గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Jul 3 2017 3:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

గతవారం బిజినెస్‌

గతవారం బిజినెస్‌

బ్యాంకుల నెత్తిన మరో పిడుగు
ఆర్‌బీఐ బ్యాంకులకు షాకిచ్చింది. దివాలా చర్యలు చేపట్టనున్న భారీ రుణ ఎగవేతల కేసు (ఎన్‌పీఏలు)ల్లో 50 శాతం మేర నష్టాలుగా భావించి వాటికి నిధుల కేటాయింపులు (ప్రొవిజనింగ్‌) చేయాలని బ్యాంకుల చీఫ్‌లను ఆదేశించింది. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల రూపేణా బ్యాంకులు తమ ఆదాయాల్లోంచి రూ.50,000 కోట్లను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద 12 భారీ రుణ ఎగవేత కేసులపై చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐ ఇటీవల బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఆ బ్యాంకుల అవినీతిపై సీవీసీ దర్యాప్తు
ప్రైవేటు బ్యాంకులు, వాటిల్లో పనిచేసే ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఇక నుంచి దర్యాప్తు చేపడుతుంది. ఈ మేరకు అనుమతులు లభించినట్టు సీవీసీ కమిషనర్‌ టీఎం భాసిన్‌ తెలిపారు. అవినీతి నిరోధక చ ట్టం 1988 కింద ప్రైవేటు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలు, ఇతర అ ధికారులు ప్రజా సేవకుల కిందకే వస్తారంటూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇవ్వడంతో తాజా మార్పులు చోటుచేసుకున్నాయి.

ఓఎఫ్‌ఎస్‌ నిబంధనల్ని సడలించిన సెబీ
ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) నిబంధనల్ని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సడలించింది. కంపెనీ మార్కెట్లో ఓఎఫ్‌ఎస్‌ లావాదేవీ జరిపిన తర్వాత రెండు వారాల్లోనే ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా తన ఉద్యోగులకు షేర్లను విక్రయించవచ్చు.  ప్రస్తుతం ఇటువంటి కొనుగోళ్లు, అమ్మకాలు 12 వారాల వరకూ ప్రమోటర్లు చేయకూడదన్న నిబంధన ఉంది. ఉద్యోగులకు ఇచ్చే ఆఫర్‌ను ఓఎఫ్‌ఎస్‌లో భాగంగానే పరిగణిస్తారని, ఓఎఫ్‌ఎస్‌ ఇష్యూ ధరకంటే డిస్కౌంట్‌తో ఉద్యోగులకు జారీచేయవచ్చని సెబీ తాజా సర్క్యులర్‌లో వివరించింది.  

ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలోకి మరో 5 షేర్లు
ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) విభాగంలో కొత్తగా ఐదు షేర్లను ప్రవేశపెట్టినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు వెల్లడించా యి. ఇటీవల లిస్టయిన ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో పాటు మణప్పురం ఫైనాన్స్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, శ్రేయీ ఇన్‌ఫ్రా, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ షేర్లకు సంబంధించిన ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టులు జూన్‌ 30 నుంచి అందుబాటులోకి వచ్చాయి.  

ఎయిర్‌ ఇండియా విక్రయానికి గ్రీన్‌ సిగ్నల్‌
భారీ అప్పుల భారంతో నెట్టుకొస్తున్న ఎయిర్‌ ఇండియాను ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌ ఇండియాలో వాటాల ఉపసంహరణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఎంత మేర వాటా విక్రయించాలి, విధి విధానాలు ఏంటన్నది ఖరారు చేసేందుకు మంత్రుల గ్రూపును ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ రంగంలోని ఎయిర్‌ ఇండియా రూ.52,000 కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. కాగా ఎయిర్‌ ఇండియా కొనుగోలుపై ఇండిగో ఆసక్తి కనబరుస్తోంది.

రుణాలపై వడ్డీ భారం తగ్గించుకున్న ఆర్‌ఐఎల్‌
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) 2.3 బిలియన్‌ డాలర్ల (రూ.15,000 కోట్లు) రుణాలను తక్కువ వడ్డీ రేటుకు రీఫైనాన్స్‌ చేసుకుంది. దీనివల్ల వడ్డీ రూపేణా గణనీయంగా ఆదా అవుతుందని వాటాదారులకు కంపెనీ తెలిపింది. కంపెనీ స్థూల రుణ భారం మార్చి నాటికి రూ.1,96,601 కోట్లు కాగా, ఇందులో అధిక భాగం జియో కార్యకలాపాల కోసం తీసుకున్నది కావడం గమనార్హం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,14,742 కోట్లు పెట్టుబడులు పెట్టామని కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.   

దేశీ మార్కెట్లోకి చైనా కార్ల కంపెనీ
చైనా ఆటోమొబైల్‌ దిగ్గజం ఎస్‌ఏఐసీ మోటార్‌ కార్పొరేషన్‌ తాజాగా భారత్‌ మార్కెట్లో అడుగుపెడుతోంది. ప్రసిద్ధ స్పోర్ట్స్‌ కార్‌ బ్రాండ్‌ ఎంజీ (మోరిస్‌ గ్యారేజెస్‌) వాహనాలను దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్ల తయారీ కోసం భారత్‌లో సొంత ప్లాంటు ఏర్పాటు చేయనుంది. తయారీ ప్లాంటుకు అనువైన ప్రదేశంపై కసరత్తు జరుగుతోందని, 2019 నుంచి కార్యకలాపాలు ప్రారంభించవచ్చని ఎస్‌ఏఐసీ మోటార్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. ఎంజీ మోటార్‌ ఇండియా పేరిట పూర్తి అనుబంధ సంస్థ ద్వారా భారత కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించింది.

మైండ్‌ట్రీ రూ.270 కోట్ల బైబ్యాక్‌
మైండ్‌ట్రీ డైరెక్టర్ల బోర్డు రూ. 270 కోట్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. షేరుకు రూ. 625 ధరను మించకుండా 43.2 లక్షల షేర్లను (కంపెనీ ఈక్విటీలో 2.5 శాతం) బైబ్యాక్‌ చేయనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కాగా టెండర్‌ ఆఫర్‌ మార్గంలో ఈ బైబ్యాక్‌ను మైండ్‌ట్రీ అమలుచేయనుంది.

అల్ట్రాటెక్‌–జేపీ డీల్‌ పూర్తి
జేపీ సిమెంట్స్‌ను అల్ట్రాటెక్‌ సిమెంటు టేకోవర్‌ చేయడంతో అతిపెద్ద మొండి బకాయి సమస్య పరిష్కారమయ్యిందని ఐసీఐ సీఐ బ్యాంక్‌ ప్రకటించింది. జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ గ్రూప్‌నకు (జేపీ గ్రూప్‌) ఐసీఐసీఐ బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం భారీగా రుణాలివ్వడం, ఆ రుణాల్లో అధికభాగం ఎన్‌పీఏలుగా మారడం తెలిసిందే. తాజా డీల్‌ చరిత్రాత్మకమైనదని, దేశంలో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద రుణ పరిష్కారమని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచర్‌ వ్యాఖ్యానించారు.

మౌలిక రంగం వృద్ధి డౌన్‌!
ఎనిమిది కీలక రంగాల గ్రూప్‌ ఉత్పత్తి వృద్ధి రేటు 2017 మే నెలలో 3.6 శాతంగా (2016 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోలిస్తే) నమోదయ్యింది. 2016 మే నెల్లో ఈ గ్రూప్‌ వృద్ధి రేటు 5.6 శాతం. బొగ్గు, ఎరువుల రంగాల పేలవ పనితీరు తాజా సమీక్షా నెలపై ప్రతికూల ప్రభావం చూపింది.

పొదుపు మొత్తాలపై తగ్గిన వడ్డీ
పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), కిసాన్‌ వికాస్‌ పత్రాలు, సుకన్య సమృద్ధి తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి గాను వడ్డీ రేట్లను కేంద్రం 0.1 శాతం మేర తగ్గించింది. అయితే, సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును యథాతథంగా వార్షికంగా 4% స్థాయిలోనే ఉంచింది.

పెరగనున్న మొండిబకాయిల భారం!
బ్యాంకింగ్‌ మొండిబకాయిలకు (ఎన్‌పీఏ) సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రమాద ఘంటికలు మ్రోగిం చింది. 2017 మార్చి నాటికి 9.6%గా ఉన్న నిరర్థక ఆస్తులు 2018 మార్చి నాటికి 10.2%కి చేరే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2016 సెప్టెంబర్‌లో ఎన్‌పీఏల రేటు 9.2% కావడం గమనార్హం. ఈ మేరకు ఆర్‌బీఐ తన తాజా ద్రవ్య స్థిరత్వ నివేదికను ఆవిష్కరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ స్థూల దేశీ యోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3%గా ఉంటుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement