తయారీ రంగానికి బూస్ట్..
చట్టాలు, నిబంధనలు మారుస్తాం
ఎకానమీని మళ్లీ వృద్ధి బాట పట్టిస్తాం
మేక్ ఇన్ ఇండియాపై పరిశ్రమ వర్గాలతో భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ రంగానికి, ఉపాధి కల్పనకూ ఊతమిచ్చే విధంగా అవసరమైతే చట్టాలను, ప్రభుత్వ పనితీరునూ మారుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎకానమీని మళ్లీ వృద్ధి బాట పట్టిస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై సోమవారం జరిగిన వర్క్‌షాప్‌లో పరిశ్రమవర్గాలు, ప్రభుత్వాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
‘గత 3 నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా సన్నద్ధమైంది. మారడానికి మేం సిద్ధంగా ఉన్నాం. చట్టాలు నిబంధనలు మార్చాలన్నా మార్చాలన్నా మేం రెడీ. ఆఖరికి వ్యవస్థే మారాలన్నా కూడా సిద్ధమే’ అని ఆయన చెప్పారు. తయారీ రంగం ఎదుగుదలకు ఎదురవుతున్న ఆటంకాలను పారదర్శకమైన, సమిష్టి నిర్ణయాలతో తొలగించగలమని హామీ ఇచ్చారు.
సాధారణంగా ప్రభుత్వ విధానాలు తప్పించుకునేట్లు, పక్కదారి పట్టించేవిగాను, గందరగోళంగానూ ఉంటూ జాప్యాలకు దారి తీస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. వీటిని ఏబీసీడీగా ఆయన అభివర్ణించారు. వీటి స్థానంలో జవాబుదారీతనం, యాజమాన్య ధోరణి, బాధ్యత, క్రమశిక్షణ అలవడేలా చూడటానికి కట్టుబడి ఉన్నామన్నారు. దీన్ని ఆయన ‘రోడ్ (ఆర్‌వోఏడీ)’గా అభివర్ణించారు. మానవ వనరుల అభివృద్ధి, నవకల్పనలు, పరిశోధనలనేవి ప్రభుత్వ పనితీరులో భాగమైపోవాలని ప్రధాని అభిప్రాయపపడ్డారు.
జీరో డిఫెక్ట్.. జీరో ఎఫెక్ట్..
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని లోప రహితంగానూ(జీరో డిఫెక్ట్), పర్యావరణానికి ఎలాంటి హాని కలుగని విధంగాను(జీరో ఎఫెక్ట్) అమలు చేయాలన్నది తమ లక్ష్యమని ప్రదాని చెప్పారు. అంతర్జాతీయంగా బ్రాండ్ ఇండియాకు ప్రత్యేక గుర్తింపు తేవాల్సిన అవసరం ఉందన్నారు. దేశమంతటా సమంగా అభివృద్ధి జరగాలని చెప్పారు. వర్క్‌షాప్‌లో ఎవరు ఏం చేయాలన్నది, విధానాల్లో ఏమేం మార్పులు చేయాలన్న దాంతో పాటు అనుసరించాల్సిన ప్రణాళికపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ తెలిపారు.
ఇక నిర్ణయాలు ఆటోమేటిక్‌గా అమలు కాగలవన్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో అందర్నీ భాగస్వాములను చేయడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానానికి కొత్త కోణం జోడిస్తున్నామని మోదీ చెప్పారు. అంతరిక్ష పరిశోధనల్లో భార తీయ శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయాల నుంచి, వారి పనితీరు నుంచి తయారీ రంగం ప్రేరణ పొందవచ్చని ఆయన సూచించారు.
వర్క్‌షాప్‌లో వజ్రాభరణాలు, ఆటోమొబైల్స్, చమురు.. గ్యాస్, విద్యుత్, రసాయనాలు తదితర 24 పైచిలుకు రంగాలకు సంబంధించిన పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వాధికారులు తమ అభిప్రాయాలు తెలిపారు. వచ్చే 30-40 ఏళ్ల అవసరాలకు సరిపడా సుశిక్షితులైన మానవ వనరులను అభివృద్ధి చేసుకునేందుకు విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, పరిశ్రమ వర్గాలు కలిసి పనిచేయాలని మోదీ సూచించారు. నవకల్పనలు, పరిశోధనలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాలన్నారు. పాతికేళ్ల నుంచి భారత్ ఐటీ రంగంలో సత్తా చాటుకుంటున్నప్పటికీ, గూగుల్ వంటి దిగ్గజాన్ని సృష్టించలేకపోయిందని, మన నిపుణులు విదేశాలకు తరలిపోతున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాపారాలకు అవరోధాలు తొలగిస్తాం: అరుణ్ జైట్లీ
వ్యాపారాలకు అవరోధాలు తొల గించి, సానుకూల పరిస్థితులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మెరుగైన పన్ను విధానాలు అమలు చేస్తామని, మేక్ ఇన్ ఇండియా నినాదం కింద తయారీ రంగానికి తోడ్పాటు అందిస్తామని ఆయన చెప్పారు. ఇటు దేశీ, అటు విదేశీ మార్కెట్లకు ఎగుమతుల కోసం చౌకగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడమే తమ ముఖ్యోద్దేశం అని మేక్ ఇన్ ఇండియాపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ వివరించారు.
మరోవైపు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కఠిన పరపతి విధానాలపై ఆయన విమర్శలు గుప్పించారు. తయారీ రంగంలో మందగమనానికి ఏకైక కారణం అధిక వడ్డీ రేట్లేనని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఈ వారం జరిగే బ్యాంకర్ల భేటీ .. మేక్ ఇన్ ఇండియా నినాదానికి మరింత ఊతం ఇవ్వగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజన్‌పై విసుర్లు..: ఎగుమతుల కన్నా దేశీ మార్కెట్‌పై దృష్టితో మేక్ ఇన్ ఇండియాను తలపెట్టాలంటూ రాజన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై జైట్లీ ఘాటుగా స్పందించారు. దీని ప్రధానోద్దేశం.. చౌక ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల తయారీ మాత్రమేనని, అవి దేశీ మార్కెట్ కోసమా లేక ఎగుమతుల కోసమా అన్నది అప్రస్తుతం అన్నారు. ‘మేక్ ఇండియా అనేది భారత్‌లో వినియోగదారుల కోసమా లేక విదేశాల్లో వారి కోసమా అన్నది అప్రస్తుతం.
ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా నాణ్యమైన వస్తువులు చౌకగా కొనుక్కోవాలనుకుంటున్నారన్నది నేటి ప్రధాన సూత్రం. చౌకగా, నాణ్యమైన సర్వీసులు పొందాలనుకుంటున్నారు’ అని జైట్లీ చెప్పారు. ఇటు ధరలోనూ, అటు నాణ్యతలోనూ పోటీపడలేకపోతే భారత్ కేవలం వ్యాపార దేశంగా మాత్రమే మిగిలిపోతుందే తప్ప తయారీ కేంద్రంగా ఎదగలేదన్నారు. పన్నుల విధానాలు స్థిరంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈసారి కన్నా వచ్చే ఏడాదిలో ఆర్థిక వృద్ధి మరింత మెరుగుపడగలదని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు.