ఐవీఆర్‌సీఎల్ దక్కేదెవరికి? | start the ivrcl shares | Sakshi
Sakshi News home page

ఐవీఆర్‌సీఎల్ దక్కేదెవరికి?

Published Tue, Dec 1 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

ఐవీఆర్‌సీఎల్ దక్కేదెవరికి?

ఐవీఆర్‌సీఎల్ దక్కేదెవరికి?


 యాజమాన్య వాటాపై బ్యాంకులు దృష్టి
 రెండు రోజుల్లో ముంబైలో లెండర్స్ కీలక భేటీ
 అడ్డుకోవడానికి కొత్త ప్రతిపాదనలతో ముందుకొచ్చిన ప్రమోటర్లు
 అసెట్ కంపెనీని డీమెర్జ్ చేస్తామంటూ సరికొత్త ప్రతిపాదన
 ఈ వార్తల నేపథ్యంలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకిన షేరు
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఐవీఆర్‌సీఎల్‌లో వాటాల ఆట మొదలయ్యిందా? కంపెనీలో 51 శాతం యాజమాన్య హక్కులు తీసుకునేలా బ్యాంకులు అడుగులు వేస్తుండటంతో దీన్ని అడ్డుకోవడానికి ప్రస్తుత ప్రమోటర్లు పావులు కదుపుతున్నారా? దీనికి మార్కెట్ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు గతంలో జీ గ్రూపునకు చెందిన ఎస్సెల్ టేకోవర్ నుంచి కంపెనీని కాపాడుకోవడానికి ప్రమోటర్లు చేసిన ప్రయత్నాలను గుర్తుకు తెస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
 
 భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఐవీఆర్‌సీఎల్‌లో స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ (ఎస్‌డీఆర్)  కింద యాజమాన్య హక్కులను తీసుకోవడానికి బ్యాంకులు ప్రయత్నిస్తుండటం తెలిసిందే. ప్రస్తుతం కంపెనీలో బ్యాంకులకు 43.88 శాతం ఉండగా, వ్యవస్థాపక ప్రమోటర్ల వాటా 9 శాతం లోపు ఉంది. ప్రమోటర్ల వాటాలో అత్యధిక భాగం తనఖాలో ఉంది. దీంతో నిర్మాణ రంగంలో అపారమైన అనుభవం కలిగిన ఐవీఆర్‌సీఎల్‌ను ప్రస్తుత ప్రమోటర్లు సరిగా నిర్వహించలేకపోతుండటంతో, యాజమాన్య హక్కు తీసుకోవడం ద్వారా కంపెనీని తిరిగి గాడిలో పెట్టాలని బ్యాంకర్లు నిర్ణయించారు. ఇందుకోసం ఎస్‌బీఐ నేతృత్వంలో ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐవోబీ, కెనరా, ఆంధ్రా బ్యాంక్‌లు కన్సార్షియంగా ఏర్పడ్డాయి.
 
 మెజార్టీ వాటా తీసుకోవటంపై వచ్చే రెండు రోజుల్లో ముంబైలో జరిగే సమావేశంలో బ్యాంకర్లు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఎస్‌డీఆర్ స్కీం కింద గామన్ ఇండియా, మానెట్ ఇస్పాత్ కంపెనీల్లో 51 శాతం వాటా తీసుకోవడానికి బ్యాంకులు ముందుకొచ్చాయి. అదే విధంగా ఇప్పుడు ఐవీఆర్‌సీఎల్‌లో కూడా మెజార్జీ వాటాను తీసుకోవడానికి బ్యాంకులు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
 
 ప్రమోటర్ల పైఎత్తులు...
 యాజమాన్య హక్కులను కాపాడుకోవడానికి వ్యవస్థాపక ప్రమోటర్లు అన్ని అస్త్రాలనూ ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐవీఆర్‌సీఎల్ డీమెర్జర్ ప్రతిపాదనను బ్యాంకుల ముందుకు తెచ్చారు. ప్రధాన ఆదాయ వనరైన ఈపీసీ వ్యాపారాన్ని అప్పులు భారీగా ఉన్న అసెట్స్ హోల్డింగ్స్ కంపెనీ నుంచి విడదీయాలన్నది ప్రస్తుత ప్రమోటర్ల ఆశ. తద్వారా 2012లో చేసిన తప్పును సరిదిద్దుకొని ఈపీసీ వ్యాపారంపై దృష్టిపెట్టాలనుకుంటున్నారు. ఐవీఆర్‌సీఎల్ అసెట్స్ అండ్ హోల్డింగ్ లిమిటెడ్‌ను 2012లో ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రాలో కలిపారు.
 
  దీనివల్ల అసెట్స్ కంపెనీకున్న అప్పులన్నీ ఇన్‌ఫ్రా కంపెనీ మెడకు చుట్టుకొని కొత్త ప్రాజెక్టులను చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ రెండింటినీ విడదీసి ప్రధానమైన ఈపీసీ వ్యాపారంపై దృష్టిసారించి, క్రమంగా ఆస్తులను విక్రయించడం ద్వారా అసెట్స్ అండ్ హోల్డింగ్ కంపెనీకున్న అప్పులను తీర్చాలన్నది ప్రస్తుత ప్రమోటర్ల ఆలోచనగా ఉంది. ఇలా చేస్తే బీవోటీ ప్రాజెక్టుల దగ్గర నుంచి కంపెనీకి ఉన్న 1,800 ఎకరాల రియల్ ఎస్టేట్ ఆస్తులు అసెట్స్ అండ్ హోల్డింగ్ కంపెనీకి బదిలీ అవుతాయి. ప్రస్తుతం ఉమ్మడి ఐవీఆర్‌సీఎల్‌కు సుమారు రూ.7,500 కోట్ల అప్పులున్నాయి. కంపెనీ విభజన జరిగితే అసెట్స్ అండ్ హోల్డింగ్ కంపెనీకి అప్పులు రూ.4,500 కోట్ల వరకు వెళతాయి. ఇందులో ఇప్పటికే 3 బీవోటీ ప్రాజెక్టులను విక్రయించడంతో రూ. 1,500 కోట్ల రుణ భారం తగ్గనుంది. కానీ ఈ విక్రయానికి ఇంకా అధికారికంగా ఆమోద ముద్ర పడలేదు.
 
 ప్రస్తుతం ఈపీసీ వ్యాపారం నిర్వహణపరంగా లాభాల్లోనే ఉంది. కానీ, ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలపై ఏటా రూ.900 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుండటంతో చేతిలో రూ1,800 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నప్పటికీ.. వాటిని నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.  ప్రధానమైన ఈపీసీ విభాగానికి రూ. 3,000 కోట్ల వరకు అప్పుల భారం ఉంటుంది. ఇవి ప్రధానంగా వర్కింగ్ క్యాపిటల్‌కు సంబంధించిన రుణాలు కావడంతో పెద్దగా ఇబ్బంది లేదని, కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా ఇబ్బంది ఉండదనేది ప్రమోటర్ల వాదన. కానీ ఈ ప్రతిపాదనలను బ్యాంకర్లు ఆమోదం తెలపాల్సి ఉంది. యాజమాన్య హక్కును కాపాడుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలపై ప్రమోటర్లు కన్సల్టెన్సీలను కూడా నియమించుకున్నట్లు సమాచారం.
 
 అవసరమైతే హైకోర్టును ఆశ్రయించడం ద్వారానైనా డీమెర్జర్‌ను ఆమోదింప చేసుకొని యాజమాన్య హక్కులు కాపాడుకోవాలన్నది వీరి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై ఎక్స్ఛేంజీలకు పంపిన వివర ణలో.. కంపెనీ బ్యాంకర్లతో అన్ని రకాల అంశాలను చర్చిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఎస్సెల్ టేకోవర్ సమయంలో పై చేయి సాధించిన ప్రమోటర్లు ఈ సారి కూడా విజయం సాధిస్తారా లేదా అన్నది రానున్న కొద్ది రోజుల్లో తేలుతుంది. ఈ వార్తల నేపథ్యంలో ఐవీఆర్‌సీఎల్ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ని తాకి రూ. 10.70 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement