పెట్రోల్ సెగ్మెంట్లోకి మహీంద్రా..
- కాంపాక్ట్ ఎస్‌యూవీతో మార్కెట్లోకి...
- వచ్చే నెల 15న కేయూవీ100 విడుదల
ముంబై: డీజిల్ వాహనాలను అధికంగా తయారు చేసే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తాజాగా పెట్రోల్ ఎస్‌యూవీల సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై ఇటీవల సుప్రీం కోర్డు నిషేధం విధించిన నేపధ్యంలో మహీంద్రా కంపెనీ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ, కేయూవీ100ను మార్కెట్లోకి తేనున్నది. డీజిల్ ఇంజిన్‌తో కూడా ఈ ఎస్‌యూవీని అందుబాటులోకి తెస్తామని కంపెనీ తెలిపింది. వాణిజ్యపరంగా వచ్చే నెల 15న మార్కెట్లోకి తెస్తామని, అప్పుడే ధరలను కూడా నిర్ణయిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా చెప్పారు.
బ్రాండ్ అంబాసిడర్‌గా వరుణ్ ధావన్...
ఈ కేయూవీ100 మంచి బ్రాండ్‌గా ఎదగగలదన్న ధీమాను గోయెంకా వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా ఈ మోడల్ అభివృద్ధి కోసం రూ.500 కోట్లు వెచ్చించామని తెలిపారు. ఎంఫాల్కన్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఎస్‌యూవీలను పుణే సమీపంలోని చకన్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం 5 సీట్ల ఈ ఎస్‌యూవీకి సంబంధించి 18 పేటెంట్ల కోసం దరఖాస్తు చేశామని తెలిపారు. కేయూవీ100లో 8 వేరియంట్లు తేనున్నామని, అన్నింటిలోనూ ఏబీఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లున్నాయని తెలిపారు. నేటి (శనివారం) నుంచి బుకింగ్‌లు ప్రారంభించామని, గ్రూప్ గౌరవ చైర్మన్ కేశుబ్ మహీంద్రా బుక్ చేసుకున్నారని చెప్పారు. కేయూవీ100కు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.