మహీంద్రా జోరును తగ్గించిన ట్రాక్టర్లు
3 శాతం తగ్గిన నికర లాభం
ముంబై : మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.852 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో ఆర్జించిన నికర లాభం రూ.882 కోట్లతో పోలిస్తే 3 శాతం క్షీణత నమోదైందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. అమ్మకాలు క్షీణించడం, ట్రాక్టర్ల వ్యాపారం కుదేలవటంతో నికర లాభం తగ్గిందని మహీంద్రా గ్రూప్ ఈడీ పవన్ గోయెంకా చెప్పారు. నికర అమ్మకాలు 3 శాతం క్షీణించి రూ.9,708 కోట్లకు తగ్గాయని వివరించారు. ఈ క్యూ1లో పరిశ్రమ అమ్మకాలు 7 శాతం పెరగ్గా, తమ అమ్మకాలు 3 శాతం తగ్గాయని పేర్కొన్నారు.
కన్సాలిడేషన్ ప్రాతిపదికన ఆదాయం రూ.10,734 కోట్ల నుంచి రూ.10,474 కోట్లకు, ఇతర ఆదాయం రూ.189 కోట్ల నుంచి రూ.163 కోట్లకు తగ్గాయని చెప్పారు. జులైలో ట్రాక్టర్ల అమ్మకాలు 12% క్షీణించాయని, ప్రస్తుత క్వార్టర్(జూలై-సెప్టెంబర్)లో ట్రాక్టర్ల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం ఉండగలదని గోయెంకా వివరించారు. క్యూ1లో మార్జిన్లు 14 శాతం పెరిగాయని గ్రూప్ సీఎఫ్‌ఓ జి. పార్థసారధి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో మహీంద్రా షేర్ 0.5 శాతం క్షీణించి రూ.1,388 వద్ద ముగిసింది.