న్యూఢిల్లీ: దేశీ ఎయిర్‌లైన్స్ దిగ్గజం జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రతిపాదిత జీతాల కోత, ఉద్యోగుల తొలగింపులపై దుమారం చెలరేగుతోంది. జీతాల తగ్గింపు విషయంలో కంపెనీ యాజమాన్యం, పైలట్ల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. వ్యయాలను తగ్గించుకోకపోతే రెండు నెలలకు మించి నడిపే పరిస్థితి లేదంటూ జెట్ యాజమాన్యం తమను బెదిరిస్తోందని పైలట్లు పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, జెట్ ఎయిర్‌వేస్ దీనిపై శుక్రవారం ఎక్సే్ఛంజీలకు వివరణ ఇచ్చింది. 60 రోజులకు మించి నడిచే పరిస్థితి లేదంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారంటూ స్పష్టం చేసింది. అదేవిధంగా సంస్థలో వాటా విక్రయ ప్రతిపాదనలేవీ లేవని కూడా తేల్చిచెల్పింది. అయితే, వ్యయాలను తగ్గించుకోవడం కోసం పలు చర్యలను అమలు చేస్తున్నామని చెప్పడం కొసమెరుపు!!
అసలేం జరిగిందంటే...
గత వారంలో పైలట్లు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులతో జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం ఒక సమావేశం ఏర్పాటుచేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా కంపెనీ ఆర్థిక పరిస్థితులు బాగోలేవని, వ్యయాలను తగ్గించుకోవడానికి సహకరించాల్సిందిగా సిబ్బందిని యాజమాన్యం కోరింది. భారీగా జీతాల కోత, కొన్ని విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు వంటి ప్రతిపాదనలను యాజమాన్యం తమ ముందుంచిందని పైలట్ వర్గాలు పేర్కొన్నాయి. రూ. కోటి వరకు వార్షిక వేతన ప్యాకేజీ ఉన్నవారికి 25 శాతం కోత, రూ.12 లక్షల వరకు ప్యాకేజీ ఉన్న ఉద్యోగులకు 5 శాతం కోతను కంపెనీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక పైలట్లకు 17 శాతం మేర వేతన కోత ఉండొచ్చని అంచనా. జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేశ్ గోయల్, సీఈఓ వినయ్ దూబే, డిప్యూటీ సీఈఓ అమిత్ అగర్వార్ తదితరులు ఈ భేటీకి హాజరైనట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా తక్షణం వ్యయ నియంత్రణ చర్యలను చేపట్టకపోతే 60 రోజులకు మించి ఎయిర్‌లైన్స్‌ను నడిపే పరిస్థితి లేదంటూ యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం. దీనికి పైలట్లు, ఇంజినీర్లు ససేమిరా అనడంతోపాటు ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియాకు వెల్లడించడంతో కంపెనీలో గగ్గోలు మొదలైంది. ఈ ఏడాది మార్చి నాటికి జెట్ ఎయిర్‌వేస్‌లో 16,558 మంది పర్మినెంట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 6,306 మంది తాత్కాలిక/క్యాజువల్ సిబ్బంది కూడా ఉన్నారు. ఉద్యోగుల వేతన బిల్లు ఏడాదికి దాదాపు రూ.3,000 కోట్లుగా ఉంది. తాజా కోత ప్రతిపాదనలతో దాదాపు రూ. 500 కోట్ల మేర ఆదా అవుతుందని కంపెనీ లెక్కలేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ రూ.1,040 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కాగా, జనరల్ మేనేజర్లు అంతకంటే పెద్ద స్థాయి(సీనియర్ మేనేజ్‌మెంట్) ఎగ్జిక్యూటివ్‌లకు ఇప్పటికే 25 శాతం వేతన కోతను అమల్లోకి తెచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
కంపెనీ ఏమంటోంది...
అధిక ఇంధన వ్యయాలు, నిర్వహణ భారం పెరిగిపోవడంతో వ్యయాల కోతపై దృష్టిపెట్టామని స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ వివరించింది. దీనికోసం పలు చర్యలు అమలు చేస్తున్నామని.. నిర్వహణ సామర్థ్యం పెంపు, సేల్స్–డిస్ట్రిబ్యూషన్, ఉద్యోగులు, మెయింటెనెన్స్ వంటివి ఇందులో ఉన్నట్లు పేర్కొంది. పైలట్లు, ఇంజినీర్లు, ఇతరత్రా ఉద్యోగులందరితో ప్రస్తుతం పరిశ్రమతో పాటు కంపెనీ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను చర్చించిన విషయాన్ని ఒప్పుకుంది. అయితే, ప్రతిపాదిత జీతాల కోతపై మాత్రం స్పష్టమైన వివరణ ఇవ్వక పోవడం గమనార్హం. టికెట్ ధరలు తగ్గడం, అధిక ఇంధన వ్యయాలు, రూపాయి విలువ పతనం వంటి పలు అంశాల కారణంగా విమానయాన పరిశ్రమ తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోందని జెట్ ఎయిర్‌వేస్ సీఈఓ వినయ్ దూబే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, గడిచిన 25 ఏళ్లుగా ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి విజయవంతంగా తామ వ్యాపారాన్ని నడిపిస్తున్నామని చెప్పారు.
వాటా విక్రయిస్తారా..!
జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రస్తుతం గల్ఫ్‌కు చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు 24 శాతం వాటా ఉంది. ఇప్పుడు మరో 20 శాతం వాటాను ఏదైనా అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు విక్రయించాలని కంపెనీ యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ ఇతరత్రా దిగ్గజాలతో వాటా అమ్మకానికి సంబంధించి జెట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే, ఈ వార్తలను జెట్ యాజమాన్యం ఖండించింది. వాటా విక్రయంపై ఎలాంటి చర్చలూ జరపలేదని అంటోంది. కాగా, కంపెనీలో రాజుకున్న జీతాల రగడ, ఆర్థిక పరిస్థితి దిగజారిందన్న అనుమానాల నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో 9 శాతం మేర కుప్పకూలింది. ఒకానొక దశలో రూ.301 కనిష్టాన్ని తాకింది. చివరకు 7 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment