ఆ టెక్ సంస్థలో 2500 ఉద్యోగాలు
ఆ టెక్ సంస్థలో 2500 ఉద్యోగాలు
Published Wed, May 17 2017 12:01 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
న్యూఢిల్లీ : ఓ వైపు ఉద్యోగాల కోతతో టెకీలకు అన్ని బ్యాడ్ న్యూస్ లే వినిపిస్తుండగా.. ఎల్ అండ్ టీ ఓ చల్లటి గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజనీరింగ్ మేజర్ లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ కు చెందిన ఐటీ సర్వీసుల సంస్థ ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్(ఎల్టీటీఎస్)లో 2500 మంది భారతీయులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. 2018 ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల ఈ నియామకాలు చేపడతామని కంపెనీకి చెందిన ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని తెలిపారు. '' వృద్ధిని నమోదుచేయడంలో టెలికాం అండ్ హై-టెక్, ట్రాన్స్ పోర్టేషన్ రెండు నిటారుగా ఉన్నాయి. అదనంగా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ లో కూడా ఈ ఏడాది వృద్దిని నమోదుచేయాలనుకుంటున్నాం'' అని ఎల్టీటీఎస్ ప్రధాన మానవ వనరుల అధికారి పనేష్ రావు తెలిపారు. మింట్ పేపర్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను తెలిపారు.
ఎల్టీటీఎస్ లో ఉద్యోగాలపై ఆటోమేషన్ ప్రభావంపై మాట్లాడిన ఆయన, ఆటోమేషన్ తో ఐటీ రంగం ఉద్యోగాల కోతను ఎదుర్కొంటుందని చెప్పారు. '' మమల్ని చూసుకుంటే పూర్తిగా మాది ఐటీ కంపెనీ అనేది సరియైనది కాదు. పూర్తిగా ఇంజనీరింగ్ సర్వీసుల కంపెనీ. మేము డిజైనింగ్ కంపెనీలో ఉన్నాం. ఉత్పత్తి అయ్యేంత వరకు మేము డిజైన్ చేస్తూనే ఉంటాం. డిజైన్ ను ఆటోమేట్ చేయలేం. దానికి కచ్చితంగా మనుషుల మేధస్సు అవసరం. ఈ కారణంతో మేము ఆటోమేషన్ ముప్పును పడటం లేదు'' అని చెప్పారు. 2016 సెప్టెంబర్ లోనే ఎల్టీటీఎస్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టు అయింది. మొత్తంగా ఈ కంపెనీకి గ్లోబల్ గా 11వేల మంది ఉద్యోగులున్నారు. భారత్ లో 8750 మంది ఉద్యోగులు ఆరు డెలివరీ సెంటర్లలో పనిచేస్తున్నారు.
అమెరికాలో కూడా ఈ కంపెనీకి ఆరు డెలివరీ సెంటర్లున్నాయి. కేవలం ఇండియాలోనే కాక, అమెరికాలోనూ ఉద్యోగుల నియామకం చేపట్టాలని కంపెనీ భావిస్తోంది. తాజాగా గ్రాడ్యుయేట్లు పూర్తి చేసుకున్న వారిని కంపెనీ రిక్రూట్ చేసుకోనున్నట్టు రావు తెలిపారు. గతేడాది నియమించుకున్న 2500 మంది ఉద్యోగుల్లో 50 శాతం మంది ప్రెష్ గ్రాడ్యుయేట్లే. భవిష్యత్తులో కూడా ప్రెషర్ల ఉద్యోగులను భారీగా ఈ కంపెనీ నియమించుకోబోతుంది. అంతేకాక ఈ ఏడాది ఎంట్రీ లెవల్ ఉద్యోగుల వేతనాలను కూడా 20 శాతం వరకు పెంచనున్నట్టు రావు తెలిపారు.
Advertisement