మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై 92 వేల తగ్గింపు
⇒ కేంద్ర ప్రభుత్వ ఫేమ్ స్కీమ్ ప్రభావం
⇒ త్వరలో హైదరాబాద్‌లో విక్రయాలు
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపునకు చెందిన మహీంద్రా రేవా ఎలక్ట్రిక వెహికల్స్ కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ఈ2ఓ ధరను 16 శాతం (రూ.92,000)తగ్గించింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు ప్రోత్సాహకాలనిచ్చే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఫేమ్ కారణంగా ధరను తగ్గిస్తున్నామని మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్స్ పేర్కొంది.
ఈ తగ్గింపు తర్వాత ఈ కారు ధర రూ.4.79 లక్షలని (ఆన్ రోడ్, ఢిల్లీ) మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీణ్ షా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఫేమ్(ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) స్కీమ్ కారణంగా ధరను ఈ స్థాయిలో తగ్గించామని ప్రవీణ్ షా వివరించారు. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ టూవీలర్లపై రూ.29,000, కార్లపై రూ.1.38 లక్షలు వరకూ ఈ ఫేమ్ స్కీమ్ ప్రోత్సాహకాలనిస్తోంది.
ఈ2ఓ కార్లను ఢిల్లీ, బెంగళూరు, పుణే నగరాల్లో విక్రయిస్తున్నామని, త్వరలో ఈ కార్ల విక్రయాలను హైదరాబాద్, అహ్మదాబాద్, భోపాల్‌లలో ప్రారంభిస్తామని ప్రవీణ్ షా ఈ సందర్భంగా తెలిపారు. ఈ స్కీమ్ ప్రయోజనకరమే కానీ, ఇప్పటికిప్పుడు అమ్మకాలు వేగంగా పెరిగే అవకాశాల్లేవని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది 600 లోపు కార్లను ఈ కంపెనీ విక్రయించగలిగింది.