భారత్ మార్కెట్లో..మరిన్ని పెట్టుబడులు
♦ టెక్నాలజీ, ఇన్‌ఫ్రా రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తాం
♦ మరింత మెరుగైన సేవలపై దృష్టి
♦ అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ వెల్లడి
న్యూఢిల్లీ: పోటీ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను అధిగమించే క్రమంలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత్ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రత్యర్ధి సంస్థలకు దీటైన పోటీనిచ్చేలా టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పటిష్టపర్చుకునేందుకు మరింతగా పెట్టుబడులు కొనసాగిస్తామని అమెజాన్ వ్యవస్థాపక సీఈవో జెఫ్ బెజోస్ తెలిపారు. ఇటు విక్రేతలు, అటు కొనుగోలుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ కంపెనీ నిరంతరంగా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
భారత్‌లో అత్యధిక సంఖ్యలో నెటిజన్లు సందర్శిస్తున్న, అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్ ప్లేస్ అమెజాన్ అని బెజోస్ తెలిపారు. ప్రైమ్ ఆఫర్‌ను (సభ్యత్వం తీసుకున్నవారికి వేగవంతమైన డెలివరీ, వీడియో సేవలు అందించే ప్లాన్) ప్రారంభించిన తొమ్మిది నెలల్లో 75 శాతం మంది ఎంచుకున్నారని ఆయన తెలియజేశారు. అలాగే విక్రేతల కోసం ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల సామర్థ్యాన్ని కూడా 26 శాతం పెంచామని, కొనుగోలుదారుల కోసం ఫైర్ టీవీ స్టిక్‌ను కూడా ప్రవేశపెట్టామని బెజోస్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్‌లో కార్యకలాపాలకు అత్యధికంగా వెచ్చిస్తుండటంతో... అమెజాన్ అంతర్జాతీయ వ్యాపార విభాగం నష్టాలు నాలుగు రెట్లు అధికమై 481 మిలియన్ డాలర్లకు చేరిన నేపథ్యంలో బెజోస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెజాన్ మొత్తం అమ్మకాల్లో అంతర్జాతీయ వ్యాపార విభాగం వాటా 31 శాతంగా ఉంటుంది. మిగతా దాంట్లో 59 శాతం ఉత్తర అమెరికా నుంచి, 10 శాతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి వస్తుంది. జనవరి–మార్చి త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 23 శాతం పెరిగి 35.7 బిలియన్ డాలర్లకు చేరగా, లాభం 41 శాతం వృద్ధితో 724 మిలియన్ డాలర్లకు చేరింది.
పోటీ సంస్థతో పోరు తీవ్రం..
సుమారు నాలుగేళ్ల క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించిన అమెజాన్.. దేశీ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. దీంతో మార్కెట్‌పై ఆధిపత్యం దక్కించుకునేందుకు శరవేగంగా కార్యకలాపాలను విస్తరిస్తోంది. కొనుగోలుదారులకు వేగంగా డెలివరీ సేవలు అందించే దిశగా దేశవ్యాప్తంగా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌కి 10 రాష్ట్రాల్లో 34 గిడ్డంగులు ఉన్నాయి. అమెజాన్ ఇప్పటికే భారత్‌లో 5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈమధ్యే సేకరించిన 1.4 బిలియన్ డాలర్ల నిధులతో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను ఆకట్టుకునే ఆఫర్లు ఇచ్చేందుకు, కార్యకలాపాలను పటిష్టం చేసుకునేందుకు వెచ్చించనుండటంతో ఇరు సంస్థల మధ్య పోరు రాబోయే రోజుల్లో మరింతగా ముదరనుందని పరిశీలకుల అంచనా.