
నోట్ల రద్దు సమస్యల్ని తొలగించే ఆవిష్కరణలు రావాలి
నాట్‌కామ్-2016 సదస్సులో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దేశవ్యాప్తంగా సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారి కష్టాలను తొలగించే ఆవిష్కరణలను తెచ్చేందుకు సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్(ఎస్‌సీఎం) ప్రొఫెషనల్స్ శ్రీకారం చుట్టాలని ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు.‘సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్- న్యూ పారడిమ్ త్రూ నెట్‌వర్కింగ్ ఫర్ మేకిన్ ఇండియా’ అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్(ఐఐఎంఎం) శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు(నాట్‌కామ్- 2016)ను ఆయన ప్రారంభించారు.
సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స(ఐవోటీ)కీలకంగా మారిందని, డీమోనిటైజేషన్‌తో ఏర్పడిన సమస్యలకు నాట్‌కామ్ సదస్సు ద్వారా పరిష్కారాలను తగిన సలహాలను అందజేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో ఐఐఎఎం ఎంపిక చేసిన పలువురికి ఉత్తమ సీఈవో, ఎంటర్‌ప్రెన్యూర్ పురస్కారాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. రాంకీ గ్రూప్ చైర్మన్ ఎ.అయోధ్యరామిరెడ్డి, ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ పి.మధుసూదన్‌కు ఉత్తమ సీఈవోలుగా, హెచ్‌ఎఎల్, సైయంట్ సంస్థల చైర్మన్లు సువర్ణరాజు, బీవీ మోహన్‌రెడ్డికి ఉత్తమ వ్యాపార వేత్తలుగా పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో నాట్‌కామ్-2016 చైర్మన్ మహేందర్‌కుమార్, ఐఐఎంఎం జాతీ య అధ్యక్షుడు ఓపీ లోంగియా తదితరులు పాల్గొన్నారు.