
భారత్‌లో రానున్న ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని అమెజాన్ వ్యవస్ధాపకులు జెఫ్ బెజోస్ భరోసా ఇచ్చారు.
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో 2025 నాటికి అదనంగా పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకొస్తామని అమెజాన్ వ్యవస్ధాపకులు జెఫ్ బెజోస్ హామీ ఇచ్చారు. భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో చిన్న మధ్యతరహా వ్యాపారాల డిజిటలీకరణ కోసం తాము వంద కోట్ల డాలర్లు వెచ్చిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. భారత ప్రభుత్వంతో రిటైల్ నిబంధనలపై వివాదం కొనసాగుతున్నా బెజోస్ భారీ ప్రణాళికలను ప్రకటించారు. భారతీయుల శక్తిసామర్థ్యాలు, వినూత్న పద్ధతులు తనను ఆకట్టుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు.
చిన్న వ్యాపారులు మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేలా తమ పెట్టుబడులు ఉపకరిస్తాయని అన్నారు. అమెజాన్ అంతర్జాతీయ ఫ్లాట్‌ఫాం ద్వారా భారత్ నుంచి 2025 నాటికి వేయి కోట్ల డాలర్ల ఎగుమతులు ప్రపంచ దేశాలకు చేరువవుతాయని చెప్పారు. భారత్‌లో తాము వెచ్చించే పెట్టుబడులతో మరో ఐదేళ్లలో దేశవ్యాప్తంగా పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు.