
మహీంద్రా నుంచి కొత్త ట్రాక్టర్
మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెంటర్(ఎఫ్‌ఈఎస్) కంపెనీ కొత్త ట్రాక్టర్, అర్జున్ నోవో 605ను బుధవారం ఆవిష్కరించింది.
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెంటర్(ఎఫ్‌ఈఎస్) కంపెనీ కొత్త ట్రాక్టర్, అర్జున్ నోవో 605ను బుధవారం ఆవిష్కరించింది. ప్రస్తుత ం మార్కెట్లో ఉన్న అర్జున్ 605 డీఐ మోడల్ స్థానంలో ఈ అర్జున్ నోవోను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ ట్రాక్టర్‌ను చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా, కంపెనీ వ్యవసాయ యంత్రాల విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ జెజుల్కర్ లాంఛనంగా ఆవిష్కరించారు.
ఎంఆర్‌వీ తొలి ఉత్పాదన
ఇక్కడి మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ(ఎంఆర్‌వీ)లోనే ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేశామని పవన్ గోయెంకా పేర్కొన్నారు. ఈ రీసెర్చ్ వ్యాలీ నుంచి వస్తున్న తొలి ఉత్పాదన ఇదని వివరించారు. ఈ ట్రాక్టర్‌ను రెండు వేరియంట్లలో -52 హెచ్‌పీ-605 డిఐ-పీఎస్(ధర రూ.7.15 లక్షలు) 57 హెచ్‌పీ -605 డిఐ(ధర రూ.7.35 లక్షలు. రెండు ధరలు ఎక్స్ షోరూమ్, పుణే)ల్లో అందిస్తున్నామని వివరించారు.
ఇంతకు ముందటి అర్జున్ ట్రాక్టర్‌తో పోల్చితే ధర రూ.15,000 అధికమని వివరించారు. ఓపెన్ స్టేషన్, ఏసీ క్యాబిన్(57 హెచ్‌పీ ట్రాక్టర్ ధర రూ.9.5 లక్షలు) ఆప్షన్లలలో ఈ రెండు వేరియంట్‌లను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కొత్త అర్జున్ ట్రాక్టర్ ఎక్కువ మైలేజీని ఇస్తుందని, 2,200 కేజీల బరువును ఎత్తగలిగే ప్రెసిషన్ హైడ్రాలిక్స్, అత్యాధునిక 15 ఎఫ్ ప్లస్ 3 ఆర్ ట్రాన్సిమిషన్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. సాంకేతికత పట్ల అవగాహన ఉన్న రైతు మొదటి ఎంపిక ఈ ట్రాక్టరే అవుతుందని వివరించారు.
ఈ ట్రాక్టర్‌ను వ్యవసాయ పనుల్లో 40 రకాల అవసరాల కోసం వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ అర్జున్ నోవో ట్రాక్టర్‌ను అభివృద్ధి చేయడానికి రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టామని, మరిన్ని వేరియంట్ల పరిశోధన కోసం మరో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ ట్రాక్టర్లను నాగ్‌పూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నామని, ఆర్నెల్లలో ఈ ట్రాక్టర్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని వివరించారు.
భవిష్యత్ కొత్త మోడల్ తెలంగాణ ప్లాంట్ నుంచే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో 10 రోజుల్లో ఈ ట్రాక్టర్ల విక్రయాలు ప్రారంభిస్తామని పవన్ గోయోంకా తెలిపారు. కంపెనీ మొత్తం ట్రాక్టర్ల విక్రయాల్లో ఏపీ, తెలంగాణ వాటా 8-10 శాతమని చెప్పారు. జహీరాబాద్ ప్లాంట్‌లో ప్రస్తుతం రోజుకు ఒక షిఫ్ట్‌లో వంద ట్రాక్టర్లను (తక్కువ హార్స్ పవర్ ఉన్నవి)ఉత్పత్తి చేస్తున్నామని, అవసరాన్ని బట్టి రెండో షిఫ్ట్‌ను కూడా ప్రారంభిస్తామని వివరించారు. భవిష్యత్‌లో తాము అందించే కొత్త ట్రాక్టర్ మోడల్ జహీరా బాద్ ప్లాంట్ నుంచే ఉంటుందని పవన్ గోయెంకా చెప్పారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పెట్టుబడి ప్రణాళికలు లేవని రాజేష్ జుజుల్కర్ పేర్కొన్నారు.