న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలన్న ఎల్‌ఐసీ చిరకాల స్వప్నం నెరవేరింది. ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం నియంత్రిత వాటా కొనుగోలును ఎల్‌ఐసీ పూర్తి చేసినట్టు బ్యాంకు ప్రకటించింది. ‘‘ఐడీబీఐ బ్యాంకు, ఎల్‌ఐసీకి ఇది పరస్పర విజయం వంటిది. వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగులకు ఎంతో విలువను సమకూర్చిపెడుతుంది’’ అని ఐడీబీఐ బ్యాంకు పేర్కొంది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ, ఓపెన్ ఆఫర్ ద్వారా ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఎల్‌ఐసీకి అనుమతినిస్తూ గతేడాది ఆగస్ట్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. ఐడీబీఐ బ్యాంకు 1800 శాఖలను ఎల్‌ఐసీ పాలసీల విక్రయానికి టచ్ పాయింట్లుగా వినియోగించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. ఐడీబీఐ బ్యాంకుకు 1.5 కోట్ల రిటైల్ కస్టమర్లు ఉన్నారు. కస్టమర్ల గురించి తెలుసుకునేందుకు డేటా అనలిటిక్స్ సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవడంపై పెట్టుబడులను పెద్ద ఎత్తున పెంచుతామని బ్యాంకు వెల్లడించింది.
దీనివల్ల తన ఉత్పత్తుల పంపిణీని పెంచుకోవడంతోపాటు డిస్ట్రిబ్యూషన్ వ్యయాలను తగ్గించుకోవచ్చని, పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను తొలగించుకోవచ్చని పేర్కొంది. తమ రిటైల్ రుణాల పోర్ట్‌ఫోలియో 2019–20లో 50 శాతానికి చేరగలదని ఐడీబీఐ బ్యాంకు అంచనా వ్యక్తం చేసింది. ‘‘ఐడీబీఐ బ్యాంకు, ఎల్‌ఐసీ తమ పూర్తి స్థాయి సమష్టి చర్యలను వచ్చే 12 నెలల కాలంలో అమలు చేయనున్నాయి. మెరుగైన ఆర్థిక ఆరోగ్యం అన్నది కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) నుంచి నిర్ణీత కాలంలో బయటపడేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు భవిష్యత్తుకు అనుగుణమైన, టాప్ ర్యాంక్ బ్యాంకుగా అవతరిస్తాం. భాగస్వాములు అందరి ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంకు కట్టుబడి ఉంటాయి’’ అని ఐడీబీఐ బ్యాంకు తన ప్రకటనలో వివరించింది. ఐడీబీఐ బ్యాంకు 2018–19 సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,602 కోట్ల నష్టాన్ని ప్రకటించగా, బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 31.78%కి (రూ.60,875 కోట్లు) పెరిగాయి.
ప్రస్తుత ఎండీ రాకేశ్ శర్మ కొనసాగింపు
ఎల్‌ఐసీ అనుబంధ సంస్థగా ఐడీబీఐ బ్యాంకు మారినప్పటికీ... ప్రస్తుత ఎండీ రాకేశ్‌శర్మ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి నిర్వహణ బృందాన్నే కొనసాగించాలని బ్యాంకు నిర్ణయించింది. రాకేశ్ కండ్వాల్‌ను అడిషినల్ డైరెక్టర్, ఎల్‌ఐసీ నామినీ డైరెక్టర్‌గా నియామకానికి బ్యాంకు బోర్డు అనుమతించింది. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్‌లో తనకున్న వాటాలను విక్రయించే ప్రయత్నాలను తిరిగి మొదలు పెట్టడానికి కూడా బ్యాంకు బోర్డు అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఐడీబీఐ ప్రైవేటు సంస్థగా మారింది. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 21 నుంచి 20కి తగ్గినట్టయింది.
నెరవేరిన ఎల్‌ఐసీ స్వప్నం
Published Tue, Jan 22 2019 12:51 AM | Last Updated on Tue, Jan 22 2019 12:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment