అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులతో కలిపి ప్రణీత్‌ను కోర్టులో హాజరుపర్చిన సిట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో శనివారం అరెస్టు చేసిన అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలతోపాటు కస్టడీ ముగిసిన మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావులను సిట్ అధికారులు ఆదివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రణీత్‌రావుకు బుధవారం వరకు, భుజంగరావు, తిరుపతన్నలకు ఏప్రిల్ 6 వరకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. భుజంగరావు, తిరుపతన్నలను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందికి సిట్ నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచింది. ఈ కేసులో ప్రధానాంశం ఫోన్ ట్యాపింగ్ కావడంతో ‘టెలిగ్రాఫిక్ యాక్ట్’ను కూడా జోడించాలని అధికారులు నిర్ణయించారు.
ముగ్గురి కోసం ఔట్‌లుక్ సర్క్యులర్
పంజగుట్టలో నమోదైన ఈ ట్యాపింగ్ కేసులో శనివారం వరకు ప్రణీత్‌రావు మాత్రమే నిందితుడిగా ఉండేవారు. సిట్ దర్యాప్తు, ప్రణీత్‌రావు వెల్లడించిన అంశాల ఆధారంగా భుజంగరావు, తిరుపతన్నలను కూడా నిందితులుగా చేర్చినట్టు సిట్ కోర్టుకు తెలిపింది. వీరితోపాటు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ అధిపతిని కూడా నిందితులుగా చేర్చినా.. విదేశాల్లో తలదాచుకున్నారు. దీంతో ఆ ముగ్గురి కోసం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు అధికారులు లుక్‌ఔట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీ చేశారు.
వ్యక్తిగత జీవితాలూ ‘ట్యాప్’..
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉపరకణాలు, సాఫ్ట్‌వేర్లతో ల్యాండ్‌లైన్లు, సెల్‌ఫోన్ కాల్స్‌తోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేసిన ‘ప్రభాకర్‌రావు టీమ్’.. బెదిరింపు వసూళ్లకు పాల్పడటంతోపాటు కొందరి వ్యక్తిగత జీవితాలపైనా నిఘా పెట్టినట్టు తెలిసింది. హైప్రొఫైల్ వ్యక్తుల అంతర్గత వ్యవహారాలను ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని.. వారికి ఆ వాయిస్‌లు, సందేశాలు చూపి, భారీ డిమాండ్లు నెరవేర్చుకున్నట్టు సమాచారం. అప్పటి ప్రతిపక్షనేత రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబీకులతోపాటు కొందరు పోలీసు ఉన్నతాధికారులు, బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నేతలు, కీలక వ్యక్తులపైనా ట్యాపింగ్ నిఘా పెట్టినట్టు తెలిసింది.
ప్రభాకర్‌రావుకు ఊహించిన షాక్..
ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు నుంచి ఇక్కడి ఓ పోలీసు ఉన్నతాధికారికి కాల్ వచ్చినట్టు తెలిసింది. ఇప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు మీరు ఎలా ట్యాపింగ్ కేసులో దూకుడుగా వెళ్తున్నారో.. అప్పటి ప్రభుత్వ ఒత్తిడితోనే తాను ట్యాపింగ్‌లో జోక్యం చేసుకున్నానని ఆయన చెప్పినట్టు సమాచారం. మనం మనం పోలీసులమేనని, కేసు దర్యాప్తు పేరుతో ఇళ్లలో సోదాలు చేయడమేంటని కూడా ప్రభాకర్‌రావు పేర్కొన్నట్టు తెలిసింది.
తాను వైద్యం కోసమే అమెరికా వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పినట్టు సమాచారం. ఇదంతా విన్న సదరు ఉన్నతాధికారి.. ‘‘మీరు ఏం చెప్పాలనుకున్నా, ప్రశ్నించాలనుకున్నా నా అధికారిక మెయిల్ ఐడీకి ఈ–మెయిల్ పంపండి. అప్పుడే నేను ఎలాంటి సమాధానం ఇవ్వాలో అలాంటి సమాధానం ఇస్తా..’’ అని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనితో ప్రభాకర్‌రావు మౌనంగా ఫోన్ కట్ చేసినట్టు సమాచారం.
సిట్ దర్యాప్తునకు కొన్ని ఆటంకాలు!
అక్రమ ట్యాపింగ్ వ్యవహారం మూలాలు బయటపడాలన్నా, సూత్రధారులను తేల్చాలన్నా సాంకేతిక ఆధారాలు కీలకం. అందుకే వాటిని సేకరించడానికి సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఓ నిఘా విభాగం నుంచి నగర పోలీసులకు సరైన సహకారం అందట్లేదని తెలిసింది. అందుకే దర్యాప్తు జాప్యం అవుతోందని సమాచారం. కేసు దర్యాప్తు కోసం అధికారులు అడిగిన పలు సున్నిత అంశాలు తెలపడానికి, ఉపకరణాల విశ్లేషణ కోసం సదరు నిఘా విభాగం అధికారి అనుమతించట్లేదని తెలిసింది. పోలీసులు వచ్చి తమ విభాగంలో అంశాలన్నీ పరిశీలిస్తే.. బయటి ప్రపంచానికి తెలిసిపోతాయని, తద్వారా వ్యూహాలు దెబ్బతింటాయని చెప్తున్నట్టు సమాచారం. భవిష్యత్తులో జాతీయ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తాము కీలక ఆపరేషన్లు చేపట్టలేమని సదరు అధికారి పేర్కొంటున్నట్టు తెలిసింది. దీంతో సిట్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక నేతలు?
భుజంగరావును శనివారం అరెస్టు చేసిన సిట్ అధికారులు.. ఆయన నుంచి ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆయనను విచారించిన సమయంలో, ఉపకరణాల విశ్లేషణలో సిట్ అధికారులకు కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. ట్యాపింగ్ చేయాల్సిన టార్గెట్ల వివరాలు ఆయనకు నేరుగా ఓ ముఖ్య నేత నుంచి వచ్చినట్టు తేలింది. డీఎస్పీ ప్రణీత్‌రావుకు మరో కీలక నేత నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఆ నేతల పాత్రకు సంబంధించి పలు ఆధారాలు లభించిన నేపథ్యంలో.. కేసులో వారి పేర్లను చేర్చాలని సిట్ నిర్ణయించినట్టు తెలిసింది. తొలుత సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేయాలని, వారి స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment