై ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్ రావు, ఇతరులపై ఈ నెల 10న కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్‌ఐఆర్) పోలీసులు మూడు చట్టాల్లోని తొమ్మిది సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల్లోని సెక్షన్లు చేర్చారు. కాగా ఈ నెల 13న ప్రణీత్ అరెస్టు తర్వాత కోర్టులో రిమాండ్ కేసు డైరీని సమర్పించిన అధికారులు.. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు.
తొలుత చేర్చిన ఐపీసీలోని 120 బీ (కుట్ర), 34 (ఒకే ఉద్దేశంతో చేసే ఉమ్మడి చర్య) రెండు సెక్షన్లలో.. 120 బీ సెక్షన్లను తొలగించారు. అయితే నిందితులపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కింద అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఐటీఏను జోడించి, అందులోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పిటిషన్లతో పాటు ఈ చట్టాన్ని జోడిస్తూ మెమోను కూడా అధికారులు కోర్టులో దాఖలు చేశారు.
కీలకం కానున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ
హార్డ్‌డిస్క్‌ల విధ్వంసంలో ప్రణీత్‌రావుతో కలిసి పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కైతోజు కృష్ణను ఈ కేసులో సాక్షిగా చేర్చారు. నాటి ఎస్‌ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కృష్ణతో కలిసే ఎస్‌ఐబీ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తో పాటు అధికారిక ట్యాపింగ్‌లు జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను కృష్ణ ద్వారా ఆఫ్ చేయించాడు.
అతని సహాయంతో వార్ రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితో పాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్ డిస్క్‌ల్నీ ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ధ్వంసం చేశాడు. ఈ కారణంగానే సిట్ అధికారులు కృష్ణను సాక్షిగా చేర్చారు. త్వరలో ఇతడితో న్యాయస్థానంలో స్టేట్‌మెంట్ రికార్డు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే సిట్ కృష్ణ వాంగ్మూలం నమోదు చేయగా.. భవిష్యత్తులో అతను సాక్ష్యం చెప్పకుండా ఎదురుతిరిగే అవకాశం లేకుండా ఈ చర్య తీసుకోనున్నారు.
ఎస్‌ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం..
ఎస్‌ఐబీని చాలాకాలం పాటు పదవీ విరమణ పొంది ఓఎస్డీలుగా పనిచేస్తున్న వాళ్లే నడిపినట్లు తెలిసింది. ఇలాంటి దాదాపు 15 మంది అధికారులను ఆధారంగా చేసుకుని కథ నడిపినట్లు సమాచారం. ఓ మాజీ డీఐజీ, ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు ఇందులో కీలకంగా పనిచేశారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మారిన తరవాత ప్రభాకర్‌రావుతో పాటే వీళ్లు కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు.
సాధారణంగా ఎస్‌ఐబీ లాంటి సున్నిత విభాగాల్లో మాజీ అధికారులను, ప్రైవేట్ వ్యక్తులను కీలక స్థానాల్లో ఉంచరని, అయితే ప్రభాకర్‌రావు స్వయంగా ఓఎస్డీ కావడంతో ఎస్‌ఐబీలో ఓఎస్డీలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల రాజ్యం నడిచిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రణీత్‌రావుకు ట్యాపింగ్ వ్యవహారంలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు సహకరించినట్లు సిట్ తేల్చింది.
ఆ అధికారులకు త్వరలో నోటీసులు?
అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు త్వరలో డీజీపీ, అదనపు డీజీపీ స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన కార్యాలయం లక్డీకాపూల్‌లో ఉన్నప్ప టికీ... గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఎస్‌ఐబీ కార్యాలయంలో కూడా ఆయనకు ఓ ఛాంబర్ ఉంది. గడిచిన కొన్నేళ్లుగా నిఘా విభాగాధిపతి అక్కడకు రాక పోవడంతో ప్రణీత్ రావు ఈ ఛాంబర్‌తో పాటు పక్కన ఉన్న రూమ్‌ను తన అక్రమ ట్యాపింగ్ వ్యవహారాల కోసం వార్‌రూమ్‌గా వినియోగించుకున్నట్లు తేలింది.
ఆ చాంబర్ ఇతరులు విని యోగించాంటే కచ్చితంగా నిఘా విభాగాధిపతి, డీజీపీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఏ కారణం చెప్పి ఈ అనుమతి తీసుకు న్నారు? ట్యాపింగ్ వ్యవహారాలు తెలిసే అను మతి ఇచ్చారా? లాంటి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి గాను వీరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment