
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ గురువారం బెంగళూరులో తమ తొలి ఎలక్ట్రిక్ టెక్నాలజీ తయారీ హబ్‌ను ఏర్పాటు చేసింది. సుమారు రూ. 100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ హబ్‌లో ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌లో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మోటార్ అసెంబ్లీ మొదలైన వాటిని తయారు చేస్తారు. దీంతో తమ ఉత్పత్తి సామర్ధ్యం వార్షికంగా 25,000 ఎలక్ట్రిక్ వాహనాలకు చేరుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా తెలిపారు. ఈ హబ్‌తో 200 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ట్రియో, ట్రియో యారీ పేరిట రెండు ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలను ఆవిష్కరించారు. లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే ఈ ఆటోలను దేశీయంగా తయారు చేయడం ఇదే ప్రథమం అని గోయెంకా తెలిపారు. వీటి ధర రూ. 1.36 లక్షలుగా (ఎక్స్ షోరూం – బెంగళూరు) ఉంటుంది.
కేంద్ర విధానాలు ప్రశంసనీయం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం, మేకిన్ ఇండియా తదితర కార్యక్రమాలను గోయెంకా ప్రశంసించారు. దేశీ తయారీ రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు మేకిన్ ఇండియా గణనీయంగా తోడ్పడుతోందని ఆయన చెప్పారు. అలాగే జీఎస్‌టీతో పన్ను చట్టాల్లో సమూల మార్పులొచ్చాయని, వ్యాపారాల నిర్వహణ మరింత సులభతరమైందని గోయెంకా తెలిపారు. ‘ఎన్నో రకాల పన్నులు ఉండేవి. కానీ జీఎస్‌టీ రాకతో వివిధ రకాల అకౌంట్లను నిర్వహించాల్సిన అవసరం తప్పింది. జీఎస్‌టీ రేట్లు ఎక్కువ, తక్కువ గురించి చర్చలు జరగొచ్చు. కానీ ఇవన్నీ చాలా స్వల్పమైన విషయాలు. అంతిమంగా జీఎస్‌టీ ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నాయి‘ అని ఆయన చెప్పారు. దేశీ అసంఘటిత రంగాన్ని ఒక్కసారిగా ప్రధాన స్రవంతిలోకి తీసుకోవడం సాధ్యం కాదని, కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ విధానాలను కొనసాగిస్తే క్రమక్రమంగా కొన్నాళ్లకు సాధ్యపడుతుందని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment