తొలిసారైనా పాతకారుకు సై | Mahindra First Choice Wheels on rapid expansion drive | Sakshi
Sakshi News home page

తొలిసారైనా పాతకారుకు సై

Published Wed, Sep 10 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

నాగేంద్ర పల్లె

నాగేంద్ర పల్లె

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కారు పాతదైతేనేం.. కొనేందుకు సై అంటున్నారు భారతీయ కస్టమర్లు. 2013-14లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ కార్లు కొత్తవి 25 లక్షల యూనిట్లు అమ్ముడైతే, పాతవి సుమారు 30 లక్షలు చేతులు మారాయి. దీనినిబట్టి పాత కార్లకూ ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆసక్తికర అంశమేమంటే అమ్ముడవుతున్న మొత్తం పాత కార్లలో తొలిసారిగా వాహనాన్ని కొనుగోలు చేసే వారు 65 శాతం ఉంటున్నారు. ఈ రంగంలోకి పెద్దపెద్ద సంస్థలు రావడంతో బ్రాండెడ్ యూజ్డ్ కార్ల షోరూంలవైపు కస్టమర్లు మళ్లుతున్నారు.

 యువతే పెద్ద కస్టమర్లు..
 పాత కార్ల మార్కెట్‌ను నడిపిస్తున్నది యువతే. కొనుగోలుదారుల్లో 75% మంది 30-35 ఏళ్ల వయసువారే. మొత్తం విక్రయాల్లో రూ.3.75-4 లక్షల ఖరీదులో లభించే మోడళ్ల వాటా సగముంది. కొత్తకారు ధరలో అంతకంటే పెద్ద మోడల్ రావడం, నెల వాయిదాల భారమూ తక్కువగా ఉండడంతో కస్టమర్లు పాత వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు బ్రాండెడ్ యూజ్డ్ కార్ల షోరూముల్లో 100కు పైగా నాణ్యత పరీక్షలు జరిపిన తర్వాతే వాహనాలను విక్రయిస్తారు. నాణ్యతకు ఢోకా లేకపోవడంతో తృతీయ శ్రేణి నగరాల్లోని కస్టమర్లు సైతం బ్రాండెడ్ షోరూంలలో కారు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. 30 లక్షల యూనిట్లలో వ్యవస్థీకృత రంగం వాటా 20% వృద్ధితో 17% వాటా కైవసం చేసుకుంది.

 నగదు కొనుగోళ్లు..
 అయిదేళ్ల క్రితం వరకు ఒక్కో కస్టమర్ సరాసరిగా ఆరేళ్లు కారును అట్టిపెట్టుకునే వారు. ఇప్పుడు నాలుగేళ్లకే మారుస్తున్నారు. మూడేళ్ల తర్వాత 36 నెలలకు వస్తుందని అంటోంది మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్. కొత్త మోడళ్లు, కుటుంబం పెరగడం, ఆశయాలు మారడం ఇందుకు కారణమని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకు కొత్త కార్లు 57 వేలు, పాతవి 60 వేల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య వరసగా 15 వేలు, 16,500 ఉంది. నగరాల వారీగా చూస్తే ఢిల్లీలో 22 వేలు, ముంబైలో 10 వేలు, హైదరాబాద్‌లో 9 వేల పాత కార్లు ప్రతి నెల చేతులు మారుతున్నాయి. అమెరికాలో ఏటా 4.5 కోట్ల పాత కార్లు, 1.6 కోట్ల కొత్త కార్లు అమ్ముడవుతున్నాయి.

 కస్టమర్ల సందేహమే..
 పాత కారు పనితీరు ఎలా ఉంటుందో అన్న సందేహం సాధారణంగా అందరికీ ఉంటుంది. ఈ అంశమే బ్రాండెడ్ కంపెనీలకు కలిసి వస్తుందని అంటున్నారు మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ సీఈవో నాగేంద్ర పల్లె. ఇక్కడి కొండాపూర్‌లో అధీకృత డీలర్‌షిప్ ఎక్స్‌స్పీడ్ వీల్స్‌ను బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. నాణ్యతా పరీక్షలు, విక్రయానంతర సేవ, వారంటీని బ్రాండెడ్ కంపెనీలు ఇస్తాయి. దీంతో కస్టమర్లు ధీమాగా పాత కార్లను సొంతం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తమ కంపెనీ వెబ్‌సైట్‌లో అన్ని మోడళ్ల వివరాలను పొందుపరుస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీకి 380 ఔట్‌లెట్లున్నాయి. రెండేళ్లలో మరో 120 ప్రారంభించనుంది. 2013-14లో కంపెనీ తన షోరూంల ద్వారా 57 వేలు, ఆన్‌లైన్ బీటూబీ పోర్టల్ ఇడిగ్ ద్వారా 60 వేల యూనిట్లను విక్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement