సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్‌రావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసులో ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రే వీరి ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరినీ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్టు చేశారు.
ఇక, విచ్చలవిడిగా ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. విచారణకు రావాలని గతంలో ఎస్‌ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ బృందం భావిస్తోంది.
ఫోన్లతో మొదలుపెట్టి..
నిఘా విభాగాలు జాతీయ భద్రతతోపాటు రాజద్రోహం తదితర అంశాలపైనా కన్నేసి ఉంచడానికి ట్యాపింగ్ చేస్తుంటాయి. అలా నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగు లోకి వచ్చినట్టు సమాచారం. అయితే ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసర మైన ఫోన్లను ట్యాప్ చేసింది.
ఉప ఎన్నికల వేళ ట్యాపింగ్..
దీనివల్ల జరుగుతున్న లాభాలు తెలిసిన రాజకీయ నాయకులు వీలైనన్ని నంబర్లను అక్రమంగా ట్యాప్ చేసేలా ప్రేరేపించారు. దీనికోసం విదేశాల నుంచి పరికరాలు, సాఫ్ట్‌వేర్లు అక్రమంగా దిగుమతి అయ్యాయి. 2018 ఎన్నికల నాటి నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్ మీడియాను ట్యాప్ చేయడం మొద లెట్టారు. దీనికోసం టెక్నా లజీ కన్సల్టెంట్ రవి పాల్ సహకారంతో ఇజ్రాయిల్ నుంచి పెగాసిస్ తరహా సాఫ్ట్‌వేర్ తెప్పించుకుని విని యోగించినట్టు సమాచారం.
‘ట్యాపింగ్’ ఆధారంగా వసూళ్లు!
కొన్నాళ్లుగా ప్రభాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ రాజకీయ నాయకుడు కలసి బెదిరింపుల దందాకు దిగారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు, బిల్డర్లు, ఇన్‌ఫ్రా కంపెనీల యజమానుల ఫోన్లను ట్యాప్ చేశారు. దీనికోసం హైదరాబాద్‌లోని పర్వతగిరి, వరంగల్, సిరిసిల్లలోనూ వార్ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్‌రావు, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్‌లలో పనిచేసిన ఇద్దరు అధికారులు, మరికొందరు బృందంతో కలసి ఆ ట్యాపింగ్స్‌లోని అంశాలను విశ్లేషించేవారు. కీలక అంశాలను పట్టుకుని.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక విభాగాల్లో పనిచేసే కొందరి దృష్టికి తీసుకువెళ్లేవారు.
వారు సదరు రాజకీయ నాయకుడితోపాటు ప్రభాకర్‌రావు నుంచి క్లియరెన్స్ తీసుకుని.. సదరు టార్గెట్ల నుంచి వీలైనంత వరకు వసూళ్లు చేసేవారు. అప్పట్లో ఈ మూడు ప్రత్యేక విభాగాలకు నేతృత్వం వహించిన అధికారులు.. నాటి ప్రభుత్వంతోపాటు ప్రభాకర్‌రావుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని సమాచారం. కొన్ని వసూళ్ల వ్యవహారాలను ఓ ఎంపీ, ఎమ్మెల్సీ సూచనలతోనూ కొనసాగించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment