కనిష్ట స్థాయికి ఐవీఆర్ సీఎల్ షేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణంలో ఉన్న కోల్‌కతా ఫ్లై ఓవర్ కుప్పకూలటంతో దాని నిర్మాణసంస్థ ఐవీఆర్‌సీఎల్ షేరు... నేల చూపులు చూస్తోంది. రెండు రోజుల్లో 18 % నష్టపోయి, పదమూడేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. కంపెనీ మేనేజ్‌మెంట్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశారన్న వార్తలతో శుక్రవారం ఒక్కరోజే భారీ ట్రేడింగ్ పరిమాణంతో 12 శాతం నష్టపోయి రూ. 5.65 వద్ద ముగిసింది. 2003 తర్వాత షేరు ఈ స్థాయికి పడిపోవడం ఇదే ప్రధమం.
నాణ్యతా లోపం లేదు...: నిర్మాణంలో మాత్రం ఎటువంటి నాణ్యతా లోపం లేదని కంపెనీ ప్రతినిధి కె. పాండురంగారావు తెలిపారు. ఫోటోలను బట్టి చూస్తూంటే బాంబు పేళ్లుల్ల వల్ల కూలినట్టుగా కనిపిస్తోందని, దర్యాప్తు పూర్తయితే కానీ ఈ దురదృష్టకర సంఘటనకు గల కారణాలు తెలియవని కంపెనీ న్యాయ సలహాదారు పి.సీత అన్నారు. వంతెన కూలడం విధిరాత అన్నట్లుగా వచ్చిన వార్తలపై యాజమాన్యం మరోసారి వివరణ ఇచ్చింది. ‘‘మా మాటల్లో భావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నిర్మాణంలో ఎలాంటి లోపాలూ లేవని, జరిగిన దుర్ఘటన మా చేతుల్లో లేదు అని చెప్పాం. దీన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుంది’’ అని కంపెనీ వివరించింది.