
ఉగాదికి యప్ టీవీ సొంత సీరియల్స్
⇒ ‘ఎందుకిలా’ సిరీస్ ప్రారంభం
⇒ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ సేవలందించే యప్ టీవీ.. సొంత సీరియల్స్ నిర్మించడంలో నిమగ్నమైంది. ఇందుకోసం యప్ టీవీ ఒరిజినల్స్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. యప్ టీవీ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేశ్ బాబును నియమించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపక సీఈఓ ఉదయ్ రెడ్డి గురువారమిక్కడ విలేకరులకు చెప్పారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ.. సీరియల్స్, కార్యక్రమాలను రూపొందించడం కోసం ఐ క్యాండీ క్రియేషన్స్, ఎర్లీ మార్నింగ్ టాలెస్, ట్రెండ్‌లౌడ్, మధుర ఎంటర్‌టైన్‌మెంట్ వంటి సంస్థలతో భాగస్వామ్యమయ్యామన్నారు.
‘‘ప్రముఖ దర్శకుడు దేవా కట్టా (ఐ క్యాండీ క్రియేషన్స్) నిర్మించిన ‘ఎందుకిలా’ సీరియల్ పూర్తయింది. ఉగాదికి ప్రసారమవుతుంది. ఆయా సీరియల్స్, కార్యక్రమాలు ఎపిసోడ్ల వారీగా ప్రసారమవుతాయి. తొలుత తెలుగులో రూపొందిస్తాం. తర్వాత తమిళం, హిందీ ఇతర భాషాలకు విస్తరిస్తాం. భవిష్యత్తులో సినిమాలు కూడా నిర్మిస్తాం’’ అని వివరించారు. ఇప్పటివరకు యప్ టీవీ 73 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఎమరాల్డ్ మీడియా వాటాను కొనుగోలు చేసింది.