జెట్ ఎయిర్‌వేస్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : దేశీయ రెండో అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కనీసం, వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి దిగజారింది. గత నెలలో పైలెట్లకు, ఇంజనీర్లకు, సీనియర్ మేనేజ్‌మెంట్‌కు వేతనాలు ఇవ్వడం ఆలస్యం చేసిన జెట్ ఎయిర్‌వేస్, తాజాగా ఇతర కేటగిరీల ఉద్యోగులకు కూడా సెప్టెంబర్ నెల వేతనాన్ని చెల్లించడం విఫలమైంది. మరోసారి వేతనాలు ఇవ్వకుండా మరింత మంది ఉద్యోగులను తీవ్ర కష్టాల్లో పడేసింది జెట్ ఎయిర్‌వేస్.
‘ ప్రతినెలా మాకు ఒకటవ తేదీనే జీతాలు వేస్తారు. గత నెలలో సీనియర్ మేనేజ్‌మెంట్, పైలెట్లు, ఇంజనీర్లను మినహాయించి, మిగిలిన ఉద్యోగులందరికీ కూడా ఆగస్టు నెల వేతనాన్ని సరియైన సమయానికే అందించారు. కానీ ఈసారి మాత్రం సెప్టెంబర్ నెల వేతనాన్ని ఇతర కేటగిరీల ఉద్యోగులకూ ఆపివేశారు. మేనేజర్, ఇతర స్థాయి ఉద్యోగులెవరికీ ఇంకా వేతనాలు అందలేదు’ అని జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ1-ఏ5, ఓ1, ఓ2 గ్రేడ్ ఉద్యోగులకు నెల వేతనం రూ.75వేల వరకు ఉంటుంది. వారికి మాత్రమే అక్టోబర్ 1న చెల్లించారు. కానీ మిగతా ఉద్యోగులు ఎం1, ఎం2, ఈ1, ఇతర గ్రేడ్‌ల వారికి ఇంకా వేతనాలు చెల్లించలేదు. ఈ విషయంపై జెట్ ఎయిర్‌వేస్ కూడా స్పందించడం లేదు. నవంబర్ వరకు వేతనాలను రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లిస్తామంటూ ఇప్పటికే ఈ సంస్థ తన సీనియర్ ఉద్యోగులకు గోడును వెల్లబుచ్చుకుంది. ఆగస్టు నెల వేతనాన్ని కూడా అలానే చెల్లించింది. సెప్టెంబర్ 11న 50 శాతం, సెప్టెంబర్ 26న మిగతా సగాన్ని చెల్లించింది. కానీ సెప్టెంబర్ నెల వేతనాన్ని ఎలా? ఎప్పుడు? చెల్లిస్తుందో మాత్రం జెట్ ఎయిర్‌వేస్ చెప్పడం లేదు. ఈ ఎయిర్‌లైన్ సంస్థ గత కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో, ఉద్యోగులకు కూడా వేతనాలను చెల్లించలేకపోతోంది. దీంతో ఉద్యోగులు కూడా చాలా కష్టాలను పాలవాల్సి వస్తోంది. జెట్ ఎయిర్‌వేస్‌లో మొత్తం 16వేలకు పైగా ఉద్యోగులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment