మహీంద్రా నుంచి మరో రెండు మోడళ్లు
పెట్రోల్ వెర్షన్లలో ప్రస్తుత మోడళ్లు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తోంది. ఇందులో ఇప్పటికే ప్రకటించిన కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన కేయూవీ100తోపాటు వెరిటో ఎలక్ట్రిక్ ఉన్నాయి. వెరిటో ఎలక్ట్రిక్ ధర రూ.13 లక్షలుండొచ్చు. మార్చికల్లా ఇది రోడ్లపై పరుగెత్తే అవకాశం ఉంది. ఇక కేయూవీ100 ధర రూ.4-6 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ మోడల్‌ను జనవరి 15న విడుదల చేస్తున్నామని కంపెనీ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వీజయ్ రామ్ నక్రా గురువారం తెలిపారు.
ప్రీమియం పిక్‌అప్ వాహనం ఇంపీరియోను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కంపెనీకి కేయూవీ100 మొదటి పెట్రోల్ మోడల్ అవుతుందని చెప్పారు. దీనిని డీజిల్ వేరియంట్లోనూ తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న కొన్ని మోడళ్లలో పెట్రోల్ వెర్షన్లను 2016లోనే ప్రవేశపెడతామని పేర్కొన్నారు.కాగా, అమ్మకాల పరంగా మహీంద్రాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ దేశంలో టాప్-2/3 స్థానంలో ఉంది.