లైఫ్ స్మార్ట్‌ఫోన్ కూడా పేలింది!
ఇప్పటివరకు శాంసంగ్ ఫోన్లు పేలుతున్నాయని, ఒకటీ అరా ఐఫోన్లు కూడా పేలుతున్నాయని విన్నాం. కానీ, ఇప్పుడు అదే బాటలో రిలయన్స్ అందిస్తున్న 'లైఫ్' ఫోన్లు కూడా పేలుతున్నట్లు తేలింది.
ఇప్పటివరకు శాంసంగ్ ఫోన్లు పేలుతున్నాయని, ఒకటీ అరా ఐఫోన్లు కూడా పేలుతున్నాయని విన్నాం. కానీ, ఇప్పుడు అదే బాటలో రిలయన్స్ అందిస్తున్న 'లైఫ్' ఫోన్లు కూడా పేలుతున్నట్లు తేలింది. జమ్ము కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన తన్వీర్ సాదిక్ అనే నాయకుడు తన ఇంట్లో ఉన్న లైఫ్ ఫోన్ పేలిందని, తన కుటుంబ సభ్యులు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారని ట్వీట్ చేశారు. దాంతోపాటు పేలిన ఫోన్ ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్న సాదిక్ చేసిన పోస్టింగ్‌పై లైఫ్ స్మార్ట్‌ఫోన్ల అధికారిక ట్విట్టర్ ద్వారా కూడా స్పందన వచ్చింది. 'మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం' అని అందులో పేర్కొన్నారు. కాగా, తన్వీర్ చేసిన ట్వీట్‌కు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. అందరూ సురక్షితంగా ఉన్నందుకు ఆనందంగా ఉందని, చూడబోతుంటే చాలా పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోందని.. ఇక మీదట తాను మాత్రం ఆ ఫోన్ ఉపయోగించేది లేదని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాసేపటికే రిలయన్స్ లైఫ్ దీనిపై ఒక ప్రకటన కూడా చేసింది. తమ ఫోన్లు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం డిజైన్ చేసి, ఉత్పత్తి చేసినవని.. ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారులే వీటిని రూపొందించారని అందులో తెలిపింది. సోషల్ మీడియా ద్వారా తెలిసిన ఈ విషయం గురించి తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఫోన్ పేలడానికి కారణమేంటో అంచనా వేస్తున్నామని.. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు.
శాంసంగ్ నోట్ 7 ఫోన్లు వరుసగా పేలుతున్నట్లు తెలియడం, బ్యాటరీ మార్చిన ఫోన్లు కూడా పేలడంతో భారతీయ విమానాల్లో ఈ ఫోన్లను తీసుకెళ్లడానికి వీల్లేదని డీజీసీఏ ప్రకటించింది. మరోవైపు చార్జింగ్ పెడుతుండగా తన వన్ ప్లస్ 1 స్మార్ట్ ఫోన్ కూడా పేలిందంటూ మరో యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. అతడికి ఆ సంస్థ వన్ ప్లస్ 3 ఫోన్ ఉచితంగా ఇచ్చింది.