ట్యాపింగ్ కేసును మలుపు తిప్పిన ప్రభాకర్‌రావు అఫిడవిట్
ఇది వాంగ్మూలంతో సమానమంటున్నన్యాయ నిపుణులు
అందులో డీజీపీ,ఇంటెలిజెన్స్ అదనపుడీజీల అంశం ప్రస్తావన
వీరి స్టేట్‌మెంట్ సైతం తప్పనిసరి అంటున్న అధికారులు
త్వరలో కేసులో కీలక పరిణామాలు?
సాక్షి, హైదరాబాద్: రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుపై పంజగుట్ట పోలీసులు ఇటీవల అరెస్టు వారెంట్ తీసుకున్నారు. దీనికోసం నాంపల్లి కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రభాకర్‌రావు ఓ అఫిడవిట్ వేశారు. అందులో ఉన్న అంశాలు ఆయన వాంగ్మూలంతో సమానం కావడం కొత్త ట్విస్ట్‌కు కారణ మైంది. తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పటి డీజీపీలు, నిఘా విభాగాధిపతిగా ఉండే అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు తన వాంగ్మూలంలో ప్రభాకర్‌రావు పేర్కొనడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆ అధికారులకూ నోటీసులు ఇస్తారా?
అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్‌రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు. ఎస్‌ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. మరోపక్క ఎస్‌ఐబీలో ప్రణీత్‌రావు వార్‌రూమ్‌గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటా యించనవే.
ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచి్చతంగా నిఘా విభా గాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అయితే ఇప్పటివరకు ఈ విషయాలను ఎవరూ తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేయలేదు. నాంపల్లి కోర్టులో ప్రభాకర్‌రావు తరఫున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన అఫిడవిట్‌తో మాత్రం డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావనకు వచి్చంది. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పని చేశానంటూ ప్రభాకర్‌రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకించినట్లు అయింది. న్యాయ స్థానంలో దాఖలైన అఫిడవిట్‌ను ప్రభాకర్‌రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఇద్దరు మాజీ డీజీపీలు, నిఘా విభాగం మాజీ అదనపు డీజీకి నోటీసులు జారీ చేసి వాంగ్మూలం నమోదు చేయడం తప్పనిసరి కానుందని తెలుస్తోంది.
ఆ మాజీ సీపీల నుంచి కూడా వాంగ్మూలం?
మరోపక్క టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేరాంగీకార వాంగ్మూలం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్లుగా పని చేసిన సీనియర్ ఐపీఎస్‌ల నుంచి వాంగ్మూలం సేకరించడం తప్పనిసరిగా మారింది. ‘ఎన్నికల టాస్‌్క’లకు సంబం ధించి తనకు అప్పటి పోలీసు కమిషనర్ ద్వారానే ఆదేశాలు ఇప్పించాలని కోరానని, ప్రభాకర్‌రావు ఆ ప్రకారమే చేశారని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్, నిఘా అనేది ఎస్‌ఐబీ అ«దీనంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) చేసింది. అయితే టార్గెట్ చేసిన వారిని పట్టుకోవడం, నగదు స్వాధనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం టాస్‌్కఫోర్స్ నిర్వర్తించింది. ఈ విభాగం పోలీసు కమిషనర్ అ«దీనంలో, ఆయన పర్యవేక్షణలో పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ పోలీసు కమిషనర్ల నుంచి వాంగ్మూలాలు తీసుకోవడమూ అనివార్యంగా మారనుంది.
ఎన్నికల ఫలితాల తర్వాత అరెస్టులు?
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైంది. అయితే దీన్ని దర్యాప్తు చేయడం కోసం అనధికారికంగా ఓ సిట్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ బృందం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లోని మొదటి అంతస్తు కేంద్రంగా పని చేసింది. అయితే తాజాగా దీన్ని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. అక్కడ అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నోటీసుల జారీ, విచారణ, వాంగ్మూలాల నమోదుతో పాటు కొందరు పోలీసులు, ప్రైవేట్ వ్యక్తుల అరెస్టులు చోటు చేసుకుంటాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment