గ్యాస్ తరలింపు ముందుగా తెలియదు | KG Basin dispute: ONGC denies it delayed reporting RIL issue | Sakshi
Sakshi News home page

గ్యాస్ తరలింపు ముందుగా తెలియదు

Published Fri, Sep 9 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

గ్యాస్ తరలింపు ముందుగా తెలియదు

గ్యాస్ తరలింపు ముందుగా తెలియదు

కేజీ బేసిన్‌లో రిలయన్స్‌తో వివాదంపై
ఓఎన్‌జీసీ సీఎండీ డీకే షరాఫ్

 న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌లో తమ క్షేత్రాలకు ఆనుకుని ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) కేజీ-డీ6 క్షేత్రాల్లోకి గ్యాస్ తరలిపోతోందన్న విషయంపై తమకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని కంపెనీ సీఎండీ డీకే షరాఫ్ పేర్కొన్నారు. అయితే, ఈ విషయం మాత్రం ఆర్‌ఐఎల్‌కు ముందుగానే తెలుసని చెప్పారు. గ్యాస్ తరలింపు వివాదంపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఏపీ షా కమిటీ.. ఓఎన్‌జీసీ గ్యాస్‌ను ఆర్‌ఐఎల్ లాగేసుకుందని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. 2009 నుంచి 2015 వరకూ ఈ విధంగా ఓఎన్‌జీసీ బ్లాక్‌ల నుంచి గ్యాస్ ఆర్‌ఐఎల్ క్షేత్రాల్లోకి తరలిపోయిందని... దీనికి ప్రతిగా ఆ కంపెనీకి నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా కేంద్ర పెట్రోలియం శాఖకు ఇటీవలే సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది.

ఇరు కంపెనీల క్షేత్రాలూ ఒకదానితో ఒకటి అనుసంధానమైన ఉన్నాయని, గ్యాస్ తమ క్షేత్రాల్లోకి వచ్చేస్తున్న విషయం ఆర్‌ఐఎల్‌కు ముందే తెలిసి ఉండొచ్చన్న వాదనను కమిటీ నిర్ధారించింది. అయితే, క్షేత్రాల అనుసంధానం సంగతి 2007లోనే ఓఎన్‌జీసీకి తెలిసినా కూడా 2013 వరకూ చడీచప్పుడులేకుండా ఉందని ఆర్‌ఐఎల్ చేసిన ఆరోపణలను కూడా కమిటీ తన నివేదికలో పొందుపరిచింది. ‘ఈ అంశం గురించి ఓఎన్‌జీసీకి ముందస్తుగా ఎలాంటి అవగాహన లేదు.

విషయం తెలిసిన వెంటనే(2013లో) నియంత్రణ సంస్థల దృష్టికి తీసుకెళ్లడం ఇతరత్రా చర్యలు చేపట్టాం. అయితే, మాకు ముందుగా తెలియదన్న అంశాన్ని షా కమిటీకి మేం చెప్పినప్పటికీ నివేదికలో ప్రస్తావించినట్లు లేదు’ అని షరాఫ్ వివరించారు. కాగా, ఆర్‌ఐఎల్‌కు తోడేసిన గ్యాస్ విలువ రూ.11,000 కోట్లుగా టెక్నికల్ కన్సల్టెంట్ డీఅండ్‌ఎం లెక్కగట్టిన సంగతి తెలిసిందే.

 పరిహారం ప్రభుత్వానికే..!: గ్యాస్ తరలింపునపై నష్టపరిహారం ఓఎన్‌జీసీకి కాకుండా కేంద్ర ప్రభుత్వానికే ఆర్‌ఐఎల్ చెల్లించాల్సి వస్తుందని షా కమిటీ తన నివేదికలో పేర్కొనడం ఓఎన్‌జీసీకి మింగుడుపడని అంశం. ఓఎన్‌జీసీ క్షేత్రాల నుంచి అక్రమంగా ఆర్‌ఐఎల్ గ్యాస్‌ను తరలించుకున్నప్పటికీ.. సహజవాయువుపై ఆ కంపెనీకి ఎలాంటి యాజమాన్య లేదా నియంత్రణ హక్కులు లేవని.. అందుకే నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వమే డిమాండ్ చేయాల్సి వస్తుందని కమిటీ పేర్కొంది.

అయితే, నష్టపరిహారంపై ఎవరికి హక్కులు ఉంటాయన్నది ఇప్పుడే చెప్పడం కష్టమని షరాఫ్ వ్యాఖ్యానించారు. షా కమిటీ పెట్రోలియం శాఖకు నివేదిక వచ్చిన మర్నాడే.. ఆర్‌ఐఎల్‌కు చెందిన రిలయన్స్ జియో పత్రికల్లో మొదటి పేజీల్లో ఇచ్చిన యాడ్‌లలో ప్రధాని మోదీ ఫొటో ప్రత్యక్షమైన తరుణంలో ప్రభుత్వం దీనిపై నిజంగానే చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారా అంటూ విలేకరులు అడగగా.. ఈ రెండింటికీ సంబంధం లేదని షరీఫ్ చెప్పారు.

 జీఎస్‌పీసీ కేజీ క్షేత్రంలో వాటా కొనుగోలు!
కేజీ బేసిన్‌లో జీఎస్‌పీసీకి చెందిన దీన్‌దయాల్ క్షేత్రంలో వాటా కొనుగోలుకు ఓఎన్‌జీసీ ప్రయత్నిస్తోంది. చర్చలు కొనసాగుతున్నాయని.. ఈ బ్లాక్‌లో సహజవాయువు నిల్వలను అంచనా వేసేందుకు అమెరికా కన్సల్టెంట్ రైడర్ స్కాట్‌ను నియమించుకున్నట్లు  షరాఫ్ తెలిపారు.

20% తగ్గనున్న గ్యాస్ ధర...
దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధర అక్టోబర్‌లో 20 శాతం మేర తగ్గిపోయే అవకాశం ఉందని షరాఫ్ చెప్పారు. అంతర్జాతీయంగా గ్యాస్ రేట్లు పడిపోతుండటం, దేశీ గ్యాస్ ధర నిర్ణయాన్ని దీంతో అనుసంధానించడటమే దీనికి కారణమన్నారు. ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ఆమోదించిన ఫార్ములా ప్రకారం ప్రస్తుతం యూనిట్(ఎంఎంబీటీయూ) ధర 3.06 డాలర్లు కాగా, ఈ అక్టోబర్ 1 నుంచి దాదాపు 2.5 డాలర్ల స్థాయికి తగ్గనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌లకు చెందిన ప్రస్తుత క్షేత్రాలకు ఇది వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ ఫార్ములా ప్రకారం ప్రతి ఆరు నెలలకు గ్యాస్ ధరను సవరించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement