మహీంద్రా అండ్ మహీంద్రా
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత ధర: రూ.1,377
టార్గెట్ ధర: రూ. 1,525
ఎందుకంటే: మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు తగ్గడంతో ఆదాయం అంచనాలను అందుకోలేక రూ.9,830 కోట్లకు పరిమితమైంది. నికర లాభం రూ.852 కోట్లకు చేరింది. 2011-12లో 55 శాతంగా ఉన్న కంపెనీ యుటిలిటీ వాహనాల మార్కెట్ వాటా 2014-15లో 37 శాతానికి తగ్గింది. కొత్త మోడళ్లు లేకపోవడం వల్ల మార్కెట్ వాటా తగ్గిందని గుర్తించిన కంపెనీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలనే ఎక్స్‌యూవీ 500ను, చిన్న వాణిజ్య వాహనం జీతోను మార్కెట్లోకి తెచ్చింది. త్వరలో రెండు కొత్త మోడళ్లు(టీయూవీ 300ను, ఎస్101ను) తేనున్నది. ఈ రెండు కొత్త మోడళ్ల కారణంగా అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 35 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. 2010-15 కాలానికి 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించిన ఆదాయం రెండేళ్లలో 15 శాతం చొప్పున, 2010-15 కాలానికి 10 శాతం చొప్పున వృద్ధి సాధించిన నికర లాభం రెండేళ్లలో 18 శాతం చొప్పున వృద్ధి సాధించగలదని భావిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ట్రాక్టర్ల అమ్మకాలు పుంజుకోగలవని కంపెనీ భావిస్తోంది.
కమిన్స్ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత ధర: రూ.1,192
టార్గెట్ ధర: రూ. 1,350
ఎందుకంటే: కమ్మిన్స్ ఇండియా పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఎనిమిది సంస్థలతో వ్యాపారం సాగిస్తోంది. విద్యుదుత్పత్తి, పారిశ్రామిక, వాహన మార్కెట్లకు అవసరమైన డీజిల్, నేచురల్ గ్యాస్ ఇంజిన్లను తయారు చేస్తోంది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర అమ్మకాలు 20 శాతం వృద్ధితో రూ.1,314 కోట్లకు పెరిగాయి. నికర లాభం మాత్రం స్వల్పంగా తగ్గి రూ.210 కోట్లకు క్షీణించింది. విద్యుదుత్పత్తి విభాగం వ్యాపారం 23 శాతం, దేశీయ అమ్మకాలు 17 శాతం, ఎగుమతులు 36 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. కంపెనీకి దీర్ఘకాల, స్వల్పకాలిక రుణాలేమీ లేవు. అందుకని వడ్డీభార సమస్యే లేదు. మౌలిక రంగానికి పెట్టుబడులందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కంపెనీ పారిశ్రామిక వ్యాపార విభాగం పుంజుకోవచ్చు. రెండేళ్లలో నికర అమ్మకాలు 4 శాతం, నికర లాభం 5 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, షేర్‌వారీ ఆర్జన(ఈపీఎస్)ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.31గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.34 గానూ ఉండొచ్చని అంచనా.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
స్టాక్స్ వ్యూ
Published Mon, Aug 17 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement