అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లున్నాయా? | List of Unclaimed Deposits & Accounts? | Sakshi
Sakshi News home page

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లున్నాయా?

Published Mon, Feb 15 2016 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లున్నాయా?

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లున్నాయా?

దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ.5,124 కోట్లు
* ఇపుడు వివరాలన్నీ బ్యాంకు సైట్లలో లభ్యం
* క్లెయిమ్‌కు కేవైసీ వివరాల సమర్పణ తప్పనిసరి

ప్రసాద్‌కు ఐదు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. కనీస నిల్వ ఉంచాలి కనక ప్రతి ఖాతాలో రూ.10 వేలకు తగ్గకుండా ఉంచుతాడు. అన్ని ఖాతాలున్నా... అత్యధిక లావాదేవీలకు వాడేది మాత్రం రెండు ఖాతాలనే. ఒకటి  ఆఫీసు జీతం జమచేసే ఖాతా. రెండోది తన పర్సనల్‌గా ఇంటి దగ్గరి బ్రాంచిలో తీసుకున్న ఖాతా. మిగిలిన ఖాతాల్లో ఎప్పుడోకానీ లావాదేవీలుండవు. కొన్నాళ్లకు వాటి ఊసే మరిచిపోయాడు ప్రసాద్.

పదేళ్ల పాటు ఏ లావాదేవీ లేకపోవటంతో ఆ ఖాతాల్లోని సొమ్ము అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌గా మారింది. ఇంతలో ప్రసాద్ మరణించటంతో అతని కుటుంబీకులకు కూడా విషయం తెలియకుండానే ఉండిపోయింది. శంకర్రావుది మరో కథ. ఆయనకు వెనకా ముందూ ఎవ్వరూ లేరు. ఉన్న డబ్బుల్లో కొంత బ్యాంకులో డిపాజిట్లుగా పెట్టాడు. నామినీ ఎవ్వరినీ పెట్టలేదు. విషయం తన దగ్గరి వాళ్లక్కూడా చెప్పలేదు. అతను మరణించటంతో ఆ డబ్బును తీసుకునేవారే లేకుండా పోయారు. కొన్నాళ్లకు అది అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌గా మారింది.
 
ప్రసాద్, శంకర్రావు లాంటి వ్యక్తులు దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి క్లెయిమ్ చేయకుండా వదిలేసిన మొత్తమెంతో తెలుసా? 2013 సంవత్సరాంతానికి ఈ మొత్తం ఏకంగా రూ.5,124 కోట్లు. నిజానికి ఈ మొత్తం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ బ్యాంకులు అనేక జాగ్రత్తలు తీసుకుని, పదేళ్లు నిండిన తరవాతే వీటిని అన్‌క్లెయిమ్డ్‌గా ప్రకటిస్తున్నాయి. ఇంకా పదేళ్లు నిండకపోయినా అన్‌క్లెయిమ్డ్‌గా ఉన్న మొత్తం చాలా ఎక్కువే ఉంటుందనేది బ్యాంకింగ్ వర్గాల మాట.
 
అన్‌క్లెయిమ్డ్ వివరాలు తెలుసుకోవటమెలా?
నిజానికి ప్రతి ఒక్కరూ వారి ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకోవాలి. లేకపోతే బ్యాంక్ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి రావచ్చు. బ్యాంకులు కూడా ఆన్‌క్లైయిమ్‌డ్ డిపాజిట్ల తాలూకు డిపాజిటర్లు, ఇతర వివరాలను వాటి వెబ్‌సైట్లలో ఉంచాయి. ఇన్ని చేసినా మీ ఇంట్లో వాళ్ల డిపాజిట్ల వివరాలు వారి మరణానంతరం కూడా మీకు తెలియకపోతే... ఇంట్లో ఏవైనా బ్యాంక్ సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయేమో వెదకండి.

ప్రయోజనం లేకపోతే బ్యాంక్ వెబ్‌సైట్లలో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను జల్లెడ పట్టండి. బ్యాంకు ఖాతాదారుని పేరు మీద సెర్చ్ చేస్తే వివరాలను తెలసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఖాతాదారు పేరు, పుట్టిన తేదీ, పాన్ నంబర్, పాస్‌పోర్ట్ సంఖ్య వంటి ఆప్షన్ల ద్వారా కూడా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తెలియజేస్తున్నాయి.
 
క్లెయిమ్ చేసుకోవాలంటే...
ఆయా బ్యాంకుల వెబ్‌సైట్ల ద్వారా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తెలుసుకున్నాక ఆ విషయాన్ని సదరు బ్యాంకుకు తెలియజేయాలి. కొన్ని బ్యాంకులు మీకు కాల్ చేస్తాయి. లేకపోతే స్వయంగా మీరే దగ్గర్లోని బ్యాంక్ బ్రాంచీకి వెళ్లి విషయాన్ని చెప్పాలి. ఆ డిపాజిట్‌లోని మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలని భావిస్తే..  క్లెయిమ్ ఫామ్‌ను సదరు బ్యాంకుకు సమర్పించాలి. మీరు బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి/బ్రాంచ్ నుంచి ఈ ఫామ్‌ను పొందొచ్చు.

దీంతోపాటు బ్యాంకు వారికి ఖాతాదారు బ్యాంక్ పాస్‌బుక్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. చనిపోయిన మీ కుటుం బ సభ్యుల ఖాతాకు సంబంధించి క్లెయిమ్ చేసుకోవాలంటే అప్పుడు వారి మరణ ధ్రువీకరణ పత్రాన్నీ బ్యాంకుకు సమర్పించాలి.
 
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను క్లెయిమ్ చేస్తే...
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ ఖాతాలు ఉండొచ్చు. ఫిక్స్‌డ్ డి పాజిట్ల వడ్డీ రేట్లు, ఇతర ఖాతాల వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ మీరు అన్ క్లెయిమ్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి డబ్బును క్లెయిమ్ చేసుకోవాలంటే అప్పుడు బ్యాంకు మీకు సాధారణ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటునే చెల్లిస్తుంది.
 
ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి..
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గతేడాది ఫిబ్రవరిలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లపై ఒక ప్రకటన జారీ చేసింది.బ్యాంకులు అన్‌క్లెయిమ్డ్ డిపాజిటర్ల వివరాల సేకరణపై అధిక దృష్టి కేంద్రీకరించాలని బ్యాంకులకు సూచించింది. 2015, మార్చి 31 నాటికి అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఆయా బ్యాంకులు వాటి వెబ్‌సైట్లలో తప్పక ఉంచాలని ఆదేశించింది.

బ్యాంక్ వెబ్‌సైట్లలో మనకు ఖాతాదారు పేరు, అడ్రస్ మాత్రమే కనిసిస్తాయి. అకౌంట్ నంబర్, బ్రాంచ్ వివరాలు ఉండవు. అన్‌క్లెయిమ్డ్  డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా బ్యాంకులు సెర్చ్ ఆప్షన్‌ను ఉంచాలని, బ్యాంకులు ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలని కూడా ఆర్‌బీఐ సూచించింది. క్లెయిమ్ ఫారాలను వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని కూడా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement